IND vs BAN: లిటన్‌ దాస్‌తో అలా అన్నాను.. అందుకే ఆ మాటల యుద్ధం: మహమ్మద్‌ సిరాజ్‌

బంగ్లాతో టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో లిటన్‌ దాస్‌తో జరిగిన వివాదంపై మహమ్మద్‌ సిరాజ్‌(Mohammed Siraj) స్పందించాడు. 

Updated : 29 Jun 2023 16:11 IST


చట్‌గావ్‌: బంగ్లాతో తొలి రోజు టెస్టు మ్యాచ్‌ సందర్భంగా టీమ్‌ఇండియా పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్(Mohammed Siraj), బంగ్లా బ్యాటర్‌ లిటన్‌ దాస్‌ మధ్యన మాటల యుద్ధం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. 14వ ఓవర్లో సిరాజ్‌ వేసిన బంతి విషయంలో వీరిద్దరి మధ్య సంభాషణ చోటుచేసుకుంది. సిరాజ్‌ మాటలకు దాస్‌ స్పందిస్తూ ఏంటి మళ్లీ చెప్పు అన్నట్టుగా సైగ చేశాడు. అది భారత ఆటగాళ్లకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ఆ సమయంలో అంపైర్ కలుగజేసుకోవడంతో ఆ విషయం అక్కడితో సర్దుకుంది. అయితే, ఆ తర్వాతి బంతికే దాస్‌ను సిరాజ్‌ పెవిలియన్‌ బాట పట్టించి సంబరాలు చేసుకున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే, ఇంతకీ వీరి మధ్య ఏం జరిగింది అనే విషయం మాత్రం మైదానంలో ఉన్న వారికి అర్థం కాలేదు. తాజాగా ఈ విషయంపై సిరాజ్‌ వివరణ ఇచ్చాడు.

‘‘దాస్‌ నా బంతిని ఎదుర్కొన్న సమయంలో నేను అతడితో ఇది టీ20 ఫార్మాట్‌ కాదు.. టెస్టు క్రికెట్‌ కాస్త బాధ్యతగా ఆడాలని అన్నాను’’ అంటూ స్పష్టత ఇచ్చాడు. ఇక బంగ్లా(IND vs BAN)తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్‌ రాణించింది. శుభ్‌మన్‌ గిల్‌, ఛెతేశ్వర్‌ పుజారా చెరో శతకాన్ని బాదేశారు. దీంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ను 258/2తో ముగించింది. మొత్తం 513 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాకు నిర్దేశించింది. గిల్‌కి ఇది తొలి సెంచరీ కాగా.. పుజారా ఈ మ్యాచ్‌లో తన 19వ సెంచరీని నమోదు చేశాడు. 102 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని