
IPL-MSD: ఇప్పుడేమీ తొందర లేదుగా.. చెన్నైలోనే నా ఆఖరి మ్యాచ్: ఎంఎస్ ధోనీ
భారత్‌లోనే వచ్చే ఏడాది ఐపీఎల్: జై షా
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత స్థిరమైన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్‌కు (సీఎస్కే) పేరుంది. అలాంటి జట్టుకు ప్రారంభ సీజన్ నుంచి మొన్న జరిగిన 14వ సీజన్ వరకు సారథ్య బాధ్యతలు చేపట్టిన క్రికెటర్ ఎంఎస్ ధోనీ. తన కెప్టెన్సీలో సీఎస్కేను తొమ్మిదిసార్లు ఫైనల్స్‌కు చేర్చాడు. నాలుగు సార్లు కప్ అందించాడు. అందులో ఐపీఎల్ -2021 టైటిల్ కూడా ఉంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా తనలోని నాయకత్వ లక్షణాల్లో వన్నె తగ్గలేదని నిరూపించిన ధోనీ.. వచ్చే ఐపీఎల్ సీజన్‌కు అందుబాటులో ఉంటాడో లేదో అనే సందిగ్ధంలో సీఎస్కే ఫ్యాన్స్‌తోపాటు యావత్ క్రికెట్ అభిమానులు ఉన్నారు. జట్టు యాజమాన్యం మాత్రం ఎంఎస్ ధోనీని మాత్రం విడిచిపెట్టేదిలేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో సీఎస్కేకు వచ్చే ఏడాది ఆడతానా లేదా అనేదానిపై ఎట్టకేలకు ఎంఎస్ ధోనీ స్పందించాడు. చెన్నైలో ఐపీఎల్ 2021 టైటిల్ విజయోత్సవాలు జరిగాయి. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, బీసీసీఐ కార్యదర్శి జై షా, క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ధోనీ మాట్లాడుతూ.. ‘‘వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఐపీఎల్-2022 ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం నవంబర్లోనే ఉన్నాం. అయితే చెన్నైకి ఆడటంపై తప్పకుండా ఆలోచిస్తా. నిర్ణయం తీసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. నేను ఎప్పుడూ నా క్రికెట్ కెరీర్‌ను పక్కాగా ప్లాన్ చేసుకుంటా. అంతర్జాతీయంగా స్వదేశంలో నా చివరి మ్యాచ్‌ను రాంచీలోనే ఆడాలని అనుకున్నా. అలానే ఆడి రిటైర్మెంట్ తీసుకున్నా. అలాగే నా చివరి ఐపీఎల్ టీ20 మ్యాచ్ చెన్నైలోనే ఆడేస్తా. అయితే వచ్చే ఏడాదినా..? ఐదేళ్ల తర్వాతా అనేది ఇంకా తెలియదు’’ అని వ్యాఖ్యానించాడు. వచ్చే ఐపీఎల్‌కు కొత్తగా రెండు జట్లను తీసుకురావాలని బీసీసీఐ నిర్ణయించిందని చెప్పాడు. అయితే సీఎస్కే జట్టుకు ఏది మంచిదైతే అది చేస్తామని వెల్లడించాడు. టాప్‌ఆర్డర్‌తోపాటు అన్ని విభాగాలను బలోపేతం చేయడం వల్ల ఫ్రాంచైజీ ఎలాంటి ఇబ్బంది పడకుండా చూస్తామని తెలిపాడు. వచ్చే పదేళ్లపాటు జట్టుకు అవసరమయ్యే ఆటగాళ్ల కోసం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు వివరించాడు. ‘మీరు వదిలిపెట్టిన ఆస్తి (జట్టు) గురించి మీరు గర్వపడొచ్చు’అని బ్రాడ్‌కాస్టర్ వ్యాఖ్యానించగా.. ‘నేను ఇంకా వదిలిపెట్టలేదు’ అని చురుగ్గా ఎంఎస్ ధోనీ స్పందించాడు.
భారత్‌లోనే 15వ సీజన్ ఐపీఎల్: జై షా
కార్యక్రమానికి హాజరైన బీసీసీఐ కార్యదర్శి జై షా మాట్లాడుతూ.. ‘‘అన్ని అనుకూలంగా ఉంటే వచ్చే ఏడాది ఐపీఎల్ (15వ సీజన్)ను భారత్‌లోనే నిర్వహిస్తాం. మరో రెండు జట్లు వస్తున్న నేపథ్యంలో మరింత జోష వస్తుందని భావిస్తున్నా. చెపాక్ స్టేడియంలో సీఎస్కే ఆడటం మీరు చూసే అవకాశం ఉంది. త్వరలోనే మెగా వేలం నిర్వహించబోతున్నాం. కొత్త వచ్చే కాంబినేషన్స్‌పై ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది’’అని వ్యాఖ్యానించాడు.
► Read latest Sports News and Telugu News