Asia Cup: ఆడింది తక్కువ.. పెర్ఫామెన్స్ ఎక్కువ.. ఆసియా కప్‌లో వారిదే హవా

ఆగస్టు 30 నుంచి పాకిస్థాన్‌, శ్రీలంక వేదికగా ఆసియా కప్‌ (Asia Cup 2023) ప్రారంభంకానుంది. ఈ టోర్నీ (వన్డే ఫార్మాట్‌)లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లెవరు, ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్లు ఎవరో తెలుసుకుందాం.

Published : 28 Aug 2023 14:58 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆగస్టు 30 నుంచి పాకిస్థాన్‌, శ్రీలంక వేదికగా ఆసియా కప్‌ (Asia Cup 2023) ప్రారంభంకానుంది. ఇప్పటివరకు ఈ టోర్నీని 15 సార్లు నిర్వహించగా.. అత్యధికంగా భారత్ (Team India) ఏడుసార్లు విజేతగా నిలిచింది. ఆసియా కప్‌ను 2016, 2022 సంవత్సరాల్లో టీ20 ఫార్మాట్‌లో మిగతా అన్ని సీజన్లలో వన్డే ఫార్మాట్‌లో టోర్నీని నిర్వహించారు. ఈ సారి ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో జరగనుంది. మరి ఆసియా కప్‌ (వన్డే ఫార్మాట్‌)లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లెవరు, ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్లు ఎవరో తెలుసుకుందాం.

తొలి రెండు స్థానాల్లో లంకేయులే

శ్రీలంక మేటి క్రికెటర్లలో సనత్‌ జయసూర్య, కుమార సంగక్కరలు ముందువరుసలో ఉంటారు. వీరు ఎన్నో మ్యాచ్‌ల్లో లంకకు ఒంటిచేత్తో విజయాలనందించారు. ఆసియా కప్‌లోనూ వీరికి మంచి రికార్డుంది. సనత్ జయసూర్య ఆసియా కప్‌లో 24 ఇన్నింగ్స్‌ల్లో 53.04 సగటుతో 1,220 పరుగులు బాది అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. అత్యధిక స్కోరు 130 కాగా.. మొత్తం 6 సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు చేశాడు. 2008 ఆసియా కప్‌లో 75.60 సగటుతో 378 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక, వికెట్ కీపర్‌ కుమార సంగక్కర 23 ఇన్నింగ్స్‌ల్లో 48.86 సగటుతో 1,075 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. అతడి ఖాతాలో నాలుగు సెంచరీలు, 8 అర్ధ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోరు 121.

3 నుంచి 5లో మనోళ్లు ఇద్దరు 

క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ (Sachin Tendulkar)కు ఆసియా కప్‌లో మెరుగైన రికార్డే ఉంది. అతడు 23 ఇన్నింగ్స్‌ల్లో 51.10 సగటుతో 971 పరుగులు చేసి మూడో స్థానంలో నిలిచాడు. భారత్ తరఫున ఈ టోర్నీలో ఎక్కువ పరుగులు చేసింది సచినే. మొత్తం మీద రెండు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు బాదాడు. అత్యధిక స్కోరు 114. పాకిస్థాన్ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు.ఈ పాక్‌ ఆల్‌రౌండర్‌ 15 ఇన్నింగ్స్‌ ఆడి 65.50 సగటుతో 786 పరుగులు సాధించాడు. టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ (Rohit Sharma) ఈ జాబితాలో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాడు. హిట్‌మ్యాన్‌ ఇప్పటివరకు 21 ఇన్నింగ్స్‌ ఆడి 46.56 సగటుతో 745 రన్స్‌ చేశాడు. ఇందులో సెంచరీ (111*), 6 అర్ధ సెంచరీలున్నాయి. ఈ ఆసియా కప్‌లో రాణిస్తే అతడు సచిన్‌ను అధిగమించే అవకాముంది.

ఏమిటీ యోయో?.. భారత క్రికెట్లో మళ్లీ ఫిట్‌నెస్‌ పరీక్షపై చర్చ

టాప్‌-5లో ఆ దేశం నుంచే నలుగురు.. 

ఆసియా కప్‌లో శ్రీలంక ఆటగాళ్ల హవా బ్యాటింగ్‌కే పరిమితం కాకుండా బౌలింగ్‌లోనూ కొనసాగింది. ఎక్కువ వికెట్లు పడగొట్టిన టాప్‌-5లో లంక ఆటగాళ్లు ఏకంగా నలుగురు ఉన్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే టాప్‌-5లో ఉన్న బౌలర్లలో నలుగురు స్పిన్నర్లే. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేసే దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ ఈ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు 24 మ్యాచ్‌ల్లో 3.75 ఎకానమీతో 30 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన (5/31). 

తక్కువ మ్యాచ్‌ల్లో అదిరే ప్రదర్శన

అగ్రస్థానంలో ఉన్న మురళీధరన్ 24 మ్యాచ్‌ల్లో 30 వికెట్లు పడగొడితే.. టాప్‌-5లో మిగతా నలుగురు అతని కంటే తక్కువ మ్యాచ్‌లు ఆడి మంచి ఆటతీరు కనబర్చారు. యార్కర్ల కింగ్ లసిత్ మలింగ 14 మ్యాచ్‌ల్లోనే 4.65 ఎకానమీతో 29 వికెట్లు పడగొట్టి రెండో స్థానంలో నిలిచాడు. అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన (5/34). లంకకే చెందిన స్పిన్నర్‌ అజంతా మెండిస్‌ 8 మ్యాచ్‌ల్లోనే 26 వికెట్లు పడగొట్టి మూడో స్థానంలో ఉన్నాడు. అత్యుత్తమ ప్రదర్శన (6/13). ఈ జాబితా టాప్‌-5లో ఉన్న శ్రీలంకేతర బౌలర్‌ సయ్యద్ అజ్మల్. పాక్‌ మాజీ స్పిన్నర్‌ అజ్మల్ 19 మ్యాచ్‌ల్లో 25 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో లంక మాజీ ఫాస్ట్‌బౌలర్‌ చమింద వాస్‌ ఐదో స్థానంలో ఉన్నాడు. అతడు 19 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు పడగొట్టాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని