WPL: ముంబయి జైత్రయాత్ర.. వరుసగా ఐదో విజయం

మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో ముంబయి ఇండియన్స్‌ హవా కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీ ఆ జట్టు వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. గుజరాత్‌తో జరిగిన పోరులో 55 పరుగుల తేడాతో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన విజయం సాధించింది. 

Updated : 24 Mar 2023 15:02 IST

ముంబయి: డబ్ల్యూపీఎల్‌(WPL)లో ముంబయి ఇండియన్స్‌(MIW) జైత్రయాత్ర కొనసాగుతోంది. ఓటమన్నదే ఎరుగకుండా ముందుకు సాగుతోంది. ముంబయి వేదికగా జరిగిన పోరులో గుజరాత్‌ జెయింట్స్‌(GGW)ను 55 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ముంబయి నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్‌ జట్టు ఛేదించలేకపోయింది. ఆ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 107 పరుగులే చేసింది. ఈ గెలుపుతో ముంబయి జట్టు వరుసగా ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని అగ్రస్థానంలో కొనసాగుతోంది. ముంబయి బౌలర్లలో నాట్‌ సీవర్‌ బ్రంట్‌, హేలీ మాథ్యూస్‌ చెరో మూడు వికెట్లు తీసి గుజరాత్‌ పతనాన్ని శాసించారు. అమేలియా కెర్‌ రెండు వికెట్లు తీయగా, వాంగ్‌ ఒక వికెట్‌ పడగొట్టింది. 

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌కౌర్‌ (51; 30 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీతో వీరవిహారం చేసింది. యాస్తిక భాటియా (44; 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), నాట్ సీవర్ (36; 31 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. అనంతరం 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ ఏ దశలోనూ విజయం వైపు అడుగులు వేయలేకపోయింది. ఆ జట్టు 57కే 6 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ జట్టులో కేవలం నలుగురు మాత్రమే రెండంకెల స్కోర్‌ను నమోదు చేశారు. మిగతావారు పూర్తిగా విఫలమయ్యారు. హర్లీన్‌ డియోల్‌ (22) టాప్‌ స్కోరర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని