Suryakumar Yadav: ‘నా లైఫ్‌లో ఇంపార్టెంట్‌ క్యాచ్‌ అదే’.. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ క్యాచ్ కాదు

టీ20 ప్రపంచ కప్‌ 2024 ఫైనల్‌లో డేవిడ్‌ మిల్లర్‌ ఇచ్చిన క్యాచ్‌ను సూర్యకుమార్ (Suryakumar Yadav) అద్భుతమైన రీతిలో అందుకున్నాడు. అయితే, ఈ క్యాచ్ తన జీవితంలో ముఖ్యమైన క్యాచ్ కాదంటున్నాడు స్కై. 

Published : 09 Jul 2024 10:40 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా స్టార్‌ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) 2024 టీ20 ప్రపంచ కప్‌లో రాణించాడు. 8 మ్యాచ్‌ల్లో 135.37 స్ట్రైక్‌రేట్‌తో 199 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో బ్యాటర్‌గా విఫలమైనా, ఫీల్డర్‌గా అదరగొట్టాడు. చివరి ఓవర్‌లో మొదటి బంతికి డేవిడ్ మిల్లర్‌ ఇచ్చిన క్యాచ్‌ని బౌండరీ లైన్‌ వద్ద తన శరీర బరువును నియంత్రించుకుంటూ అద్భుతంగా అందుకున్నాడు. దీంతో మ్యాచ్ భారత్‌ చేతిలోకి వచ్చేసింది. ఈ క్యాచ్‌ సూర్య కెరీర్‌లోనే కాకుండా భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అయితే, సూర్యకుమార్‌ మాత్రం డేవిడ్ మిల్లర్‌ క్యాచ్‌ తన జీవితంలో ముఖ్యమైనది కాదంటున్నాడు. తన భార్య దేవిశా శెట్టిని వివాహం చేసుకోవడం లైఫ్‌లో ఇంపార్టెంట్‌ క్యాచ్‌ అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టి అభిమానుల దృష్టిని ఆకర్షించాడు.

ఇటీవల సూర్యకుమార్‌- దేవిశా శెట్టి దంపతుల ఎనిమిదో వివాహ వార్షికోత్సవం జరిగింది. ఈ జంట పెద్ద కేక్‌ను కట్‌ చేసి అందుకు సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంది. సూర్య ఈ ఫొటోలను షేర్ చేస్తూ ‘‘ఆ క్యాచ్‌ (వరల్డ్ కప్‌ ఫైనల్‌ మిల్లర్‌ క్యాచ్) పట్టి నిన్నటికి ఎనిమిది రోజులైంది. కానీ నా లైఫ్‌లో ముఖ్యమైన క్యాచ్ అందుకొని 8 సంవత్సరాలు అవుతోంది’’ అనే క్యాప్షన్‌ను జోడించాడు. ఈ పోస్టుకు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. మీరిద్దరూ కలకాలం ఇలానే కలిసుండాలని విషెస్‌ చెబుతున్నారు. సూర్యకుమార్‌-దేవిశాశెట్టిల వివాహం జులై 7, 2016లో జరిగింది. 2010లో ఓ కాలేజీ వేడుకలో వీరికి పరిచయం ఏర్పడింది. అదే పెళ్లికి దారితీసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని