T20 League: అత్యధిక మెయిడిన్‌ ఓవర్లు వేసింది వీళ్లే

టీ20 లీగ్‌ అంటేనే బ్యాట్స్‌మెన్‌కు పరుగుల పంట. బౌలర్లు ఎలాంటి బంతులేసినా వాటిని బౌండరీలకు తరలించడమే వారి పని. వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించి ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం చెలాయించాలనుకుంటారు...

Updated : 26 Mar 2022 14:33 IST

పరుగుల వరద పారే టోర్నీలో మెరిసిన బౌలర్లు

టీ20 లీగ్‌ అంటేనే బ్యాట్స్‌మెన్‌కు పరుగుల పంట. బౌలర్లు ఎలాంటి బంతులేసినా వాటిని బౌండరీలకు తరలించడమే వారి పని. వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించి ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం చెలాయించాలనుకుంటారు. అయితే.. పలువురు బౌలర్లు అత్యుత్తమ గణాంకాలు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా మెయిడిన్‌ ఓవర్లు వేసి ఆకట్టుకున్నారు.

ప్రవీణ్‌ కుమార్‌ @ 14..

అత్యధిక మెయిడిన్‌ ఓవర్లు వేసింది ఒకప్పటి టీమ్‌ఇండియా మీడియం పేస్‌ బౌలర్‌ ప్రవీణ్‌కుమార్‌. అతడు 2008 నుంచి 2017 వరకు బెంగళూరు, పంజాబ్‌, ముంబయి, హైదరాబాద్‌ జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలోనే 119 మ్యాచ్‌లు ఆడి 420.4 ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. మొత్తం 90 వికెట్లు తీయడంతో పాటు 14 ఓవర్లు మెయిడిన్‌గా వేశాడు. అతడి సగటు 36.12 కాగా, ఎకానమీ 7.72. దీన్ని బట్టి ఎంత పొదుపుగా బౌలింగ్‌ చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రవీణ్‌ 2017లో చివరిసారి ఈ టోర్నీలో ఆడినా ఇప్పటికీ లీగ్‌లో అత్యధిక మెయిడిన్‌ ఓవర్లు వేసిన బౌలర్‌గా ఉన్నాడు.

ఇర్ఫాన్‌ పఠాన్‌ @ 10..

ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది కూడా భారత ఆటగాడే. అతడే మాజీ పేస్‌ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌. టోర్నీ ఆరంభ సీజన్‌ నుంచి 2017 వరకూ ఆడిన అతడు.. పంజాబ్‌, దిల్లీ, హైదరాబాద్‌, చెన్నై, పుణె, గుజరాత్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇర్ఫాన్‌ మొత్తం 103 మ్యాచ్‌ల్లో 340.3 ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. అందులో 80 వికెట్లు తీయడమే కాకుండా 10 మెయిడిన్‌ ఓవర్లు సాధించాడు. సగటు 33.11 ఉండగా ఎకానమీ 7.77గా నమోదు చేశాడు. అతడు కూడా 2017లోనే చివరిసారి ఆడడం గమనార్హం.

భువనేశ్వర్‌ @ 9..

ఈ జాబితాలో ప్రస్తుత హైదరాబాద్‌ కీలక పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ మూడో స్థానంలో ఉన్నాడు. అతడు టోర్నీ ఆరంభం నుంచి ఆడుతున్నాడు. బెంగళూరు జట్టుతో అరంగేట్రం చేసిన భువి తర్వాత పుణె, ఆపై హైదరాబాద్‌ జట్లలో భాగమయ్యాడు. ఇక 2014 నుంచి హైదరాబాద్‌తోనే కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు మొత్తం 132 మ్యాచ్‌లు ఆడిన స్వింగ్‌ బౌలర్‌ 491.3 ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. అందులో 142 వికెట్లు పడగొట్టడమే కాకుండా 9 మెయిడిన్‌ ఓవర్లు నమోదు చేశాడు. కాగా, 28.76 సగటుతో పై ఇద్దరికన్నా మెరుగ్గా ఉన్నాడు. ఎకానమీ 8.30గా నమోదైంది.

ఆ తర్వాత ఎవరున్నారంటే..

ఇక టాప్‌-3 తర్వాత మిగిలిన వారిలో ధావల్‌ కుల్‌కర్ణి, లసిత్‌ మలింగ, సందీప్‌ శర్మ 8 (సమానం) మెయిడిన్‌ ఓవర్లతో వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో నిలిచారు. ఆపై డేల్‌ స్టెయిన్‌ 7, దీపక్‌ చాహర్‌, అమిత్‌ మిశ్రా, హర్భజన్‌ సింగ్, జస్ప్రిత్ బుమ్రా, ఇషాంత్‌ శర్మ 6 మెయిడిన్లతో కొనసాగుతున్నారు.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని