సిరాజ్ ‘ట్రెండ్’ సెట్ చేశాడు!

క్రికెట్‌లో జాత్యహంకారానికి చోటు లేదని ఆస్ట్రేలియా స్పిన్నర్‌ నేథన్‌ లైయన్ అన్నాడు. సిడ్నీ టెస్టులో టీమిండియా యువపేసర్ మహ్మద్‌ సిరాజ్‌ను లక్ష్యంగా చేసుకుని కొందరు ప్రేక్షకులు జాత్యహంకార వ్యాఖ్యలు....

Published : 13 Jan 2021 17:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌లో జాత్యహంకారానికి చోటు లేదని ఆస్ట్రేలియా స్పిన్నర్‌ లైయన్ అన్నాడు. సిడ్నీ టెస్టులో టీమిండియా యువపేసర్ మహ్మద్‌ సిరాజ్‌ను లక్ష్యంగా చేసుకుని కొందరు ప్రేక్షకులు జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మ్యాచ్ అధికారులకు సిరాజ్‌ ఫిర్యాదు చేయగా ఆకతాయిల్ని సెక్యూరిటీ సిబ్బంది స్టేడియం బయటకు పంపించింది. ఈ నేపథ్యంలో జాతివివక్షపై లైయన్ మాట్లాడాడు. క్రికెట్‌లో సిరాజ్‌ కొత్త ప్రమాణాన్ని నెలకొల్పాడని తెలిపాడు. వివక్షకు గురైతే ఆటను నిలిపివేసి, ఆకతాయిల్ని స్టేడియం బయటకి పంపించే అవకాశం ఆటగాళ్లకు ఉందని అతడు‌ తెలియజేశాడని చెప్పాడు.

‘‘క్రికెట్‌లో జాత్యహంకారానికి, దూషణకు చోటు లేదు. ఇలా చేయడం ప్రజలు ఫన్నీగా భావిస్తారు. కానీ ఇది ఆటగాళ్లను ఎంతో ప్రభావితం చేస్తుంది. సిరాజ్‌కు జరిగిన సంఘటన బాధాకరం. గతంలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా పర్యటనల్లో నేనూ అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను. సాధ్యమైనంత వరకు అవి జరగకుండా ప్రయత్నించాలి. అయితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే వాటిని మ్యాచ్ అధికారుల వద్దకు తీసుకువెళ్లాలి. ఎంతో మంది సెక్యూరిటీ సిబ్బంది స్టేడియంలో ఉంటారు. ఆకతాయిల్ని క్షణాల్లో స్టాండ్స్‌ నుంచి ఖాళీ చేయిస్తారు. అయితే ఆటగాళ్లకు అవాంఛనీయ సంఘటనలు ఎదురవ్వవని ఆశిస్తున్నా’’ అని లైయన్‌ పేర్కొన్నాడు.

సిడ్నీ టెస్టులో సిరాజ్‌తో పాటు బుమ్రా కూడా జాత్యహంకార వ్యాఖ్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మూడో రోజు ఆట అనంతరం టీమిండియా యాజమాన్యం ఈ విషయాన్ని ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియా, మ్యాచ్‌ అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది. నాలుగో రోజు కూడా సిరాజ్‌ను లక్ష్యంగా చేసుకుని కొందరు ప్రేక్షకులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో సిరాజ్ అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. ఆటను పది నిమిషాలు పాటు నిలిపివేసి ఆకతాయిల్ని సెక్యూరిటీ సిబ్బంది స్టేడియం బయటకు పంపింది.

దీ చదవండి

ముగ్గురు మొనగాళ్లు.. మీ విలువకు సరిలేరు

స్మిత్ ఎంతో అమాయకుడట..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని