MS Dhoni : నేడు ధోనీ కీలక ప్రకటన.. ఆందోళనలో అభిమానులు..

భారత మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ.. సోషల్‌మీడియా వేదికగా శనివారం అభిమానులనుద్దేశించి పెట్టిన ఓ కీలక ప్రకటన అంతటా చర్చనీయాంశంగా మారింది.

Updated : 25 Sep 2022 12:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  భారత మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ.. సోషల్‌మీడియా వేదికగా శనివారం అభిమానులనుద్దేశించి పెట్టిన ఓ కీలక ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఓ ఆసక్తికర వార్తతో మీ ముందుకు వస్తానని ధోనీ ప్రకటించాడు. దీంతో మహీ ఏం ప్రకటిస్తాడోనని అభిమానులు అతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే.. భారత టీ20 లీగ్‌ నుంచి కూడా రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడా..? అని పలువురు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ధోనీ.. కొత్త బిజినెస్‌ వెంచర్‌ ఏదైనా ప్రారంభిస్తాడేమోనని పలువురు అంటున్నారు.

ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి భారత టీ20 లీగ్‌లో మాత్రమే ఆడుతున్నాడు. గత సీజన్‌ మొదట్లో చెన్నై సారథిగా కూడా తప్పుకొని.. ఆ బాధ్యతలను జడేజాకు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే.. జట్టు వరుస వైఫల్యాల నేపథ్యంలో తిరిగి మళ్లీ మహీనే కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో ధోనీ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. భారత క్రికెట్‌ లీగ్‌ నుంచి రిటైర్‌ కావొద్దని వారు కోరుతున్నారు.

‘‘ధోనీ.. నువ్వే మా హీరోవి. మేం ఎంతగానో నిన్ను ఆరాధిస్తాం. నీ ప్రకటన కోసం అతృతగా ఎదురుచూస్తున్నాం. అయితే, అది రిటైర్మెంట్‌ ప్రకటన కాకూడదని కోరుకుంటున్నాం’’, ‘‘మిమ్మల్ని చూడటానికి వేచి ఉండలేకపోతున్నాం. మీ నుంచి ఎలాంటి చెడు వార్త రావొద్దని కోరుకుంటున్నాం’’ అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అయితే.. ధోనీ గత సీజన్లోనే 2023 సీజన్‌ కూడా ఆడతానని యాజమాన్యానికి హామీ ఇచ్చినట్లు సమాచారం. మరి ఈ నేపథ్యంలో దేని గురించి అతడు ప్రకటన చేయనున్నాడో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని