Dhoni: ధోనీ పని అయిపోలేదు.. ఇప్పటికీ గొప్ప ఫినిషర్‌: మహ్మద్‌ కైఫ్

చెన్నై మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ పని అయిపోలేదని, అతడు ఇంకా అత్యుత్తమ ఫినిషర్‌గానే ఉన్నాడని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ అభిప్రాయపడ్డాడు...

Published : 05 Apr 2022 02:07 IST

 (Photo: Mohammed Kaif Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నై మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ పని అయిపోలేదని, అతడు ఇంకా అత్యుత్తమ ఫినిషర్‌గానే ఉన్నాడని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ అభిప్రాయపడ్డాడు. ధోనీ ఇటీవల మెగా టోర్నీ ప్రారంభానికి ముందు రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ పగ్గాలు అందజేసిన సంగతి తెలిసిందే. దీంతో అతడు పక్కా ప్రణాళిక ప్రకారమే ఉన్నాడని కైఫ్‌ చెప్పాడు. తాజాగా ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడిన మాజీ క్రికెటర్‌ ఇలా చెప్పుకొచ్చాడు.

‘ధోనీ పని అయిపోయిందని, ఇదే అతడి చివరి టీ20 లీగ్‌ అని పలువురు అంటున్నారు. కానీ, అతడు ఎలా ఆడుతున్నాడో చూడండి. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఎంత దూకుడుగా ఆడాడో చూడండి. ఆ రెండు మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలిచి వీలైనన్ని పరుగులు చేశాడు. దీంతో అతడింకా అత్యుత్తమ ఫినిషర్‌గానే ఉన్నాడు. ఈసారి మనం ఇంతకుముందులాంటి ధోనీని చూడబోతున్నాం. అతడు ఈ సీజన్‌ ప్రారంభానికి ముందు కెప్టెన్సీ వదిలేశాడు. కాబట్టి ఈసీజన్‌లో పెద్దగా ఒత్తిడికి గురికాకుండా ఆడతాడు. ఇంతకుముందు తొలి బంతి నుంచే ఎలా ధాటిగా ఆడేవాడో.. అలాంటి ధోనీనే చూస్తాం. ఇక్కడి పిచ్‌లు బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటాయి. ముంబయి, పుణె మైదానాల్లో పేస్‌కు అనుకూలముంటుంది. దీంతో ధోనీ నుంచి మెరుపు బ్యాటింగ్‌ చూడొచ్చు’ అని కైఫ్‌ వివరించాడు. కాగా, గతరాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ (23; 28 బంతుల్లో 1x4, 1x6) ధాటిగా ఆడే అవసరం ఉన్నా నెమ్మదిగా ఆడడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని