Chennai vs Mumbai: చెన్నై ఔట్‌.. ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమణ

టీ20 లీగ్‌ ప్లేఆఫ్స్‌ రేసు నుంచి చెన్నై  ఔట్‌. ఏ మూలో మిణుమిణుకుమంటున్న ఆశలు కాస్తా.. గురువారం ఆవిరయ్యాయి. ఆ జట్టు ఖాతాలో ఎనిమిదో పరాజయం. ఇంతకుముందే నాకౌట్‌ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి.. తనకు తోడుగా చెన్నైని తీసుకెళ్లింది.

Updated : 13 May 2022 06:41 IST

ముంబయి చేతిలో పరాజయం
విజృంభించిన సామ్స్‌, మెరెడిత్‌
రాణించిన తిలక్‌ వర్మ

టీ20 లీగ్‌ ప్లేఆఫ్స్‌ రేసు నుంచి చెన్నై  ఔట్‌. ఏ మూలో మిణుమిణుకుమంటున్న ఆశలు కాస్తా.. గురువారం ఆవిరయ్యాయి. ఆ జట్టు ఖాతాలో ఎనిమిదో పరాజయం. ఇంతకుముందే నాకౌట్‌ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి.. తనకు తోడుగా చెన్నైని తీసుకెళ్లింది. బంతితో చెన్నైని వణికించిన ముంబయి టోర్నీలో మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. చెన్నై కూడా బౌలింగ్‌లో రాణించి, ప్రత్యర్థిని ఒత్తిడికి గురి చేసినా.. నిర్దేశించిన లక్ష్యం మరీ చిన్నది కావడం వల్ల ఫలితం లేకపోయింది. మ్యాచ్‌ ఆరంభంలో డీఆర్‌ఎస్‌ అందుబాటులో లేకపోవడం చెన్నైని దెబ్బతీసింది.

ముంబయి

ముందే ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్‌.. చెన్నై దారిని కూడా మూసేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ సేన 5 వికెట్ల తేడాతో చెన్నైని ఓడించింది. సామ్స్‌ (3/16), మెరెడిత్‌ (2/27), కార్తికేయ (2/22), బుమ్రా (1/12) ధాటికి మొదట చెన్నై 16 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. ధోని (36 నాటౌట్‌; 33 బంతుల్లో 4×4, 2×6) టాప్‌ స్కోరర్‌. ముంబయి కూడా బ్యాటుతో కంగారుపడ్డా.. తిలక్‌ వర్మ (34 నాటౌట్‌; 32 బంతుల్లో 4×4) కీలక ఇన్నింగ్స్‌తో లక్ష్యాన్ని 14.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

రాణించిన తిలక్‌: స్వల్ప లక్ష్య ఛేదనలో ముంబయికి కంగారు తప్పలేదు. ముకేశ్‌ చౌదరి (3/23) అద్భుత బౌలింగ్‌తో ఛేదన ఆరంభంలో మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చేశాడు. అతడు తొలి ఓవర్లోనే కిషన్‌ (6)ను ఔట్‌ చేశాడు. అయితే 3.2 ఓవర్లలో 30/1తో ఇన్నింగ్స్‌ సాఫీగా సాగుతున్నట్లనిపించింది. కానీ రోహిత్‌ను సిమర్‌జీత్‌ ఔట్‌ చేయడం, అయిదో ఓవర్లో సామ్స్‌ (1), స్టబ్స్‌ (0)ను మకేశ్‌ వెనక్కి పంపడంతో ముంబయి 33/4తో ఇబ్బందుల్లో పడింది. మ్యాచ్‌లో ఊహించని ఉత్కంఠ. చెన్నైలో కాస్త ఆశ. కానీ ఒత్తిడిలో చక్కగా బ్యాటింగ్‌ చేసిన తిలక్‌ వర్మ, హృతిక్‌ షోకీన్‌ (18; 23 బంతుల్లో 2×4) ఆ ఆశలపై నీళ్లు చల్లారు. ఎలాంటి తడబాటు లేకుండా, చక్కగా బ్యాటింగ్‌ చేసిన ఈ జంట అయిదో వికెట్‌కు 48 పరుగులు జోడించి ముంబయిని విజయం వైపు నడిపించింది. జట్టు స్కోరు 81 వద్ద షోకీన్‌ ఔటైనా.. టిమ్‌ డేవిడ్‌ (16 నాటౌట్‌)తో కలిసి తిలక్‌ పని పూర్తి చేశాడు.

చెన్నై విలవిల: అది తొలి ఓవర్‌ రెండో బంతి. సామ్స్‌ బంతి కాన్వే ప్యాడ్లను తాకడంతో అంపైర్‌ వేలెత్తాడు. అంతే.. చెన్నై ఇన్నింగ్స్‌ పేక మేడను తలపించింది. ఏ దశలోనూ పతనం ఆగలేదు. వచ్చిన బ్యాట్స్‌మన్‌ వచ్చినట్లే పెవిలియన్‌కు క్యూ కట్టారు. పవర్‌ప్లే ముగిసేసరికి 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది చెన్నై. తొలి ఓవర్లోనే సామ్స్‌.. మొయిన్‌ అలీ (0)ని కూడా ఔట్‌ చేశాడు. షార్ట్‌ బంతిని ఎలా ఆడాలో అర్థం కాని మొయిన్‌.. షోకీన్‌కు తేలికైన క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. రెండో ఓవర్లో ఉతప్ప (1)ను బుమ్రా వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా.. అయిదో ఓవర్లో సామ్స్‌ బంతిని ఫ్లిక్‌ చేయబోయిన రుతురాజ్‌ (7) ఎడ్జ్‌తో వికెట్‌కీపర్‌ ఇషాన్‌ కిషన్‌కు చిక్కాడు. చెన్నై వెన్నువిరిచిన సామ్స్‌ తన తొలి మూడు ఓవర్లలో 14 పరుగులే ఇచ్చి 3 వికెట్లు చేజిక్కించుకున్నాడు. రాయుడు (10) ఇన్నింగ్స్‌ ఎంతోసేపు సాగలేదు. ఆరో ఓవర్లో మెరెడిత్‌ లెంత్‌ బాల్‌ను బ్యాక్‌ఫుట్‌పై డిఫెండ్‌ చేయబోయిన అతడు ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌తో వికెట్‌ కీపర్‌కు దొరికిపోయాడు. దూబె (10) కూడా చెన్నైని ఆదుకోలేకపోయాడు. అతడు ఆరో వికెట్‌గా నిష్క్రమించేటప్పటికి స్కోరు 39 మాత్రమే. బాధ్యతగా ఆడాల్సిన సమయంలో అతడు.. ఎనిమిదో ఓవర్లో మెరెడిత్‌ షార్ట్‌ బాల్‌ను ర్యాంప్‌ చేసే ప్రయత్నంలో ఎడ్జ్‌తో క్యాచ్‌ ఔటయ్యాడు. ఇంత మంది బ్యాట్స్‌మెన్‌ ఘోరంగా విఫలమైనా.. చెన్నై వందకు చేరువగా వెళ్లగలిగింది అంటే ఏకైక కారణం ధోనీనే. మరొక్కరు నిలబడ్డా చెన్నైకి అతడు మంచి స్కోరు అందించేవాడే. కార్తికేయ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన ధోని.. షోకీన్‌ బౌలింగ్‌లో స్క్వేర్‌ లెగ్‌లో కళ్లు చెదిరే సిక్స్‌ దంచాడు. బ్రావో సహాయంతో జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. 12.1 ఓవర్లలో 78/6తో చెన్నై కాస్త కోలుకున్నట్లే కనిపించింది. కానీ ఆ దశలో బ్రావో(12) ఔటై ఆ జట్టును నిరాశపరిచాడు. ఆ తర్వాత ధోని ధాటిని కొనసాగించాడు. కానీ మరోవైపు నుంచి సహకారం లభించలేదు. సిమర్‌జీత్‌ (2), తీక్షణ (0), ముకేశ్‌ చౌదరి (4) చకచకా వెనుదిరిగారు. 16వ ఓవర్లో మెరెడిత్‌ బౌలింగ్‌లో ఓ సిక్స్‌, ఫోర్‌ దంచిన ధోని.. స్ట్రైక్‌ను తన వద్ద ఉంచుకోవాలనే ఉద్దేశంతో చివరి బంతి వికెట్‌కీపర్‌ కిషన్‌ చేతుల్లో పడ్డా పరిగెత్తాడు. కానీ కిషన్‌ డైరెక్ట్‌ త్రోతో ముకేశ్‌ రనౌటయ్యాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని