
IPL 2021: సారథ్యంలో ‘ట్రిపుల్’ కొట్టిన ఎంఎస్ ధోనీ
ఇంటర్నెట్ డెస్క్: సుదీర్ఘమైన, తీవ్ర పోటీ ఉండే టోర్నమెంట్‌లో ఒక జట్టును ఫైనల్‌కు చేర్చడం మామూలు విషయం కాదు. అలాంటిది టీ20 కెరీర్‌లోనే 300 మ్యాచులకు సారథ్యం వహించడం.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పది సీజన్లు తన జట్టును టైటిల్ రేసులో నిలబెట్టడటమంటే వండర్ అనే చెప్పాలి. అలాంటి సూపర్ ఫీట్‌ను సాధించిన సారథి మరెవరో కాదు.. మహేంద్ర సింగ్ ధోనీ.. భారత్‌కు వన్డే, టీ20 ప్రపంచకప్‌లను అందించిన కెప్టెన్.. ఇటు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ తన జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌ను మూడు సార్లు విజేతగా నిలిపాడు. ఇప్పుడు మరోసారి ఐపీఎల్ 2021 సీజన్ తుదిపోరులో కేకేఆర్‌తో సై అంటూ పోరు సాగిస్తున్నాడు. అంతేకాకుండా టీ20 కెరీర్‌లో కెప్టెన్‌గా 300వ మ్యాచ్‌ను పూర్తి చేసుకున్నాడు. సారథ్యం వహించిన 300 మ్యాచుల్లో 176 విజయాలు, 118 పరాజయాలు ఉన్నాయి. ఐసీసీ టీ20 ప్రపంచకప్ సహా మూడు ఐపీఎల్ టైటిళ్లు, రెండు ఛాంపియన్ ట్రోఫీలు ఉండటం విశేషం. ఐపీఎల్ చరిత్రలో పదిసార్లు ఫైనల్‌కు వెళ్లిన కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ రికార్డు సృష్టించాడు. తొమ్మిది సార్లు సీఎస్‌కే సారథిగా.. ఒకసారి రైజింగ్ పుణె సూపర్‌జైంట్ జట్టు కెప్టెన్‌గా ఫైనల్‌కు తీసుకెళ్లాడు.
* అంతర్జాతీయంగా భారత్ తరఫున 72 టీ20 మ్యాచ్‌లకు ధోనీ కెప్టెన్సీ నిర్వహించాడు. తొలిసారి కెప్టెన్ అయిన 2007లోనే పొట్టి ప్రపంచకప్‌ను దేశానికి అందించాడు. గతేడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోనీ.. మరో మైలురాయికి చేరువగా ఉన్నాడు. ఇంకో 65 పరుగులు చేస్తే అన్ని టీ20 మ్యాచుల్లో కలిపి 7వేల పరుగులు పూర్తి చేసిన క్రికెటరవుతాడు. ధోనీ తర్వాత వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ (208) అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ఆటగాడు. వీరిద్దరి తర్వాత విరాట్ కోహ్లీ (185), గౌతమ్ గంభీర్ (170), రోహిత్ శర్మ (153) కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
* జడేజాకిది 200వ మ్యాచ్..
ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మైలురాయిని తన ఖాతాలో వేసుకున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడిన జడేజా.. ఐపీఎల్‌లో ఆటగాడిగా 200వ మ్యాచ్‌ను పూర్తి చేసుకున్నాడు. మొత్తం 2,386 పరుగులు చేసిన జడేజా.. అందులో రెండు అర్ధశతకాలు సాధించాడు. లోయర్ ఆర్డర్‌లో వచ్చే జడేజా ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో జడేజా 16* మ్యాచుల్లో ఒక అర్ధశతకంతో 152 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ 13 వికెట్లను పడగొట్టి జట్టుకు అండగా నిలిచాడు.
* డుప్లెసిస్ 100*
దక్షిణాఫ్రికా బ్యాటర్ డుప్లెసిస్ ఐపీఎల్ 2021 సీజన్‌లో అదరగొట్టాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌తో సీఎస్‌కే తరఫున 100 మ్యాచ్‌లను ఆడిన ఆటగాడిగా డుప్లెసిస్ ఫీట్ సాధించాడు. ప్రస్తుత సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానం (633)లో నిలిచాడు. ఇప్పటి వరకు ఆడిన వంద మ్యాచుల్లో 2,935 పరుగులు చేశాడు. ఇందులో 22 అర్ధశతకాలు ఉన్నాయి. ఐపీఎల్‌లో డుప్లెసిస్ అత్యధిక స్కోరు 96 పరుగులు.
* రాయుడు 175 నాటౌట్
అంబటి రాయుడు ఐపీఎల్‌లో 175 మ్యాచ్‌లను ఆడేశాడు. 3,916 పరుగులు చేయగా.. అందులో ఒక శతకం, 21 అర్ధశతకాలు ఉన్నాయి. అంబటి రాయుడు టాప్ స్కోరు 100*. ప్రస్తుత సీజన్‌లో పదహారు మ్యాచుల్లో రెండు అర్ధశతకాలతో 170 పరుగులు చేశాడు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే రాయుడు ఈసారి మాత్రం ఆశించినంత మేర రాణించలేకపోయాడు.