
Siraj: పేరు మార్మోగుతుందన్న వీవీఎస్
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్లో ఎదిగే సత్తా మహ్మద్ సిరాజ్కు ఉందని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. ఫాస్ట్ బౌలర్లకు ఉండాల్సిన రెండు ప్రధాన లక్షణాలు అతడికీ ఉన్నాయని పేర్కొన్నారు. న్యూజిలాండ్తో జరిగే ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్లో అతడికి చోటు దొరుకుతుందో లేదోనన్న ఆసక్తి నెలకొందన్నాడు.
హైదరాబాదీ యువపేసర్ మహ్మద్ సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా ఎదుగుతున్న సంగతి తెలిసిందే. అనుభవం పెరిగే కొద్దీ నిలకడగా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో సీనియర్ పేసర్లు లేకున్నా జట్టుకు అండగా నిలిచాడు. ఏకంగా 13 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్లో అదరగొట్టాడు. కచ్చితత్వంతో యార్కర్లు వేసి ఆశ్చర్యపరిచాడు. కోహ్లీ అతడిని ప్రశంసించి ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధంగా ఉండాలని చెప్పడం గమనార్హం.
‘సిరాజ్ కొన్నేళ్లు ఇలాగే కష్టపడితే అంతర్జాతీయ క్రికెట్లో అతడి పేరు మార్మోగుతుంది. అతడికి అన్ని నైపుణ్యాలు ఉన్నాయి. సత్తా ఉంది. ప్రతి ఫాస్ట్ బౌలరుకు రెండు అవసరాలు ఉంటాయి. మొదట బంతిని అద్భుతంగా స్వింగ్ చేయాలి. సిరాజ్ అందులో నేర్పరి. సుదీర్ఘంగా బౌలింగ్ చేయడం రెండోది. అతడిలో ఈ సత్తా కూడా ఉంది. ఒక రోజులో మూడో స్పెల్ సైతం అతడు వేయగలడు. అంతేకాకుండా మొదటి రెండు స్పెల్స్లోని వేగం, కచ్చితత్వాన్ని కొనసాగించగలడు’ అని లక్ష్మణ్ అన్నారు. షమి, బుమ్రా, ఇషాంత్ అందుబాటులో ఉండటంతో ఫైనల్స్లో సిరాజ్కు చోటు దొరుకుతుందో లేదోనన్న ఆసక్తి నెలకొందని ఆయన చెబుతున్నారు.