IND Vs BAN : వన్డే సిరీస్‌కు ముందు టీమ్‌ఇండియాకు షాక్‌.. షమీ ఔట్‌

గాయం కారణంగా సీనియర్‌ పేసర్‌ షమీ బంగ్లాతో వన్డే సిరీస్‌ మొత్తానికి దూరం అయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ ట్వీట్‌ చేసింది.

Updated : 03 Dec 2022 11:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బంగ్లాదేశ్‌తో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్‌ తగిలింది. గాయం కారణంగా సీనియర్‌ పేసర్‌ షమీ ఈ సిరీస్‌ మొత్తానికి దూరం అయ్యాడు. బీసీసీఐ ఈ మేరకు ట్వీట్‌ చేసింది. భుజం గాయంతో షమీ ఇబ్బందిపడుతున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. షమీ స్థానంలో భారత యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌కు జట్టులో చోటు కల్పించారు.

‘‘బంగ్లాతో వన్డే సిరీస్‌కు ముందు నిర్వహించిన ట్రైనింగ్‌ సెషన్‌లో షమీకి గాయమైంది. అతడు ప్రస్తుతం ఎన్‌సీఏ పర్యవేక్షణలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌కు వెళ్లే టీమ్‌తో అతడు వెళ్లలేదు’ అని బీసీసీఐ తెలిపింది. అయితే అతడి గాయం తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలియరాలేదు.

వన్డే సిరీస్‌తోపాటు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌కూ షమీ దూరమయ్యే అవకాశాలు ఉండటం ఇప్పుడు జట్టులో ఆందోళన కలిగిస్తోంది. ‘వన్డే సిరీస్‌కు షమీ లేకపోవడం పెద్ద లోటే. అయితే.. బుమ్రా గైర్హాజరిలో టెస్టు సిరీస్‌కూ అతడు దూరమైతే ఇది అంతకంటే పెద్ద ఆందోళనే’ అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ఎందుకంటే జూన్‌లో ఓవల్‌లో జరగబోయే ప్రపంచకప్‌ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ రేసులో ఉండాలంటే.. టీమ్‌ ఇండియా ప్రతి మ్యాచ్‌ గెలవాల్సిన అవసరం ఉంది. షమీ ఇప్పటి వరకూ 60 టెస్టు మ్యాచ్‌ల్లో 216 వికెట్లు పడగొట్టాడు.

ఇక బంగ్లా పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది.

బంగ్లాతో వన్డేలకు టీమ్‌ఇండియా జట్టు ఇదే.. : రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైఎస్‌ కెప్టెన్‌), ధావన్‌, కోహ్లీ, రజత్‌ పాటిదార్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రాహుల్‌ త్రిపాఠి, పంత్‌(వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), షాబాజ్‌ అహ్మద్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దుల్‌ ఠాకూర్‌, సిరాజ్‌, దీపక్‌ చాహర్‌, కుల్‌దీప్‌సేన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని