MIW vs DCW: చరిత్ర సృష్టించిన ముంబయి.. డబ్ల్యూపీఎల్‌ కైవసం

డబ్ల్యూపీఎల్‌ విజేతగా ముంబయి నిలిచింది. ఉత్కంఠ భరిత ఫైనల్‌ మ్యాచ్‌లో దిల్లీ జట్టుపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Updated : 26 Mar 2023 23:08 IST

ముంబయి: మహిళల ముంబయి జట్టు చరిత్ర సృష్టించింది. డబ్ల్యూపీఎల్‌లో తొలి విజేతగా అవతరించింది. ఉత్కంఠభరిత ఫైనల్‌ మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై 7 వికెట్ల తేడాతో విజయదుందుభి మోగించి ట్రోఫీని సొంతం చేసుకుంది. నాట్‌సీవర్‌ బ్రంట్‌ (60 నాటౌట్‌; 55 బంతుల్లో 7×4) అర్ధశతకానికి కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (37; 39 బంతుల్లో 5×4) కీలక ఇన్నింగ్స్‌ తోడవ్వడంతో ముంబయి విజయం సాధించింది. దిల్లీ బౌలర్లు పటిష్ఠంగా బౌలింగ్‌ చేసి పరుగులు కట్టడి చేసినప్పటికీ.. సకాలంలో వికెట్లు పడగొట్టలేకపోవడంతో ముంబయి జట్టును అడ్డుకోలేకపోయారు. రాధా యాదవ్‌, జొనాసెన్‌ చెరో వికెట్‌ తీశారు.

లక్ష్య ఛేదనకు దిగిన ముంబయికి విజయం అంతసులువుగా చిక్కలేదు. ఓపెనర్‌ యాస్తికా భాటియా (4)ను రాధా యాదవ్‌ తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేర్చింది.  అనంతరం మరో ఓపెనర్‌ హెయిలీ మాథ్యూస్‌ (13) కూడా నిరాశ పరిచింది. జోనాసేన్‌  బౌలింగ్‌లో అరుంధతి రాయ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. దీంతో ఒక్కసారిగా ముంబయిపై ఒత్తిడి పెరిగింది. అయితే, తొలిడౌన్‌లో వచ్చిన బ్రంట్‌.. హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ నిర్మించింది. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ.. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. ఈ జోడీ మూడో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. జోరందుకున్న ఈ జోడీని కాప్సీ విడగొట్టింది. 37 పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద హర్మన్‌ రనౌట్‌గా వెనుదిరిగింది. అనంతరం క్రీజులోకి వచ్చిన అమీలా కెర్‌ (14 నాటౌట్‌; 8 బంతుల్లో 2×4 ) చక్కని సహకారం అందించడంతో.. మరో మూడు బంతులు మిగిలుండగానే ముంబయి లక్ష్యాన్ని ఛేదించింది.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దిల్లీ  నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (35; 29 బంతుల్లో 5×4), శిఖా పాండే (27 నాటౌట్‌; 17 బంతుల్లో 3×4,1×6), రాధా యాదవ్‌ (27 నాటౌట్‌; 12 బంతుల్లో 2×4,2×6) మినహా  ఎవ్వరూ పెద్దగా రాణించలేదు. ముంబయి బౌలర్లలో వాంగ్‌, హెయిలీ మాథ్యూస్‌ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. అమీలా కెర్‌ రెండు వికెట్లు తీసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని