
Rohit Sharma:క్వారంటైన్లో కసరత్తులు చేస్తున్న రోహిత్ శర్మ
(Photo:Mumbai Indians Twitter)
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్-14 సీజన్ పున:ప్రారంభానికి సమయం దగ్గర పడుతోంది. సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. ఇంగ్లాండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు రద్దు కావడంతో భారత ఆటగాళ్లు అక్కడికి చేరుకుంటున్నారు. ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌తోపాటు పలు ఫ్రాంచైజీలకు చెందిన ఆటగాళ్లు రెండురోజుల క్రితం యూఏఈకి చేరుకున్నారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ప్రస్తుతం వీరంతా క్వారంటైన్లో ఉన్నారు.
ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రెండో దశలో తొలి మ్యాచ్ జరగనుంది. మ్యాచ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ క్వారంటైన్లో ఉంటూనే కసరత్తులు మొదలెట్టాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ముంబయి ఇండియన్స్ ట్విటర్లో పోస్టు చేసింది. ఈ సారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన రోహిత్ సేన మరోసారి టైటిల్ నెగ్గాలని గట్టి పట్టుదలతో ఉంది. ఐపీఎల్ వాయిదాపడేనాటికి ఏడు మ్యాచ్‌లు ఆడిన ముంబయి నాలుగింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. బయోబుడగలో ఉన్న ఆటగాళ్లు కరోనా బారినపడటంతో మే మొదటివారంలో ఐపీఎల్ వాయిదాపడిన సంగతి తెలిసిందే.