Dhoni-Sharukh Khan: అచ్చు ధోనీలానే ముగించేశాడు!

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా.. సోమవారం దిల్లీలోని అరుణ్‌ జైట్లీ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తమిళనాడు జట్టు విజేతగా నిలిచింది. చివరి బంతిని భారీ సిక్సర్‌గా మలిచిన..

Updated : 23 Nov 2021 07:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా సోమవారం దిల్లీలోని అరుణ్‌ జైట్లీ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తమిళనాడు జట్టు విజేతగా నిలిచింది. చివరి బంతిని భారీ సిక్సర్‌గా మలిచిన తమిళనాడు బ్యాటర్‌ షారుఖ్‌ ఖాన్ (33: 15 బంతుల్లో 1x4, 3x6).. తమిళనాడు జట్టును వరుసగా రెండో సారి విజేతగా నిలిపాడు. ఈ ఫైనల్ ఓవర్ డ్రామాను టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని తీక్షణంగా చూస్తున్నట్లుగా ఉన్న దృశ్యాలను చెన్నై సూపర్‌ కింగ్స్(సీఎస్కే) జట్టు యాజయాన్యం ట్విటర్‌లో పంచుకుని.. ‘ధోని స్టైల్‌లో మ్యాచ్‌ను ముగించాడు’ అని రాసుకొచ్చింది. ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్ (పీబీకేఎస్‌) తరఫున ఆడుతున్న షారుఖ్‌ ఖాన్‌ను అభినందిస్తూ ఆ జట్టు యాజమాన్యం.. ఫైనల్‌ మ్యాచ్‌కు సంబంధించిన ఓ వీడియోను ట్విటర్‌లో పంచుకుంది.

సయ్యద్‌ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో భాగంగా మొదట బ్యాటింగ్‌ చేసిన  కర్ణాటక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన తమిళనాడు జట్టు.. 19 ఓవర్లకు 136/6 స్కోరుతో నిలిచింది. చివరి ఓవర్లో తమిళనాడు విజయానికి 16 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో క్రీజులో ఉన్న తమిళనాడు బ్యాటర్లు సాయి కిషోర్‌ తొలి బంతిని బౌండరీకి తరలించాడు. రెండో బంతికి అతడు సింగిల్ తీయగా.. మూడో బంతి వైడ్ పడింది. తర్వాతి బంతికి షారుఖ్‌ ఒక పరుగు తీశాడు. నాలుగో బంతికి సాయి కిషోర్‌ మరో పరుగు తీశాడు. ఐదో బంతి వైడ్ పడింది. తర్వాతి బంతికి రెండు పరుగులు తీసిన షారుఖ్‌.. ఆఖరి బంతికి ఐదు పరుగులు అవసరమైన సమయంలో అతడు భారీ సిక్సర్‌గా మలిచాడు. దీంతో తమిళనాడు జట్టు 4 వికెట్ల తేడాతో కర్ణాటక జట్టుపై విజయం సాధించింది. తమిళనాడు జట్టు 2006-07, 2020-21 సీజన్లలో కూడా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని