MS Dhoni: ‘కెప్టెన్‌ కూల్’ మరో ఘనత.. ఐపీఎల్‌లో తొలి క్రికెటర్‌గా ధోనీ రికార్డు

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK vs GT) చిత్తు చేసి టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. ఈ క్రమంలో ఎంఎస్ ధోనీ (MS Dhoni) అరుదైన ఘతనను సాధించిన తొలి క్రికెటర్‌గా మారాడు.

Updated : 30 May 2023 10:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) మరో ఘనత సాధించాడు. ఇప్పటికే ఐదు ఐపీఎల్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్న ధోనీ.. 250 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇందులో ఎక్కువగా సీఎస్‌కే తరఫున ఆడిన ధోనీ.. రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌కూ ప్రాతినిధ్యం వహించాడు. ధోనీ తర్వాత రోహిత్ శర్మ 243 మ్యాచ్‌లు, దినేశ్‌ కార్తిక్ 242 మ్యాచ్‌లతో కొనసాగుతున్నారు. ఐదు టైటిళ్లను గెలిచిన సారథిగా రోహిత్‌ను ధోనీ సమం చేశాడు. 

గుజరాత్ టైటాన్స్‌పై సీఎస్‌కే ఐదు వికెట్ల తేడాతో (డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధతి ప్రకారం) విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 214/4 స్కోరు చేసింది. వర్షం కారణంగా టార్గెట్‌ను 15 ఓవర్లకు 171 పరుగులకు కుదించారు. ఓపెనర్ డేవన్ కాన్వే (47: 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుతమైన ఆటతో సీఎస్‌కే గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అతడికే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది. ఈ సందర్భంగా కాన్వే మాట్లాడుతూ.. ‘‘చాలా కాలంగా ఇలాంటి ప్రదర్శన చేయడానికి వేచి చూస్తున్నా.  ఆరంభంలో కాస్త ఆందోళన చెందా. కానీ, రుతురాజ్‌ గైక్వాడ్‌తో కలిసి ఆడటం బాగుంది. వ్యక్తిగతంగా నా కెరీర్‌లో ఈ టైటిల్‌ విజయం అద్భుతమైంది. మైక్‌ హస్సీకి క్రెడిట్‌ దక్కుతుంది. అతడితో పని చేయడం కలిసొచ్చింది’’ అని తెలిపాడు. 

మా పోరాటం పట్ల గర్వంగా ఉంది: హార్దిక్‌

‘‘మేం జట్టు పరంగా అద్భుతంగా ఆడాం. చివరి వరకు విజయం కోసం కష్టపడ్డాం. పోరాడిన తీరు గర్వంగా ఉంది. గెలిచినా.. ఓడినా మా జట్టు విధానం ఒకేలా ఉంటుంది. సాయి సుదర్శన్‌ సూపర్ బ్యాటింగ్‌ చేశాడు. అయితే, సీఎస్‌కే అద్భుతంగా ఆడింది. మోహిత్, రషీద్, షమీ అందరూ నాణ్యమైన బౌలింగ్‌ వేశారు. ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని సీఎస్‌కే టైటిల్‌ను గెలవడం ఆనందంగా ఉంది. మంచి వాళ్లకు మంచే జరుగుతుంది’’ అని గుజరాత్ కెప్టెన్ హార్దిక్‌ పాండ్య చెప్పాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని