MS Dhoni: ధోనీ 15 ఏళ్ల క్రితం ఏం చెప్పాడో.. ఇప్పుడూ అదే సలహా ఇచ్చాడు: అశ్విన్‌

ఆటగాళ్లలో ప్రతిభను గమనించి ప్రోత్సహించడం ధోనీ స్టైల్‌. ఇలానే బౌలింగ్‌లో వైవిధ్యాన్ని చూసి రవిచంద్రన్‌ అశ్విన్‌ వెన్నుతట్టాడు. ఎంఎస్‌డీ 15 ఏళ్ల క్రితం చెప్పిన సలహాను యాష్‌ ఇప్పటికీ పాటిస్తున్నాడు.   

Updated : 09 Jul 2024 16:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆటగాళ్ల మనస్తత్వాలు చదవడంలో మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ (MS Dhoni) స్టైలే వేరు. అతడు 15 ఏళ్ల క్రితం ఇచ్చిన సలహా ఇప్పటికీ అమలు చేస్తున్నట్లు రవిచంద్రన్‌ అశ్విన్‌ ( Ravichandran Ashwin) చెప్పాడు. ధోనీ తనకు ఇటీవల అదే సలహా ఇచ్చాడని గుర్తు చేసుకొన్నాడు. ఓ స్పోర్ట్స్‌ ఛానెల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడే తొలి ఏడాది ధోనీకి తాను ఎవరో కూడా తెలియకపోయి ఉండొచ్చని యాష్‌ పేర్కొన్నాడు. 

‘‘నేను తొలిసారి సీఎస్కే జట్టులో ఉన్నప్పుడు ఏడాది పాటు ధోనీకి నా గురించి పెద్దగా తెలియదనుకొంటున్నాను. ఇప్పుడు దాదాపు 17 ఏళ్లుగా పరిచయం. అతడు 2008-09లో ఎలా జట్టును నడిపేవాడో.. 2024లో కూడా అంతే చేస్తున్నాడు. 2010 ఐపీఎల్‌ సీజన్‌లో కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో మ్యాచ్ సమయంలో షేన్‌ బాండ్‌ వేసిన బంతి ధోనీ చేతికి తాకింది. అతడు గాయంతో జట్టు బయటకు వెళ్లిపోయాడు. ఆ మ్యాచ్‌లో బాండ్‌ను నేను ఔటు చేశాను. సురేష్‌ రైనా జట్టుకు నాయకత్వం వహించాడు. నాకు పవర్‌ ప్లేలో బౌలింగ్‌ చేసే అవకాశం రాలేదు. ఎందుకంటే ముత్తయ్యా మురళీధరన్‌ కూడా జట్టులో ఉన్నాడు. నేను డెత్‌ ఓవర్లు వేసేవాడిని. ఈ క్రమంలో మూడు సార్లు జట్టును నిరాశ పర్చాను. 

ఆ తర్వాత ధోనీ వచ్చి తిరిగి నాయకత్వం చేపట్టాడు. నన్ను జట్టులోకి తీసుకొన్నాడు. కొత్త బంతితో పవర్‌ ప్లేలో బౌలింగ్‌ చేయించాడు. చెన్నైలో గిల్‌ క్రిస్ట్‌ను ఔట్‌ చేశాను. ఆ తర్వాత నుంచి  నాచేత కొన్నేళ్లపాటు పవర్‌ప్లేలోనే బౌలింగ్‌ చేయించాడు. ఇక బ్యాటింగ్‌లో పవర్‌ప్లేలో దింపడం విశేషం. జాతీయ జట్టుకు ఆడినా అదే ఆర్డర్‌లో పంపేవాడు. అతడికి నాపై నమ్మకం ఉంది. ఏమైనా సలహా ఇవ్వాలనుకొన్నా చాలా సరళంగా చెప్పేవాడు. 

నాకు ధోనీ ఎప్పుడూ ఒకే సలహా చెప్పేవాడు. కొత్త అంశాలను ప్రయత్నించడమే బలమన్నాడు. ఎప్పుడూ వైవిధ్యం కనబర్చు అని పేర్కొన్నాడు. కొన్నేళ్ల క్రితం సీఎస్కే, దిల్లీ మ్యాచ్‌ సందర్భంగా దుబాయ్‌లో ధోనీని కలిశాను. ‘నేను బ్యాక్‌స్పిన్‌ డెవలప్‌ చేసుకొన్నట్లు ఎలా తెలుసు?’ అని అడిగాను. దానికి ధోనీ సమాధానమిస్తూ.. ‘నువ్వు నేర్చుకొంటుంటావని తెలుసు. నీ బలం అదే. గుర్తుంచుకో.. వైవిధ్యం కనబర్చడం కొనసాగించు’ అని పేర్కొన్నాడు. అతడు ఎదుటి వారిలో ఆట ఒక్కటే చూడడు.. మానసిక బలాన్ని గమనిస్తాడు. తుషార్‌ దేశ్‌పాండే విషయంలో ఇలానే వ్యవహరించాడు. ఎవరు ఏ పాత్రకు సరిపోతారో గమనించి వారికి ఆ బాధ్యతలు అప్పగిస్తాడు’’ అని అశ్విన్‌ పేర్కొన్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని