MS Dhoni: అలాంటి ప్లేయర్లను ‘వేలం’లోనే ఎంచుకుంటాం: ధోనీ

ఐపీఎల్ 2023 సీజన్‌లో (IPL 2023) ప్లేఆఫ్స్‌కు చేరిన తొలి రెండు జట్లేవో తేలిపోయాయి. అగ్రస్థానంతో గుజరాత్‌.. రెండోస్థానంతో ఎంఎస్ ధోనీ (MS Dhoni) సారథ్యంలోని చెన్నై ప్లేఆఫ్స్‌ బెర్తులను ఖాయం చేసుకున్నాయి. తాజాగా దిల్లీని సీఎస్‌కే (DC vs CSK) చిత్తుగా ఓడించింది.

Published : 21 May 2023 12:00 IST

ఇంటర్నెట్ డెస్క్: ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) పన్నెండోసారి ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఐపీఎల్ 2023 సీజన్‌ (IPL 2023) చివరి లీగ్‌ మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ను సీఎస్‌కే 77 పరుగుల తేడాతో చిత్తు చేసి మరీ ఘనంగా ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది. టాప్‌ -2లో ఉండటంతో తొలి క్వాలిఫయర్‌లో మే 23న చెపాక్‌ వేదికగానే గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొట్టనుంది. గత సీజన్‌లో లీగ్‌స్టేజ్‌కే పరిమితమై పుంజుకోవడం వెనుక ఉన్న సీక్రెట్‌ను ధోనీ వెల్లడించాడు. బౌలింగ్ దళంలో స్టార్లు లేనప్పటికీ.. యువ బౌలర్లతోనే అద్భుతమైన ఫలితాలను రాబట్టాడు. తమ జట్టుకు సరిపడేవిధంగా ఉన్న ఆటగాళ్లను తీసుకొనేందుకు వేలం ప్రక్రియలో ప్రయత్నిస్తామని ధోనీ తెలిపాడు. 

‘‘వేలం ప్రక్రియ సందర్భంగా మేం ఆలోచించేది ఒకటే అంశం. ఫస్ట్‌ టీమ్‌.. ఆ తర్వాతే తమ వ్యక్తిగత ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకొనే ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటాం. బయట నుంచి చూస్తే ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎంపిక చేసుకున్న ఆటగాళ్లను తొలుత జట్టు వాతావరణానికి అలవాటుపడేలా చేసేందుకు ప్రయత్నిస్తాం. సక్సెస్‌కు ఒకటంటూ పద్ధతి లేదు. అత్యుత్తమ ఆటగాళ్లను తీసుకుని వారు ఆడేందుకు తగిన అవకాశాలు ఇవ్వాలి. బలహీనంగా ఉన్న అంశాల్లో మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలి. కొందరు జట్టు కోసం తమ స్థానాన్ని త్యాగం చేస్తూ ఉంటారు. ఇదే సమయంలో జట్టు మేనేజ్‌మెంట్ కూడా మాకు ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తుంది. ఆటగాళ్లు లేనిదే మనం ఏం చేయలేం. అందుకే వారు చాలా కీలకం. డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దేశ్‌ పాండే అద్భుతంగా పుంజుకున్నాడు. పతిరణ సహజసిద్దమైన బౌలర్‌’’ అని ధోనీ తెలిపాడు.

50వ మ్యాచ్‌లో అర్ధశతకం అద్భుతం: రుతురాజ్‌

దిల్లీపై కేవలం 50 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్స్‌ల సాయంతో రుతురాజ్‌ గైక్వాడ్ 79 పరుగులు చేశాడు. సీఎస్‌కే విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించడంతో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు. ‘‘మేం తప్పక గెలవాల్సిన మ్యాచ్‌. సీఎస్‌కే తరఫున ఇది నా 50వ మ్యాచ్‌. ఇలాంటి విజయంలో నా భాగస్వామ్యం ఉండటం ఆనందంగా ఉంది. పేసర్లను బాదడం కంటే స్పిన్‌ బౌలింగ్‌ ఆడటం కాస్త సులువుగా అనిపించింది. వికెట్లను అట్టిపెట్టుకుని ఉంటే తర్వాత దూకుడుగా ఆడొచ్చని భావించాం. మా తర్వాత శివమ్‌ దూబె, జడేజా, ధోనీ ఎలాగూ ఉన్నారు. డేవన్‌ కాన్వేతో కలిసి ఓపెనింగ్‌ చేయడం చాలా బాగుంటుంది. ఎలాంటి సమయంలోనైనా మాట్లాడే వెసులుబాటు అతడి వద్ద ఉంటుంది’’ అని చెప్పాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు