
దంచికొడితే బంతే భయపడ్డది!
ఒకే ఓవర్లో పూనకం వచ్చినట్టు కొట్టేశారు
పొట్టి క్రికెట్ అంటేనే సిక్సర్లు.. బౌండరీలు.. బ్యాట్స్‌మెన్ ఎన్ని షాట్లు ఆడితే అభిమానికి అంత సంతోషం. ఇప్పటి వరకు టీ20ల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు యువరాజ్ సింగ్ (6 సిక్సర్లు) పేరుతో ఉంది. ఆ తర్వాత అదే స్థాయిలో రాహుల్ తెవాతియా సంచలనం రేపాడు. ఐపీఎల్-2020లో ఐదు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అలాంటి విధ్వంసకర ఓవర్లు ఈ సీజన్లో ఇంకెన్ని ఉన్నాయో తెలుసా!
తెవాతియా.. నభూతో!
షార్జా వేదికగా పంజాబ్, రాజస్థాన్ తలపడ్డ పోరు గుర్తుందిగా! రాహుల్ సేన నిర్దేశించిన 224 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాహుల్ తెవాతియా (53; 31 బంతుల్లో 7×6) విధ్వంసాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. ఎందుకంటే అప్పటిదాకా బంతులు తిన్న అతడు ఆఖర్లో ప్రళయమే సృష్టించాడు. షెల్డన్ కాట్రెల్ వేసిన 18వ ఓవర్లో 30 పరుగులు చేశాడు. 500 స్ట్రైక్‌రేట్‌తో ఐదు సిక్సర్లు బాదేశాడు. లీగులోనే అతిపెద్ద ఛేదనను సాధ్యం చేశాడు. ఈ ఓవర్లో అతడు వరుసగా 4 సిక్సర్లు దంచాడు. ఐదో బంతిని వదిలేశాడు. మళ్లీ ఆరో బంతిని స్టేడియం దాటించాడు. 2020 సీజన్లో ఒకే ఓవర్లు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
యంగ్ గేల్.. పూరన్
నికోలస్ పూరన్ మళ్లీ తనలోని యుక్తవయసు క్రికెటర్‌ను గుర్తుకు తెస్తున్నాడని క్రిస్‌గేల్ అన్నాడంటే అతడెంత ప్రతిభాశాలో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సీజన్లో పంజాబ్‌కు ఆడిన పూరన్ భారీ సిక్సర్లతో మైదానాలను హోరెత్తించాడు. జట్టుకు కీలక విజయాలు అందించాడు. దుబాయ్ వేదికగా హైదరాబాద్‌తో జరిగిన పోరులో అతడు ఒకే ఓవర్లో 28 పరుగులు సాధించాడు. 466.66 స్ట్రైక్‌రేట్‌తో 4 సిక్సర్లు, ఒక బౌండరీ బాదేశాడు. ఈ మ్యాచులో హైదరాబాద్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ ఛేదించలేకపోయింది. అయితే పూరన్ (77; 37 బంతుల్లో 5×4, 7×6) మాత్రం ఉన్నంతసేపూ భయపెట్టాడు.
పొలి కేక
ముంబయిలోని మ్యాచు విజేతల్లో కీరన్ పొలార్డ్ ఒకరు. రోహిత్‌సేనకు అతడు సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్నాడు. మ్యాచులను ముగిస్తూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సీజన్ లీగ్ దశ మొత్తం అతడు 200 స్ట్రైక్‌రేట్‌తో కొనసాగాడు. దుబాయ్ వేదికగా బెంగళూరుతో పోరులో అతడు ఒకే ఓవర్లో 27 పరుగులు సాధించాడు. ఆడమ్ జంపా వేసిన 17వ ఓవర్లో 3 సిక్సర్లు, ఒక బౌండరీ బాదాడు. 2, 3 రూపంలో మిగతా ఐదు పరుగులు సాధించాడు. 450 స్ట్రైక్‌రేట్‌తో దంచికొట్టాడు కాబట్టే బెంగళూరు చేసిన 201 స్కోరును ముంబయి సమం చేసింది. పొలార్డ్ 24 బంతుల్లోనే 3 బౌండరీలు, 5 సిక్సర్లతో 60 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఆ నలుగురు ‘26’
హార్దిక్ పాండ్య (ముంబయి), జోఫ్రా ఆర్చర్ (రాజస్థాన్), కేఎల్ రాహుల్ (పంజాబ్) ఎలాంటి హిట్టర్లో మనకు తెలిసిందే. ఆసీస్ ఆల్‌రౌండర్ ప్యాట్ కమిన్స్ (కోల్‌కతా) సైతం తనదైన రోజున బ్యాటు ఝుళిపించగలడు. ఈ నలుగురూ ఈ సీజన్లో ఒకే ఓవర్లో 26 పరుగులు సాధించారు. రాజస్థాన్‌పై పాండ్య 3 సిక్సర్లు, 2 బౌండరీలు బాదాడు. చెన్నైపై జోఫ్రా 4 సిక్సర్లు దంచాడు. దుబాయ్ వేదికగా బెంగళూరుపై రాహుల్ 3 సిక్సర్లు, 2 బౌండరీలు సాధించాడు. ఐదుసార్లు విజేత ముంబయిపై అబుదాబిలో కమిన్స్ 4 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. వీరంతా ఒకే ఓవర్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ముందున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.