Siraj: అప్పుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా.. నాన్న ఇచ్చే రూ.60తో స్టేడియానికి వచ్చేవాడిని!

క్రికెటర్‌గా ఎదిగే రోజుల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని టీమ్‌ఇండియా యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్ అన్నాడు. కుటుంబ పోషణ కోసం తన తండ్రి ఆటో నడిపేవాడని,  ఆర్థికంగా ఇబ్బందులు ఉండటంతో తాను ఉప్పల్

Published : 19 Feb 2022 01:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెటర్‌గా ఎదిగే రోజుల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని టీమ్‌ఇండియా యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్ అన్నాడు. కుటుంబ పోషణ కోసం తన తండ్రి ఆటో నడిపేవాడని,  ఆర్థికంగా ఇబ్బందులు ఉండటంతో తాను ఉప్పల్ స్టేడియంలో శిక్షణ పొందడానికి వెళ్లేందుకు రోజూ రూ.60 ఇచ్చేవాడని గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్‌ తనకు ఖ్యాతి తెచ్చిపెట్టిందని, ఈ మెగా టోర్నీకి ఎంపిక కావడంతో సమస్యలు తీరాయని సిరాజ్‌ పేర్కొన్నాడు. ఐపీఎల్‌ 2022 మెగా వేలానికి ముందు  మహ్మద్‌ సిరాజ్‌ను రూ.7 కోట్లకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) రిటెన్షన్‌ చేసుకుంది.‘నేను క్రికెటర్‌గా ఎదిగే సమయంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా. మా నాన్న ఆటో నడిపేవారు. నా దగ్గర ప్లాటినా బైక్‌ మాత్రమే ఉండేది. నేను శిక్షణ పొందే ఉప్పల్‌ స్టేడియం మా ఇంటికి చాలా దూరంలో ఉంటుంది. అక్కడి వెళ్లడానికి బైక్‌కు పెట్రోల్‌ కోసం నాన్న రూ.60 ఇచ్చేవారు. దాంతోనే వెళ్లి వచ్చే వాడిని’ అని సిరాజ్‌ వివరించాడు. 

‘ఐపీఎల్‌కు ఎంపిక కావడంతో నా కష్టాలన్నీ తీరాయి. నాన్న ఆటో నడపడం ఆపేశారు. అద్దె ఇంట్లో ఉండటం మానేసి కొత్త ఇల్లు కొనుక్కున్నాం. జీవితంలో ఇంతకు మించి నాకేమీ అవసరం లేదు. ఐపీఎల్ నాకు కీర్తిని తెచ్చింది. ఆర్‌సీబీ జట్టులోని అందరినీ నా ఇంటికి భోజనానికి పిలిచా. విరాట్ కోహ్లీని కూడా ఆహ్వానించా. ‘నాకు వెన్ను నొప్పి ఉంది. నేను రాలేను’ అని విరాట్ చెప్పాడు. దీంతో విశ్రాంతి తీసుకోమని చెప్పి హోటల్ నుంచి నేరుగా ఇంటికి వెళ్లా. అందరూ కారులో వచ్చి దిగడం చుశాను. ఆసక్తికర విషయం ఏంటంటే.. రాలేను అని చెప్పిన విరాట్ కోహ్లీ మా ఇంటికి వచ్చాడు. దీంతో ఒక్కసారిగా ఆనందంతో పరుగెత్తుకుని వెళ్లి అతనిని కౌగిలించుకున్నా. వెంటనే విరాట్ కోహ్లీ టోలీచౌకీ వచ్చాడని వార్తలొచ్చాయి. కోహ్లీ మా ఇంటికి రావడం నా జీవితంలో బెస్ట్ సర్‌ప్రైజ్‌’ అని మహ్మద్‌ సిరాజ్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని