IPL 2022: ప్రపంచకప్‌ గెలిచినా.. వేలానికి అనర్హులేనా..?

ఇటీవల టీమ్‌ఇండియా అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచినా అందులోని చాలా మంది యువకులు రాబోయే మెగా వేలంలో పాల్గొనేందుకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది...

Updated : 08 Feb 2022 13:08 IST

(ఫొటో : బీసీసీఐ ట్విటర్‌ నుంచి)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల టీమ్‌ఇండియా అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచినా అందులోని చాలా మంది యువకులు రాబోయే మెగా వేలంలో పాల్గొనేందుకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అండర్-19 ఆటగాళ్లు ఐపీఎల్‌ వేలంలో పాల్గొనాలంటే బీసీసీఐ కొన్ని షరతులు విధించిన సంగతి తెలిసిందే. కచ్చితంగా దేశవాళీ క్రికెట్‌లో ఒక ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ లేదా లిస్ట్‌-ఏ గేమ్‌ ఆడిన వారే అందుకు అర్హులు. ఒకవేళ దేశవాళీ క్రికెట్‌లో ఆడిన అనుభవం లేకపోతే.. వేలం జరిగే తేదీ నాటికి ఆయా క్రికెటర్లు 19 ఏళ్లు కలిగి ఉండాలి.

అయితే, ఇప్పుడు ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో కనీసం 8 మంది ఆటగాళ్లు బీసీసీఐ పేర్కొన్న అర్హతలు సాధించలేకపోయారు. దీంతో ప్రపంచకప్‌ గెలవడంలో ముఖ్య భూమిక పోషించిన షేక్‌ రషీద్‌, దినేశ్‌ బానా, రవికుమార్‌, నిషాంత్‌ సింధు లాంటి కీలక ఆటగాళ్లు సైతం అవకాశం కోల్పోయే పరిస్థితి తలెత్తింది. మరోవైపు ఈ విషయంపై బీసీసీఐ త్వరలోనే సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బోర్డు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొంతకాలంగా కరోనా మహమ్మారి వల్ల దేశవాళీ క్రికెట్‌ మ్యాచ్‌లు జరగకపోవడమే అందుకు కారణమని వాళ్లు చెప్పారు. మరోవైపు ఈనెల 17 నుంచి ఈ సీజన్‌ రంజీ ట్రోఫీ మొదలవుతుండటంతో ఆయా రాష్ట్ర సంఘాలు తమ ఆటగాళ్లను ఎంపిక చేసినా అవకాశం ఉండదు. ఎందుకంటే మెగా వేలం 12, 13 తేదీల్లోనే నిర్వహిస్తున్నారు. ఇక ఈ మెగా వేలంలో మొత్తం 590 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా.. అందులో 228 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు..  మరో 355 మంది యువకులు ఉన్నారు. మరో ఏడుగురు అసోసియేట్‌ దేశాల క్రికెటర్లూ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని