IPL Final- Dhoni: చెన్నై, గుజరాత్ మధ్య ఫైనల్.. ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించనున్న ధోనీ

గుజరాత్ టైటాన్స్‌తో జరిగే ఐపీఎల్ ఫైనల్‌ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ (MS Dhoni) సరికొత్త రికార్డు సృష్టించనున్నాడు. 

Updated : 30 May 2023 14:10 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్-16 సీజన్‌ ఫైనల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK), గుజరాత్ టైటాన్స్‌ (GT) తలపడనున్నాయి. ఈ టైటిల్‌ పోరుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఐపీఎల్‌ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించనున్నాడు. గుజరాత్‌తో ఫైనల్‌లో ఆడటం ద్వారా ఐపీఎల్‌లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా ధోనీ రికార్డుల్లోకెక్కనున్నాడు. కెప్టెన్ కూల్ ఇప్పటివరకు 249 మ్యాచ్‌లు ఆడి 39.09 సగటుతో 5082 పరుగులు చేశాడు. ఇందులో 24 అర్ధ శతకాలున్నాయి. వికెట్ కీపర్‌గా 41 స్టంపింగ్‌లు చేయగా.. 141 క్యాచ్‌లు అందుకున్నాడు. ఐపీఎల్‌లో ధోనీ తర్వాత అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ (243), దినేశ్ కార్తిక్ (242), విరాట్ కోహ్లీ (237), రవీంద్ర జడేజా (225), శిఖర్ ధావన్ (217), సురేశ్‌ రైనా (205), రాబిన్ ఊతప్ప (205), అంబటి రాయుడు (203) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 

రోహిత్ రికార్డు సమం చేస్తాడా?

సీఎస్కేకు ధోనీ ఈ సారి టైటిల్‌ అందిస్తే అత్యధికసార్లు (5) జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డును సమం చేస్తాడు. ముంబయి ఇండియన్స్‌ను రోహిత్ ఐదుసార్లు విజేతగా నిలిపిన సంగతి తెలిసిందే. ఒకవేళ సీఎస్కే ఓడిపోయి గుజరాత్ ఛాంపియన్‌గా నిలిస్తే వరుసగా రెండు సీజన్లలో తన జట్టుకు టైటిల్ అందించిన మూడో కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య రికార్డు సృష్టిస్తాడు. 2010,2011లో ధోనీ (CSK), 2019, 2020లో రోహిత్‌ శర్మ (MI) కెప్టెన్లుగా టైటిల్స్‌ అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని