MS Dhoni: తొందరేల.. ఆ తలనొప్పి ఇప్పుడే ఎందుకు?: రిటైర్‌మెంట్‌పై ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు

గత సీజన్‌తోపాటు ఈసారి గుజరాత్‌ టైటాన్స్‌ను (GT) తొలిసారి ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ క్రమంలో తన రిటైర్‌మెంట్‌పై సీఎస్‌కే అభిమానుల్లో నెలకొన్న సందేహాలకు ఎంఎస్ ధోనీ (MS Dhoni) చెక్‌ పెట్టాడు.

Updated : 24 May 2023 09:10 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 2023 సీజన్‌ (IPL 2023) ఫైనల్లోకి చెన్నైసూపర్‌ కింగ్స్‌ (CSK) అడుగు పెట్టింది. క్వాలిఫయర్‌ -1లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి మరీ ఘనంగా తుదిపోరుకు (GT vs CSK) చేరింది. దీంతో 10వ సారి ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరిన జట్టుగా రికార్డు సృష్టించింది. గత సీజన్‌లో లీగ్‌ స్టేజ్‌కే పరిమితమైన సీఎస్‌కేను కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ అద్భుతంగా ముందుకు నడిపించి టైటిల్‌ రేసులో నిలిపాడు. ప్రస్తుత సీజనే ధోనీకి చివరిదిగా అంతా భావిస్తున్న వేళ.. కెప్టెన్‌ కూల్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. రిటైర్‌మెంట్‌, తన జట్టు ఫైనల్‌కు చేరుకోవడంపై ధోనీ మాట్లాడాడు. 

‘‘సాధారణంగా 8 జట్లు పోటీ పడేవి. ఆ సంఖ్య పదికి చేరింది. ఐపీఎల్‌ మెగా టోర్నీ. ఇలా ఫైనల్‌కు చేరడం అంత సులువేం కాదు. రెండు నెలల కష్టం. ప్రతి ఒక్కరూ తమవంతు భాగస్వామ్యం అందించారు. గుజరాత్ టైటాన్స్‌ అద్భుతమైన టీమ్‌. ఛేదనలో వారు టాప్‌. మేం టాస్‌ ఓడిపోవడం కూడా మంచిదైంది. జడేజాకు పిచ్‌ నుంచి సహకారం లభిస్తే అతడిని ఎదుర్కోవడం చాలా కష్టం. జడేజా బౌలింగ్‌ మ్యాచ్‌ను మార్చింది. అలాగే బ్యాటింగ్‌లోనూ మొయిన్‌తో కలిసి చేసిన భాగస్వామ్యం చాలా కీలకమైంది’’

నేను కాస్త విసిగించే కెప్టెన్‌ను..

ఇక మా ఫాస్ట్‌బౌలర్లూ కష్టపడ్డారు. వారిలో ఆత్మవిశ్వాసం నింపి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టాలనేదే మా ఉద్దేశం. ‘మీలోని అత్యుత్తమ బౌలింగ్‌ను బయటకు తీసుకురండి’.. నేనైనా, మా కోచింగ్‌ సిబ్బంది అయినా వారికి సూచించేది ఇదే. వికెట్‌ను బట్టి నా ఫీల్డింగ్‌ మార్పులు ఉంటాయి. ఫీల్డర్లను 2-3 అడుగులు అటూ ఇటూ మారుస్తూ ఉంటూ కాస్త విసిగించే కెప్టెన్‌గా మారిపోతా. కాస్త నావైపు చూడండి అంటూ ప్రతి ఫీల్డర్‌కు విజ్ఞప్తి చేస్తా. ఒకవేళ క్యాచ్‌ డ్రాప్‌ అయినా కూడా నా నుంచి ఎలాంటి స్పందన ఉండదు. కానీ, నా మీద ఓ కన్నేసి ఉంచండని చెబుతుంటా’’ అని ధోనీ తెలిపాడు. 

8 - 9 నెలల సమయం ఉంది 

వచ్చే సీజన్‌లో ఆడతాడా? లేదా? అనే చర్చపై ధోనీ స్పందించాడు. ప్రస్తుత ఐపీఎల్‌ సందర్భంగానే రిటైర్‌మెంట్‌పై ప్రకటన చేస్తాడనే ఊహాగానాలకు తెర దించాడు. చెపాక్‌లో మళ్లీ ఆడే అవకాశాలు ఉన్నాయా..? అనే ప్రశ్నకు స్పందిస్తూ ‘‘ఇప్పుడే చెప్పలేను. ఇంకా 8-9 నెలల సమయం ఉంది. డిసెంబర్‌లో మళ్లీ మినీ వేలం ఉంటుంది. కాబట్టి, ఆ తలనొప్పిని ఇప్పుడే తీసుకోవాల్సిన అవసరం ఏముంది? నాకు కావాల్సినంత సమయం ఉంది. సీఎస్‌కే కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా. అది జట్టు కోసం ఆడటమా..? బయట కూర్చోవడమా..? అనేదానిపై నిర్ణయం తీసుకునేందుకు సమయం ఉంది’’ అని చెప్పాడు. ఈ సీజన్‌లో ఈ వేదికలో చెన్నై ఆడిన చివరి మ్యాచ్‌ ఇదే. ఫైనల్‌ అహ్మదాబాద్‌ వేదికగా జరగనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని