IND Vs SA : బుమ్రా స్థానంలో మహమ్మద్‌ సిరాజ్‌

బుమ్రా స్థానంలో హైదరాబాద్‌ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ను సెలెక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది..

Updated : 30 Sep 2022 11:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ :  వెన్ను గాయం కారణంగా టీమ్‌ఇండియా పేస్‌ గన్‌ బుమ్రా.. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌ టోర్నీకీ దూరమైన విషయం తెలిసిందే. దీంతో అతడి స్థానంలో హైదరాబాద్‌ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ను సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. సఫారీలతో టీ20 సిరీస్‌ తదుపరి మ్యాచ్‌లకు అతడిని ఎంపిక చేసినట్లు ప్రకటించింది. మరోవైపు బుమ్రా గాయంపై కూడా బీసీసీఐ స్పష్టత ఇచ్చింది. ‘బుమ్రా వెన్ను గాయానికి గురయ్యాడు. అతడు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు’ అని అధికారికంగా ప్రకటించింది.

వెన్ను గాయం కారణంగా బుమ్రా ఆగస్టు-సెప్టెంబరులో ఆసియాకప్‌నకు దూరమయ్యాడు. కోలుకున్న అతడు సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌తో పునరాగమనం చేశాడు. కానీ ఆ సిరీస్‌లోనూ తొలి మ్యాచ్‌లో ఆడలేదు. సెప్టెంబరు 23, 25వ తేదీల్లో రెండు, మూడో మ్యాచ్‌ల్లో ఆడాడు. గాయం తిరగబెట్టడంతో బుధవారం దక్షిణాఫ్రికాతో మొదటి టీ20లో ఆడలేదు. దక్షిణాఫ్రికాతో తొలి టీ20 టాస్‌కు కొద్ది నిమిషాల ముందు బుమ్రా గాయం గురించి బీసీసీఐ వెల్లడించింది. ‘మంగళవారం ప్రాక్టీస్‌ సెషన్‌ సమయంలోనే అతడు వెన్ను నొప్పి గురించి చెప్పాడు. బీసీసీఐ వైద్య బృందం అతడిని పరిశీలిస్తోంది. అతడు మ్యాచ్‌ ఆడటం లేదు’ అని బీసీసీఐ తెలిపింది. ఈ గాయం కారణంగా పొట్టి ప్రపంచకప్‌నకూ అతడు దూరమయ్యాడు.

ఇప్పటికే మోకాలి గాయం వల్ల ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మెగా టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు ఆటగాళ్లను కోల్పోవడం టీమ్‌ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బే అని విశ్లేషకులు అంటున్నారు. ఇక ప్రపంచకప్‌ జట్టులో బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడానికి ఫాస్ట్‌బౌలర్లు మహ్మద్‌ షమి, దీపక్‌ చాహర్‌ మధ్య పోటీ ఉంది. వీళ్లిద్దరూ ఇప్పటికే స్టాండ్‌బైలు అన్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని