MS DHONI: రూ.40తో చికిత్స చేయించుకున్న ధోనీ.. ఎందుకో తెలుసా..?

 మహేంద్ర సింగ్ ధోనీ మోకాలి నొప్పి ఉపశమనానికి చికిత్స చేయించుకొని కేవలం రూ. 40 మాత్రమే డాక్టర్‌ ఫీజుగా చెల్లించాడు. అదేంటి ఇప్పుడు ఎక్కడ చూసినా....

Updated : 02 Jul 2022 11:45 IST

ఇంటర్నెట్ డెస్క్: మహేంద్ర సింగ్ ధోనీ మోకాలి నొప్పి ఉపశమనానికి చికిత్స చేయించుకొని కేవలం రూ.40 మాత్రమే డాక్టర్‌ ఫీజుగా చెల్లించాడు. అదేంటి ఇప్పుడు ఎక్కడ చూసినా కన్సల్టేషన్‌ ఫీజ్‌ కనీసం రూ.150 తక్కువ కాకుండా ఉంటుంది. అందులోనూ ధోనీలాంటి సెలబ్రిటీ వైద్యుడికి కేవలం రూ.40 మాత్రమే చెల్లించాడేంటని ఆశ్చర్యమేస్తోంది కదూ. అయితే ధోనీ చికిత్స చేయించుకొన్నది ఏ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలోనో.. ఎంబీబీఎస్‌ చదివిన డాక్టర్‌ వద్దో కాదు. రాంచీకి 70కి.మీ దూరంలో ఉండే ఆయుర్వేద వైద్యుడు టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌కు వైద్యం చేశాడు. దానికి రుసుముగా ధోనీ నుంచి వైద్యుడు కేవలం రూ.40 మాత్రమే తీసుకొన్నాడట.

ఓ వార్తా పత్రిక కథనం ప్రకారం.. కొంతకాలంగా ధోనీ మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. కాల్షియం లోపం కారణంగానే సమస్య తలెత్తినట్లు తెలిసింది.  అయితే ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నా ధోనీకి ఉపశమనం లభించలేదు. ఈ క్రమంలో వందన్‌ సింగ్‌ ఖేర్వార్‌ అనే ఆయుర్వేద వైద్యుడు ధోనీకి ట్రీట్‌మెంట్ చేశాడు. ఇంతకుముందు ధోనీ తల్లిదండ్రులకు కూడా ఈయనే వైద్యం చేశాడు. అందుకే ధోనీ తన సమస్యకు ఆయుర్వేద వైద్యం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. గత నెల రోజుల నుంచి వైద్యం తీసుకుంటున్నాడని, ప్రతి నాలుగు రోజులకొకసారి వైద్యుడి వద్దకు వస్తున్నట్లు కథనంలో పేర్కొంది. 

ధోనీకి వైద్యం చేస్తున్న ఆయుర్వేద వైద్యుడు వందన్‌ సింగ్‌ ఖేర్వార్‌ మాట్లాడుతూ.. ‘‘తొలుత ధోనీని గుర్తు పట్టలేదు. కాల్షియం లోపంతో మోకాలి నొప్పిగా ఉందని ధోనీ నా దగ్గరకు వచ్చాడు. కన్సల్టేషన్‌ ఫీజు కింద రూ.20, మరో రూ.20 విలువ చేసే మందులను ప్రిస్క్రైబ్‌ చేశాను. అంతకుముందు ధోనీ తల్లిదండ్రులకు ట్రీట్‌మెంట్ ఇస్తున్నా. వారికి గత మూడు నెలలుగా మందులను ఇస్తున్నా’’ అని వివరించాడు. ధోనీ తమ ప్రాంతంలోకి రావడంతో అభిమానులు ఆనందంతో మురిసిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని