MI vs GT: అట్లుంటది.. మా సూర్యతోని: రోహిత్ శర్మ ప్రశంసలు

ఐపీఎల్‌ సీజన్‌ (IPL 2023) ప్లేఆఫ్స్‌లో స్థానం కోసం జట్ల మధ్య అసలైన పోరాటం మొదలైంది. ఈక్రమంలో గుజరాత్‌ టైటాన్స్‌ ఓడించిన ముంబయి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. ప్లేఆఫ్స్‌ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది.

Updated : 13 May 2023 11:38 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 2023 (IPL 2023) సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ముంబయి ఇండియన్స్‌ (MI vs GT) ప్రతీకార విజయం సాధించింది. ముంబయి బ్యాటర్ సూర్యకుమార్‌ (103*) శతకంతో విజృంభించడంతో ముంబయి 218 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే, రషీద్ ఖాన్‌ (79*) కాస్త హడలెత్తించినా చివరికి గెలుపు ముంబయిదే అయింది. ఒక దశలో ముంబయి భారీ తేడాతో విజయం సాధిస్తుందని భావించిన వేళ రషీద్ పోరాడాడు. దీంతో గుజరాత్ 191/8 స్కోరుకు పరిమితమైంది. ఒకే మ్యాచ్‌లో అభిమానులకు రెండు వీరోచిత ఇన్నింగ్స్‌లను చూసే అవకాశం దక్కింది. సెంచరీ సాధించిన సూర్యకుమార్‌ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో సూర్యకుమార్‌ ఇన్నింగ్స్‌ను ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసించాడు. 

‘‘చివరి విజయం సాధించి రెండు పాయింట్లను ఖాతాలో వేసుకోవడం ఆనందంగా ఉంది. చివరి వరకు ఆసక్తికరంగా సాగింది. తొలుత బ్యాటింగ్‌ చేసి, దానిని కాపాడుకోవడం ఇలాంటి పిచ్‌ మీద సవాలే. వికెట్లు తీస్తూనే ఉండటంతో గుజరాత్‌పై ఒత్తిడి పెంచగలిగాం. టీ20 ఫార్మాట్‌లో కావాల్సిందదే. మా బౌలింగ్‌ విభాగం చాలా కష్టపడింది. ఇక సెంచరీ హీరో సూర్యకుమార్‌ కాన్ఫిడెన్స్‌ అత్యున్నత స్థాయిలో ఉంటుంది. తొలుత కుడి - ఎడమ బ్యాటింగ్‌ కాంబినేషన్‌ను అనుకున్నాం. అయితే, సూర్య  మాత్రం అలాంటిదేమీ అవసరం లేదన్నాడు. వన్‌డౌన్‌లో ఆడేందుకు ఆసక్తి చూపాడు. ఇలాంటి ఆత్మవిశ్వాసం అతడి సొంతం. అది సహచరులను కూడా ఉత్సాహపరుస్తుంది. ప్రతి మ్యాచ్‌ను కొత్తగా ప్రారంభించాలని చూస్తాడు. గతంలో ఏం జరిగిందనేది అసలు పట్టించుకోడు’’ అని రోహిత్ శర్మ తెలిపాడు. 

అతడి వల్లే ఆసక్తికరంగా: హర్దిక్

‘‘రషీద్ ఖాన్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. అతడి వల్లే మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. జట్టుగా మేం సరిగా ఆడలేకపోయాం. బౌలింగ్‌లోనూ ప్రభావం చూపించలేకపోవడంతో ముంబయి భారీ స్కోరు చేయగలిగింది. స్పష్టమైన ప్రణాళికలు లేకపోవడం, సరిగ్గా అమలు చేయలేకపోవడం వల్లే ఓటమిని ఎదుర్కొన్నాం. వికెట్‌ చాలా ఫ్లాట్‌గా ఉందని తెలుసు. అయినా 25 పరుగులు అదనంగా ఇచ్చాం. సూర్యకుమార్‌ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది. టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్ అనడంలో సందేహం లేదు. ముంబయి చివరి 10 ఓవర్లలో 129 పరుగులు రాబట్టింది. మేం ఓడిపోవడానికి అదే ప్రధాన కారణం’’ అని గుజరాత్ టైటాన్స్‌ సారథి హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. 

అదే నా అత్యుత్తమ ఇన్నింగ్స్‌: సూర్యకుమార్‌

‘‘టీ20 క్రికెట్‌లో నా అత్యుత్తమ ఇన్నింగ్స్‌ ఏంటనేది చెప్పడం కాస్త కష్టమే. కానీ, నేను బాగా ఆడినప్పుడు జట్టు విజయం సాధిస్తే బాగుంటుంది. ఇవాళ మేం తొలుత బ్యాటింగ్‌ చేశాం. కనీసం 200 -220 టార్గెట్‌ ఉండాలని భావించా. తేమ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అందుకే, ఇలాంటి సమయాల్లో ఎలాంటి షాట్లు కొట్టాలనేది దానిపై నాకు అవగాహన ఉంది. దాని కోసం ఎక్కువగా ప్రాక్టీస్‌ చేశా. కేవలం రెండే షాట్లు నా మైండ్‌లో ఉన్నాయి. ఫైన్‌ లెగ్‌, థర్డ్‌ మ్యాన్‌ దిశగా ఆడాలని అనుకున్నా. అదే విధంగా షాట్లను ఎగ్జిక్యూటివ్‌ చేశా’’ అని సూర్యకుమార్‌ తెలిపాడు. 

మరికొన్ని మ్యాచ్‌ విశేషాలు

* గుజరాత్‌ టైటాన్స్‌పై రెండు మ్యాచుల్లో గెలిచిన ఏకైక జట్టుగా ముంబయి రికార్డు సృష్టించింది. గత సీజన్‌లోనూ గుజరాత్‌ను 5 పరుగుల తేడాతో ముంబయి ఓడించింది. ఇప్పుడు 27 రన్స్‌ తేడాతో గెలిచింది. రెండుసార్లు ఛేదనలోనే గుజరాత్ ఓడింది. 

* గుజరాత్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన బ్యాటర్‌గా సూర్యకుమార్‌ రికార్డు సృష్టించాడు. అంతకుముందు రుతురాజ్‌ గైక్వాడ్ ఇదే సీజన్‌లో 92 పరుగులు జోడించాడు. ఇప్పుడు సూర్యకుమార్‌ సెంచరీ బాదేశాడు. అలాగే ముంబయి తరఫున బ్యాటర్లలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన మూడో బ్యాటర్ సూర్యకుమార్‌. సనత్‌ జయసూర్య (114*), రోహిత్ శర్మ (109*) ముందున్నారు. 

* గుజరాత్‌పై అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ముంబయి రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ సీజన్‌లోనే ఛేదన సమయంలో కోల్‌కతా 207/7 చేసింది. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించి ముంబయి 218/5 స్కోరు చేసింది. అలాగే ఒకే సీజన్‌లో ఐదుసార్లు 200+ స్కోర్లు చేసిన జట్టుగానూ ముంబయి రికార్డు సాధించింది.

* చివర్లో ముంబయిని భయపెట్టిన రషీద్ ఖాన్‌ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో 8 లేదా అంతకంటే తక్కువ స్థానంలో క్రీజ్‌లోకి వచ్చి హాఫ్ సెంచరీ సాధించిన నాలుగో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. అలాగే నాలుగు వికెట్లు, హాఫ్ సెంచరీ సాధించిన నాలుగో ఆటగాడు కూడా రషీద్ ఖానే. 

* ఒకే ఇన్నింగ్స్‌లో గుజరాత్ తరఫున అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడు కూడా రషీద్ ఖాన్‌ కావడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌లో 10 సిక్స్‌లు కొట్టాడు. ఇంతకుముందు శుభ్‌మన్‌ గిల్ 7 సిక్స్‌లతో తొలి స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో ఛేదన చేసేటప్పుడు అత్యధిక సిక్స్‌లు బాదిన నాలుగో బ్యాటర్‌గా రషీద్ మారాడు. సనత్ జయసూర్య (11) టాప్‌లో ఉండగా.. ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌, కీరన్‌ పొలార్డ్‌తో కలిసి రషీద్‌ సంయుక్తంగా నిలిచాడు. 

* ముంబయితో మ్యాచ్‌లో 9వ వికెట్‌కు రషీద్ ఖాన్ - అల్జారీ జోసెఫ్ (7*) కలిసి 88 పరుగులు జోడించారు. పురుషుల టీ20 క్రికెట్‌లో ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. రెండేళ్ల కిందట (2021లో) ఆసీస్‌పై బెల్జియం ఆటగాళ్లు సబెర్ జఖిల్, సక్లాయిన్ అలీ కలిసి 132 పరుగులను జోడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని