Cricket News: టీ20 లీగ్‌ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకుంది వీళ్లే..!

టీ20 క్రికెట్‌లో బౌలర్లు.. ఎలాంటి బంతులేసినా అవతలివైపు చీల్చి చెండాడే బ్యాట్స్‌మెన్‌ ఉంటారు. వాళ్లు ఒక్క ఓవర్‌లోనే మ్యాచ్‌ ఫలితాల్ని తారుమారు చేస్తారు...

Updated : 07 Apr 2022 14:03 IST

ఒక్క ఓవర్‌లోనే 30కిపైగా పరుగులు ఇచ్చిన బౌలర్లు

టీ20 క్రికెట్‌లో బౌలర్లు.. ఎలాంటి బంతులేసినా అవతలివైపు చీల్చి చెండాడే బ్యాట్స్‌మెన్‌ ఉంటారు. వాళ్లు ఒక్క ఓవర్‌లోనే మ్యాచ్‌ ఫలితాల్ని తారుమారు చేస్తారు. దీంతో బౌలర్లు ఎక్కడ బంతులేయాలో అర్థంకాక తికమక పడతారు. గతరాత్రి ముంబయి బౌలర్‌ డానియల్‌ సామ్స్‌కు అచ్చం అలాంటి పరిస్థితే ఎదురైంది. కోల్‌కతాపై అతడు వేసిన 16వ ఓవర్‌లో ప్యాట్‌ కమిన్స్‌ రెచ్చిపోయాడు. ఒకే ఓవర్‌లో 35 పరుగులు రాబట్టాడు. అలా ఈ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్లు ఎవరు. వారు ఎన్ని పరుగులు ఇచ్చారో మనం తెలుసుకుందాం.

పరమేశ్వరన్‌ @ 37

(Photo: Prasanth Parameswaran Instagram)

2011లో టోర్నిలో ఒక బౌలర్‌ తొలిసారి ఓవర్‌లో అత్యధికంగా 37 పరుగులు సమర్పించుకున్నాడు. బెంగళూరుతో జరిగిన ఆ మ్యాచ్‌లో కొచీ బౌలర్‌ ప్రశాంత్‌ పరమేశ్వరన్‌ వేసిన మూడో ఓవర్‌లో క్రిస్‌గేల్‌ (44; 16 బంతుల్లో 3x4, 5x6) వీర విధ్వంసం సృష్టించాడు. అతడు వరుసగా (6, 6 నో బాల్‌, 4, 4, 6, 6, 4) బంతులను బౌండరీ దాటించాడు. దీంతో ఈ ఓవర్‌ పూర్తయ్యేసరికి బెంగళూరు స్కోర్‌ 66/0కి చేరింది. ఇక ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కొచీ 125/9 తక్కువ స్కోరుకే పరిమితం కాగా.. బెంగళూరు 13.1 ఓవర్లలో గేల్‌ వికెట్‌ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అతడు ఉన్నంతసేపు పరుగుల వరద పారించడం గమనార్హం.

హర్షల్‌ పటేల్‌ @ 37

(Photo: Harshal Patel Instagram)

2011 తర్వాత మళ్లీ పదేళ్లకు అలాంటి రికార్డే నమోదైంది. గతేడాది చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్‌ హర్షల్‌ పటేల్‌ ఒకే ఓవర్‌లో 37 పరుగులు ఇచ్చుకున్నాడు. అతడు వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో జడేజా (62 నాటౌట్‌; 28 బంతుల్లో 4x4, 5x6) పరుగుల వరద పారించాడు. దీంతో వరుసగా (6, 6, 6 నోబాల్‌, 6, 2, 6, 4) బంతిని చితక్కొట్టడంతో 20వ ఓవర్‌కు ముందు 154/4తో ఉన్న స్కోర్‌బోర్డు తర్వాత 191/4కు చేరింది. అయితే, లక్ష్య ఛేదనలో బెంగళూరు 122/9 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. ఇలా ఈ టోర్నీలో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న ఆటగాళ్ల జాబితాలో హర్షల్‌ పటేల్‌ రెండో స్థానంలో నిలిచాడు.

డానియల్‌ సామ్స్‌ @ 35

(Photo: Daniel Sams Instagram)

ఇక ప్రస్తుతం జరుగుతోన్న 15వ సీజన్‌లో గతరాత్రి ముంబయి బౌలర్‌ డానియల్‌ సామ్స్‌ ఒకే ఓవర్‌లో 35 పరుగులు సమర్పించుకొని ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి నాలుగు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో కోల్‌కతా 15 ఓవర్లు పూర్తయ్యేసరికి 127/5తో పోరాడుతోంది. ఇక సామ్స్‌ వేసిన 16వ ఓవర్‌లోనే ప్యాట్‌ కమిన్స్‌ (56 నాటౌట్‌; 15 బంతుల్లో 4x4, 6x6) రెచ్చిపోయాడు. తనలోని విధ్వంసక బ్యాట్స్‌మెన్‌ కోణాన్ని తొలిసారి పరిచయం చేస్తూ (6, 4, 6, 6, 2 నోబాల్, 4, 6) ముంబయిపై విరుచుకుపడ్డాడు. చివరికి ఈ ఓవర్‌తోనే కోల్‌కతాను విజయతీరాలకు చేర్చాడు. అలా సామ్స్‌కు పీడకల మిగిల్చాడు.

రవిబోపారా @ 33

(Photo: Ravi Bopara Instagram)

2010లో పంజాబ్‌ బౌలర్‌ రవి బోపారా ఒకే ఓవర్‌లో 33 పరుగులు ఇచ్చుకొని ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. కోల్‌కతాతో జరిగిన ఆ మ్యాచ్‌లో క్రిస్‌గేల్‌ (88; 42 బంతుల్లో 6x4, 8x6) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా బోపారా వేసిన 13వ ఓవర్‌లో వరుసగా నాలుగు సిక్సులు బాదాడు. ఇక తొలి బంతికి, చివరి బంతికి మనోజ్‌ తివారి (35; 32 బంతుల్లో 2x4) రెండు సింగిల్స్‌ తీశాడు. అయితే, చివరి బంతి రెండు సార్లు వైడ్‌గా నమోదై మొత్తం ఏడు అదనపు పరుగులొచ్చాయి. దీంతో ఈ ఒక్క ఓవర్‌లో కోల్‌కతాకు 33 పరుగులు రావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 200/3 భారీ స్కోర్‌ సాధించగా పంజాబ్‌ 18.2 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌ మహేలా జయవర్దెనె (110 నాటౌట్‌; 59 బంతుల్లో 14x4, 3x6) శతకంతో మెరిశాడు.

పర్విందర్‌ అవానా @ 33

(Photo: Parvinder Awana Instagram)

ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచిన బౌలర్‌ పర్విందర్‌ అవానా. 2014లో పంజాబ్‌ తరఫున ఆడిన అతడు చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 33 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ ఆరు వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. వీరేందర్‌ సెహ్వాగ్‌ (122; 58 బంతుల్లో 12x4, 8x6) శతకంతో చెలరేగాడు. ఇక లక్ష్య ఛేదనలో చెన్నై 202/7 స్కోరుకే పరిమితమైంది. సురేశ్‌ రైనా (87; 25 బంతుల్లో 12x4, 6x6) ఉన్నంతలో కాసేపు పరుగుల వేట సాగించాడు. ముఖ్యంగా పర్విందర్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌లో (6, 6, 4, 4, 5నోబాల్‌, 4, 4) బౌండరీల మోత మోగించాడు. అయితే, అతడు అనుకోకుండా రనౌటవ్వడంతో చెన్నై ఓటమిపాలైంది.

- ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని