WTC Fianl: బుమ్రా ఉన్నా.. షమినే నం.1 బౌలర్‌

సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్‌ఇండియాకు మహ్మద్‌ షమి నంబర్‌ వన్‌ బౌలరని మాజీ పేసర్‌ అజిత్‌ అగార్కర్‌ అన్నారు. జస్ప్రీత్‌ బుమ్రా వేగంగా ఎదుగుతున్నా ప్రధాన పేసర్‌ మాత్రం అతడేనని పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతడు వికెట్లు తీయగలడని వెల్లడించారు....

Published : 08 Jun 2021 17:47 IST

పరిస్థితులు ఎలాగున్నా  వికెట్లు తీస్తాడన్న అగార్కర్‌

ముంబయి: సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్‌ఇండియాకు మహ్మద్‌ షమి నంబర్‌ వన్‌ బౌలరని మాజీ పేసర్‌ అజిత్‌ అగార్కర్‌ అన్నారు. జస్ప్రీత్‌ బుమ్రా వేగంగా ఎదుగుతున్నా ప్రధాన పేసర్‌ మాత్రం అతడేనని పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతడు వికెట్లు తీయగలడని వెల్లడించారు. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అతడే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడన్న ఆశాభావం వ్యక్తంచేశాడు.

‘మహ్మద్‌ షమి ఎక్కువ వికెట్లు తీస్తాడని అనుకుంటున్నా. బుమ్రా వేగంగా ఎదుగుతున్నాడన్నది నిజమే. కానీ నా వరకు షమినే టీమ్‌ఇండియా నంబర్‌వన్‌ బౌలర్‌. టెస్టు క్రికెట్లో పరిస్థితులతో సంబంధం లేకుండా అతడు బౌలింగ్‌ చేస్తాడు. బంతితో స్వింగ్‌, సీమ్‌ రాబట్టగలడు’ అని అగార్కర్‌ అన్నారు.

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను న్యూజిలాండ్‌ ఫేవరెట్‌గా ఆరంభిస్తోందని అజిత్‌ తెలిపారు. టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ మాత్రం అత్యధిక పరుగులు చేస్తాడని అంచనా వేశారు. ఏ జట్టు గెలుస్తుందో మాత్రం చెప్పలేనని పేర్కొన్నారు.

‘ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టం. ఫైనల్‌ను న్యూజిలాండ్‌ ఫేవరెట్‌గా మొదలుపెడుతోంది. ఎక్కువ పరుగులు చేసేది మాత్రం విరాటేనని అనుకుంటున్నా. రెండోసారి ఇంగ్లాండ్‌లో పర్యటించినప్పుడు కఠిన పరిస్థితులు ఎదురైనా, ఇబ్బందులు వచ్చినా ఏం చేయగలడో అతడు మనకు చూపించాడు. జట్టు కోసం నిలబడతానని నిరూపించాడు’ అని అగార్కర్‌ తెలిపారు. జూన్‌ 18న సౌథాంప్టన్ వేదికగా ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మొదలవుతున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని