Ban vs Ind: సిరాజ్‌, లిటన్‌ దాస్‌ మధ్య మాటల యుద్ధం.. తర్వాత బంతికే క్లీన్‌బౌల్డ్

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్‌ఇండియా బౌలర్‌ సిరాజ్‌, బంగ్లా బ్యాటర్‌ లిటన్‌ దాస్‌ మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగింది. ఇది జరిగిన తర్వాత బంతికే లిటన్‌ దాస్‌ ఔటయ్యాడు.  

Published : 15 Dec 2022 21:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్‌ఇండియా బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj) మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే మూడు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్‌ను దెబ్బతీశాడు. నజ్ముల్ హొస్సేన్‌ (0), జకీర్ హసన్‌ (20), లిటన్ దాస్‌ (24)ని సిరాజ్‌ పెవిలియన్‌కు పంపాడు. లిటన్ దాస్‌ (Litton Das) ఔట్‌ కావడానికి ముందు సిరాజ్‌, దాస్‌ మధ్య కాసేపు మాటల యుద్ధం చోటుచేసుకుంది. 

టీ విరామం తర్వాత సిరాజ్‌ 14వ ఓవర్‌ వేశాడు. తొలి బంతిని 140 కి.మీ.వేగంతో విసరగా.. దానిని ఎదుర్కోవడంలో లిటన్‌ దాస్‌ కాస్త ఇబ్బంది పడ్డాడు. దీంతో సిరాజ్‌ లిటన్‌ దాస్‌ను ఏదో అన్నాడు. అది అర్థం కాక ‘ఏంటి మళ్లీ చెప్పు’ అంటూ దాస్.. సిరాజ్‌ వైపు వెళ్లాడు. దీంతో గొడవ పెద్దది కాకుండా ఉండేందుకు అంపైర్‌ మధ్యలో కలుగజేసుకుని దాస్‌ని పక్కకు తీసుకెళ్లాడు.  అయితే, తర్వాత బంతికే లిటన్‌ దాస్‌ క్లీన్‌ బౌల్డ్‌ కావడంతో సిరాజ్‌ సంబరాల్లో మునిగి తేలాడు. దాస్‌ పెవిలియన్ వెళ్తుండగా.. విరాట్ కోహ్లీ.. అతడి వైపు చూస్తూ ‘ఏంటి మళ్లీ చెప్పు’ అన్నట్టు సైగ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇక, మ్యాచ్‌ విషయానికొస్తే తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 404 పరుగులకు ఆలౌటైంది. పూజారా (90), శ్రేయస్ అయ్యర్‌ (86), అశ్విన్‌ (58), పంత్‌ (46), కుల్‌దీప్ యాదవ్‌ (40) రాణించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ఎనిమిది వికెట్లు నష్టపోయి 133 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో కుల్‌దీప్‌ యాదవ్‌ నాలుగు, సిరాజ్‌ మూడు, ఉమేశ్ యాదవ్ ఒక వికెట్‌ పడగొట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని