MI vs CSK: ఛేదంచేశారు..

మాటిమాటికి అంపైర్లు బంతి కోసం బౌండరీ లైన్‌ బయటకు చూడడం! హా.. సిద్ధంగా ఉన్నానంటూ అక్కడే ఉన్న మరో అంపైర్‌ బంతులతో కూడిన పెట్టెతో మైదానంలోకి పరుగులు పెట్టడం.. ఇదీ చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌ మధ్య...

Updated : 02 May 2021 08:13 IST

చెన్నైపై ముంబయి విజయం
219 పరుగుల లక్ష్యం ఉఫ్‌
పొలార్డ్‌ సంచలన హిట్టింగ్‌
దిల్లీ

మాటిమాటికి అంపైర్లు బంతి కోసం బౌండరీ లైన్‌ బయటకు చూడడం! హా.. సిద్ధంగా ఉన్నానంటూ అక్కడే ఉన్న మరో అంపైర్‌ బంతులతో కూడిన పెట్టెతో మైదానంలోకి పరుగులు పెట్టడం.. ఇదీ చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌లో తరచుగా కనిపించిన దృశ్యం!

బంతి ఉన్నది బాదడానికే అన్నట్లు.. బౌలర్లు ఉన్నది పరుగులు ఇచ్చుకోవడానికే అన్నట్లు బ్యాట్‌ సాగించిన విధ్వంసానికి ఈ మ్యాచ్‌ వేదికగా నిలిచింది. ఫీల్డర్లకు పనే లేకుండా.. అంపైర్లకు మాత్రం తీరిక లేకుండా బ్యాట్స్‌మెన్‌ చెలరేగిన పోరులో చివరికి ముంబయి ఇండియన్స్‌దే పైచేయి!

సింగిల్స్‌ తీయడం కంటే సిక్సర్లు కొట్టడమే సులువన్నట్లు.. డుప్లెసిస్‌, మొయిన్‌ అలీ తుపానులా మొదలెడితే.. ఆ తర్వాత రాయుడు సునామీలా ముంచెత్తాడు. నేనేం తక్కువ కాదని అంతకుమించి ఆటతో పొలార్డ్‌ ప్రళయం సృష్టించి పరుగుల విందును మరోస్థాయికి తీసుకెళ్లాడు. చివరి బంతికి జట్టుకు ఉత్కంఠభరిత విజయాన్ని అందించాడు.

ముంబయి అదరగొట్టింది. బాదుడు పోటీలో పైచేయి సాధించింది. పొలార్డ్‌ (87 నాటౌట్‌; 34 బంతుల్లో 6×4, 8×6) సంచలన హిట్టింగ్‌తో శనివారం పరుగుల వరద పారిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై విజయం సాధించింది.  అంబటి రాయుడు (72 నాటౌట్‌; 27 బంతుల్లో 4×4, 7×6), మొయిన్‌ అలీ (58; 36 బంతుల్లో 5×4, 5×6), డుప్లెసిస్‌ (50; 28 బంతుల్లో 2×4, 4×6) విధ్వంసం సృష్టించడంతో మొదట చెన్నై 4 వికెట్లకు 218 పరుగులు చేసింది. పొలార్డ్‌తో పాటు రోహిత్‌ శర్మ (35; 24 బంతుల్లో 4×4, 1×6), డికాక్‌ (38; 28 బంతుల్లో 4×4, 1×6), కృనాల్‌ పాండ్య (32; 23 బంతుల్లో 2×4, 2×6) మెరవడంతో లక్ష్యాన్ని ముంబయి 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఐపీఎల్‌ చరిత్రలో ఇది రెండో అత్యధిక లక్ష్య ఛేదన. ఈ టోర్నీలో చెన్నైకి ఇది రెండో ఓటమి మాత్రమే.
సిక్స్‌లే.. సిక్స్‌లు..: భారీ లక్ష్య ఛేదనలో ముంబయికి రోహిత్‌ శర్మ, డికాక్‌ అదిరే ఆరంభాన్నిచ్చారు. ధాటిగా ఆడిన ఈ జంట ఎడా పెడా బౌండరీలు బాదేసింది. దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో సమీక్ష ద్వారా ఔట్‌య్యే ప్రమాదాన్ని తప్పించుకున్న రోహిత్‌.. చక్కని షాట్లతో అలరించాడు. 7 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 68/0. అయితే జోరుగా సాగుతున్న దశలో... ముంబయి ఇన్నింగ్స్‌ కూడా చెన్నై లాగే భారీ కుదుపునకు లోనైంది. వరుసగా మూడు ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టి చెన్నై సంబరాలు చేసుకుంది. రోహిత్‌ను ఔట్‌ చేయడం ద్వారా ముంబయి వికెట్ల పతనాన్ని శార్దూల్‌ ఠాకూర్‌ ఆరంభించగా.. సూర్యకుమార్‌ (3)ను జడేజా, డికాక్‌ను మొయిన్‌ అలీ పెవిలియన్‌ చేర్చారు. కానీ పొలార్డ్‌ మాత్రం చెన్నై బౌలర్లను వదల్లేదు. నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. మంచినీళ్లు తాగినంత సులువుగా సిక్స్‌లు కొడుతూ.. కృనాల్‌తో కలిసి ముంబయిని వడివడిగా లక్ష్యంగా దిశగా నడిపించాడు. జడేజా ఓవర్లో మూడు సిక్స్‌లు బాదిన పొలార్డ్‌.. ఎంగిడి బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు కొట్టాడు. ఆ తర్వాత ఠాకూర్‌ ఓవర్లో మూడు ఫోర్లు, సిక్స్‌ దంచాడు. ఈ క్రమంలో కేవలం 17 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. 16వ ఓవర్లో ఎంగిడిని కృనాల్‌ 6, 4, 4తో శిక్షించడంతో చివరి నాలుగు ఓవర్లలో ముంబయికి 50 పరుగులు అవసరమయ్యాయి. అయితే 17వ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన సామ్‌ కరన్‌ కేవలం రెండు పరుగులే ఇచ్చి కృనాల్‌ పాండ్యను ఔట్‌ చేశాడు. పేలవ బౌలింగ్‌తో తర్వాతి ఓవర్లో శార్దూల్‌ 17 పరుగులు సమర్పించుకున్నాడు. 19వ ఓవర్లో సామ్‌కరన్‌ 15 పరుగులిచ్చినా.. హార్దిక్‌ (16; 7 బంతుల్లో 2×6), నీషమ్‌లను ఔట్‌ చేయడంతో మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా మారింది. ఆరు బంతుల్లో ముంబయికి కావాల్సిన పరుగులు 16. ఆఖరి ఓవర్లో ఎంగిడి నియంత్రణతో బౌలింగ్‌ చేయలేకపోయాడు. ఫుల్‌టాస్‌లు వేశాడు రెండు, మూడో బంతులకు ఫోర్లు కొట్టిన పొలార్డ్‌.. అయిదో బంతికి సిక్స్‌ బాదాడు. తీవ్ర ఉత్కంఠ మధ్య చివరి బంతికి రెండు పరుగులు తీసి ముంబయిని గెలిపించాడు. 18వ ఓవర్లో పొలార్డ్‌ ఇచ్చిన ఓ తేలికైన క్యాచ్‌ను లాంగాన్‌లో డుప్లెసిస్‌ వదిలేయడం చెన్నైని దెబ్బతీసింది.
రాయుడు అదరహో..: అది తొలి ఓవరే. బౌల్ట్‌ బౌలింగ్‌లో నాలుగో బంతికే ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (4) నిష్క్రమించాడు. అయినా చెన్నై ఇన్నింగ్స్‌కు బలమైన పునాది పడిందంటే కారణం మొయిన్‌  అలీనే. సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ చెలరేగి ఆడిన అతడు.. మరోవైపు డుప్లెసిస్‌ సహకరిస్తుండగా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కళ్లు చెదిరే షాట్లతో అలరించాడు. మూడో ఓవర్లో బౌల్ట్‌ బౌలింగ్‌లో స్క్వేర్‌ లెగ్‌లో సిక్స్‌తో ఖాతా తెరిచిన అతడు.. ఏ దశలోనూ తగ్గలేదు. కులకర్ణి బౌలింగ్‌లో మిడ్‌ వికెట్లో సిక్స్‌ బాదేశాడు. బుమ్రా స్లో కట్టర్‌ను స్క్వేర్‌ లెగ్‌లో అమాంతం బౌండరీ ఆవల పడేశాడు. నీషమ్‌ బౌలింగ్‌లోనూ లాంగాఫ్‌లో సిక్స్‌ దంచాడు. మరోవైపు చక్కగా స్ట్రైక్‌రొటేట్‌ చేస్తూ సాగిన డుప్లెసిస్‌ కూడా గేర్‌ మార్చాడు. రాహుల్‌ చాహర్‌ ఓవర్లో చెరో సిక్స్‌ బాదేశారు. పదో ఓవర్‌ నుంచి విధ్వంసం మరింత పెరిగింది. నీషమ్‌ వేసిన ఆ ఓవర్లో అలీ సిక్స్‌, రెండు ఫోర్లు బాదగా.. తర్వాతి ఓవర్లో డుప్లెసిస్‌ రెచ్చిపోయాడు. బుమ్రా బౌలింగ్‌లో వరుసగా 6, 6, 4 కొట్టాడు. 112/1తో చెన్నై తిరుగులేని స్థితిలో నిలిచింది. కానీ అనూహ్యం! ఏడు బంతుల వ్యవధిలో ఆ జట్టు ఇన్నింగ్స్‌ స్వరూపమే మారింది. నాలుగు పరుగుల తేడాలో.. ప్రమాదకరంగా ఆడుతున్న అలీతో పాటు డుప్లెసిస్‌, రైనాలను ఔట్‌ చేసిన ముంబయి బలంగా పోటీలోకి వచ్చింది. బుమ్రా బంతిని ర్యాంప్‌ చేయబోయిన అలీ.. కీపర్‌ డికాక్‌కు తేలికైన క్యాచ్‌ ఇవ్వగా.. తర్వాతి ఓవర్లో పొలార్డ్‌ వరుస బంతుల్లో డుప్లెసిస్‌, రైనా (2)ను ఔట్‌ చేసి చెన్నైకి షాకిచ్చాడు. అలవోకగా 200 దాటేలా కనిపించిన చెన్నై.. అనుకున్నదాని కన్నా తక్కువ స్కోరుతో సరిపెట్టుకునేలా కనిపించింది. కానీ రాయుడు విధ్వంసం సునామీలా చుట్టేయబోతోందని, సిక్స్‌ల మోతతో పరుగుల వరద పారబోతోందని ముంబయి ఊహించలేకపోయింది. ఊచకోతకు దిగిన రాయుడు సిక్స్‌లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ చెన్నైకి కొండంత స్కోరును అందించాడు. కేవలం 20 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. జడేజా (22 నాటౌట్‌; 22 బంతుల్లో 2×4)తో కలిసి అభేద్యమైన అయిదో వికెట్‌కు 102 పరుగులు జోడించాడు రాయుడు. బుమ్రా అందరికన్నా ఎక్కువగా 56 పరుగులిచ్చాడు. ఒక వికెట్‌ పడగొట్టాడు.

చెన్నై ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) హార్దిక్‌ (బి) బౌల్ట్‌ 4;  డుప్లెసిస్‌ (సి) బుమ్రా (బి) పొలార్డ్‌ 50; మొయిన్‌ అలీ (సి) డికాక్‌ (బి) బుమ్రా 58; రైనా (సి) కృనాల్‌ (బి) పొలార్డ్‌ 2; నాటౌట్‌ 72 నాటౌట్‌; జడేజా 22 నాటౌట్‌; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 218; వికెట్ల పతనం: 1-4, 2-112, 3-116, 4-116; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-42-1; ధవళ్‌ కులకర్ణి 4-0-48-0; బుమ్రా 4-0-56-1; రాహుల్‌ చాహర్‌ 4-0-32-0; నీషమ్‌    2-0-26-0; పొలార్డ్‌ 2-0-12-2
ముంబయి ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి) అండ్‌ (బి) అలీ 38; రోహిత్‌ (సి) రుతురాజ్‌ (బి) శార్దూల్‌ 35; సూర్యకుమార్‌ (సి) ధోని (బి) జడేజా 3; కృనల్‌ ఎల్బీ (బి) సామ్‌ కరన్‌ 32; పొలార్డ్‌ నాటౌట్‌ 87; హార్దిక్‌ పాండ్య (సి) డుప్లెసిస్‌ (బి) సామ్‌ కరన్‌ 16; నీషమ్‌ (సి) శార్దూల్‌ (బి) సామ్‌ కరన్‌ 0; ధవళ్‌ కులకర్ణి నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 219; వికెట్ల పతనం: 1-71, 2-77, 3-81, 4-170, 5-202, 6-203; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-37-0; సామ్‌ కరన్‌ 4-0-34-3; ఎంగిడి 4-0-62-0; శార్దూల్‌ ఠాకూర్‌ 4-0-56-1; జడేజా 3-0-29-1; మొయిన్‌ అలీ 1-0-1-1

2

ఐపీఎల్‌లో విజయవంతమైన భారీ ఛేదనలో ఇది రెండోది. గతేడాది సీజన్‌లో పంజాబ్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 224 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది.

8

తన ఇన్నింగ్స్‌లో పొలార్డ్‌ కొట్టిన సిక్సర్లు. ఈ సీజన్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ఘనత అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లోనే 7 సిక్సర్లు కొట్టిన రాయుడు రెండో స్థానంలో ఉన్నాడు.

17

అర్ధసెంచరీ చేరుకోవడానికి పొలార్డ్‌కు అవసరమైన బంతులు. ఈ సీజన్లో అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీ చేసిన ఆటగాడిగా అతను నిలిచాడు. మొత్తంగా చూసుకుంటే కేఎల్‌ రాహుల్‌ (14) తొలి స్థానంలో ఉన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని