Cricket News: 160కిమీ వేగంతో బంతులేశాడట.. గొప్పలకు పోయిన పాక్‌ బౌలర్‌

పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ మహ్మద్‌ సామి ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు 160 కిమీ వేగానికిపైగా బంతులేశానని గొప్పలు చెబుతున్నాడు. అయితే, అప్పుడు స్పీడ్‌గన్‌ లేకపోవడం వాటిని...

Published : 01 May 2022 14:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ మహ్మద్‌ సమి ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు 160 కి.మీ వేగానికిపైగా బంతులేశానని గొప్పలు చెబుతున్నాడు. అయితే, అప్పుడు స్పీడ్‌గన్‌ వాటిని గుర్తించలేదట. తాజాగా ఓ స్థానిక ఛానల్‌తో మాట్లాడిన అతడు ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సమి కొన్నాళ్ల పాటు దిగ్గజ పేసర్‌, స్పీడ్‌స్టర్‌ షోయబ్‌ అక్తర్‌తో కలిసి బౌలింగ్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అతడు పాక్‌ జట్టులో కొద్దికాలం ప్రధాన బౌలర్లలో ఒకడిగా రాణించాడు.

‘నేనొక మ్యాచ్‌లో రెండు బంతుల్ని 160 కి.మీ వేగానికిపైగా బౌలింగ్‌ చేశా. అందులో ఒకటి 162 కి.మీ వేగంతో పడింది. మరొకటి 164 కి.మీ వేగంతో దూసుకెళ్లింది. కానీ, అప్పుడు స్పీడ్‌గన్‌ (బౌలింగ్‌ వేగాన్ని కొలిచే మెషీన్‌) పనిచేయడంలేదని సిబ్బంది చెప్పడంతో ఆ బంతుల్ని లేక్కలోకి తీసుకోలేదు. అయితే, ప్రపంచ క్రికెట్‌లో 160 కి.మీ వేగంతో బంతులేసిన సందర్భాలు ఒకటో, రెండో మాత్రమే ఉంటాయి’ అని సమి పేర్కొన్నాడు. కాగా, ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో అత్యధిక వేగం నమోదు చేసింది అక్తర్‌ మాత్రమే. అతడు 2002లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 161 కి.మీ వేగంతో ఒక బంతిని సంధించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని