Virat Kohli: కింగ్‌ కోహ్లి.. ఈ రికార్డులు కొట్టేనా?.. ఊరిస్తున్న మరిన్ని రికార్డులు!

అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్‌ శకం తర్వాత విరాట్ కోహ్లిదే (Virat Kohli) అనడంలో అతిశయోక్తి లేదు. క్రికెట్ గాడ్‌ సాధించిన రికార్డులను అధిగమిస్తూ కోహ్లి ముందుకు సాగిపోతున్నాడు.

Published : 18 Nov 2023 12:01 IST

వన్డేల్లో 50 శతకాలు.. ఎవరైనా ఊహించి ఉంటారా? ఈ రికార్డు సొంతమవుతుందని.. చరిత్ర తిరగరాసే ఆటగాడు వస్తాడని.. కానీ రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లి (Virat Kohli) వచ్చాడు. అద్భుతమైన ఆటతో, అమోఘమైన నిలకడతో వన్డేల్లో 50 సెంచరీలు ఖాతాలో వేసుకున్నాడు. క్రికెట్‌ దేవుడు సచిన్‌ పేరిట ఉన్న 49 శతకాల రికార్డును ఇప్పుడు కింగ్‌ కోహ్లి బద్దలుకొట్టాడు. అన్ని ఫార్మాట్లలోనూ అత్యుత్తమ ఆటతీరుతో సాగుతున్న కోహ్లి ఇప్పటికే ఎన్నో రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. మరే బ్యాటర్లకు సాధ్యం కాని ఘనతలనూ సొంతం చేసుకున్నాడు. అతని రికార్డుల ప్రయాణం గురించి ఎంత చెప్పినా తక్కువే. అతని అసాధారణ నైపుణ్యాలను ఏమని పొగడగలం? ఇప్పుడు వన్డేల్లో 50 శతకాలు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచిన కోహ్లీని మరికొన్ని రికార్డులు ఊరిస్తున్నాయి. మరి వీటిని విరాట్‌ అందుకుంటాడా? 

వంద శతకాలు..

అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు. దశాబ్దాల సుదీర్ఘ క్రికెట్‌ చరిత్రలో ఇప్పటి వరకూ సచిన్‌కు ఒక్కడికే సాధ్యమైన ఘనత ఇది. మరే ఆటగాడు కూడా ఈ రికార్డును చేరుకుంటాడని, సచిన్‌ను అందుకుంటాడని అప్పుడు ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఇప్పుడు కోహ్లి ఆ రికార్డునూ సొంతం చేసుకుంటాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘అంతర్జాతీయ క్రికెట్లో సచిన్‌ వంద శతకాలు చేసినప్పుడు అతనికి దగ్గరగా వచ్చే ఆటగాడు ఉంటాడని ఎవరైనా అనుకున్నారా? కానీ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటికే 80 సెంచరీలు చేశాడు. ఇందులో వన్డేల్లో 50 శతకాలతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇది నమ్మశక్యం కానిదే. కోహ్లి లాంటి ఆటగాళ్లకు ఏదీ అసాధ్యం కాదు. మంచినీళ్లు తాగినంత సులువుగా సెంచరీలు కొట్టేస్తారు. కోహ్లి ఆడబోయే 10 ఇన్నింగ్స్‌ల్లో మరో 5 శతకాలు చూసే అవకాశముంది. మూడు ఫార్మాట్లలోనూ అతను ఆడతున్నాడు. కోహ్లీకి మరో మూణ్నాలుగేళ్ల కెరీర్‌ మిగిలే ఉంది. అతను సచిన్‌ రికార్డును చేరుకునే అవకాశముంది’’ అని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. రవిశాస్త్రి వ్యాఖ్యల్లో అతిశయోక్తి లేదనే చెప్పాలి. అంతర్జాతీయ క్రికెట్లో వంద శతకాలతో సచిన్‌ను చేరుకునే అవకాశం ఇప్పుడు కోహ్లికి ఉంది. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో కలిపి విరాట్‌ 80 సెంచరీలతో ఉన్నాడు. అతనికి ఎంత లేదన్నా మరో నాలుగైదేళ్ల కెరీర్‌ కచ్చితంగా ఉంటుంది. ఈ ఏడాది ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో కలిపి అతను 8 సెంచరీలు చేశాడు. ఇకపై ఏడాదికి కనీసం అయిదు సెంచరీలు కొట్టినా అతను 100 శతకాల రికార్డును బద్దలుకొట్టొచ్చు. 

ఇలాగే సాగితే..

ఫామ్‌ లేమితో ఇబ్బందిపడ్డప్పుడు కూడా కోహ్లి ఏమంత పేలవ ప్రదర్శన చేయలేదు. పరుగులు సాధించాడు. కానీ శతకాలే చేయలేకపోయాడు. అలాంటిది ఒక్కసారి అతను జోరందుకుంటే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. 2017, 2018లో అన్ని ఫార్మాట్లలో కలిపి 11 చొప్పున సెంచరీలు చేసిన కోహ్లి.. ఇప్పుడు మళ్లీ అదే అత్యుత్తమ స్థితిలో కనిపిస్తున్నాడు. కరోనా, ఆ తర్వాత ఫామ్‌ లేమితో 2020, 2021లో కోహ్లి ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. 2022లో 2 శతకాలు మాత్రమే చేశాడు. మధ్యలో అతనికి ఈ పరిస్థితి రాకపోయి ఉంటే ఇప్పటికే 90 సెంచరీలకు పైనే చేసేవాడు. ఇప్పుడు కోహ్లికి 35 ఏళ్లు. అతని ఫిట్‌నెస్‌ చూస్తే మరో నాలుగైదు ఏళ్లు సులువుగా ఆడేలా కనిపిస్తున్నాడు. తనంతట తాను వైదొలగితే తప్ప అతణ్ని జట్టు నుంచి తొలగించే సాహసం చేయలేకపోవచ్చు. కాబట్టి కోహ్లి కచ్చితంగా మరిన్ని రికార్డులు తిరగరాసే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కోహ్లి (573 ఇన్నింగ్స్‌లో 26478) నాలుగో స్థానంలో ఉన్నాడు. అగ్రస్థానంలో ఉన్న సచిన్‌ (782 ఇన్నింగ్స్‌లో 34357)కు, కోహ్లికి మధ్య అంతరం 7879 పరుగులు. ఇక వన్డేల్లో సచిన్‌ (18426) అగ్రస్థానంలో, కోహ్లి (13794) మూడో స్థానంలో ఉన్నారు. సచిన్‌ను చేరుకోవాలంటే కోహ్లి ఇంకా 4632 పరుగులు చేయాలి. టెస్టుల్లో సచిన్‌ 15921 పరుగులతో నంబర్‌వన్‌గా ఉండగా.. కోహ్లి 8676 పరుగులతో ఉన్నాడు. ఇక అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లి (4008)దే అగ్రస్థానం. 2020కి ముందు కోహ్లి వరుసగా నాలుగేళ్ల పాటు 2400కు పైగా పరుగుల చొప్పున సాధించాడు. ఈ ఏడాది ఇప్పటికే 1880 పరుగులు చేశాడు. కాబట్టి కోహ్లి ఇదే ఫామ్‌ కొనసాగిస్తే.. వన్డేలు, టెస్టులతో పాటు అంతర్జాతీయ పరుగుల పరంగానూ సచిన్‌ను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదనే చెప్పాలి.  

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని