Chennai vs Mumbai: చెన్నై x ముంబయి.. ఈరోజు ఓడితే ధోనీసేన ఇంటిముఖమే

భారత టీ20 లీగ్‌లో అత్యంత గొప్ప జట్లుగా పేరున్న చెన్నై, ముంబయి ఈరోజు మరోసారి తలపడనున్నాయి. ఇప్పటికే ముంబయి ప్లేఆఫ్స్‌ అవకాశాలు పూర్తిగా మూసుకుపోగా...

Updated : 12 May 2022 14:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత టీ20 లీగ్‌లో అత్యంత గొప్ప జట్లుగా పేరున్న చెన్నై, ముంబయి నేడు మరోసారి తలపడనున్నాయి. ఇప్పటికే ముంబయి ప్లేఆఫ్స్‌ అవకాశాలు పూర్తిగా మూసుకుపోగా.. చెన్నైకి టెక్నికల్‌గా ఏదో చిన్న అవకాశం ఉంది. అయితే, ఈ రోజు జరిగే మ్యాచ్‌లో ముంబయి గెలిస్తే.. చెన్నై దారులు కూడా పూర్తిగా మూసుకుపోతాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొందాం..

చెన్నై ఒకటి అలా ఒకటి ఇలా..

ఈ సీజన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌లా అడుగుపెట్టిన చెన్నై తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన తర్వాత ఐదో మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇక అక్కడి నుంచైనా వరుస విజయాలు సాధిస్తుందని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలిస్తోంది. ఐదో మ్యాచ్‌లో బెంగళూరుపై తొలి విజయాన్ని సొంతం చేసుకున్న ఆ జట్టు తర్వాత మళ్లీ గెలుపోటములతో దాగుడు మూతలు ఆడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో తొమ్మిదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది.

ఓపెనర్లే కీలకం..

ఇక చెన్నై ఇప్పటి వరకు గెలిచిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, డెవాన్‌ కాన్వే.. ఇద్దరే రెండు మ్యాచ్‌లు గెలిపించారు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న వీరు ఇటీవల రెండు శతక భాగస్వామ్యాలు జోడించి ఆ జట్టు భారీ స్కోర్లు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా కాన్వే ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనే 77 సగటుతో 231 పరుగులు చేశాడు. అందులో మూడు అర్ధ శతకాలు ఉండటం విశేషం. మరోవైపు టోర్నీ ఆరంభంలో తడబడిన రుతురాజ్‌ కొద్ది రోజుల నుంచి పుంజుకొన్నాడు. ఈ క్రమంలోనే ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. దీంతో నేటి మ్యాచ్‌లో ముంబయి వీరిద్దర్నీ కట్టడి చేస్తే సగం మ్యాచ్‌ గెలిచేసినట్లే. ఓపెనర్ల తర్వాత అంబటి రాయుడు, రాబిన్‌ ఉతప్ప, శివమ్‌ దూబే వంటి ఆటగాళ్లు అడపా దడపా భారీ ఇన్నింగ్స్‌ ఆడుతున్నారు. అయితే, కెప్టెన్‌ ధోనీ మాత్రం ఫినిషర్‌గా చివర్లో దంచికొడుతున్నాడు. 

ముంబయి ఆశలు లేకున్నా..

ఇక ముంబయి ఈ టోర్నీ చరిత్రలో ఎన్నడూ లేనంత దారుణంగా ఆడుతోన్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో కేవలం 2 విజయాలే సాధించి అన్నింటికన్నా ముందే ప్లేఆఫ్స్‌ అవకాశాలను కోల్పోయింది. అలాంటిది ఇటీవల రాజస్థాన్‌, గుజరాత్ జట్లపై విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్‌లో కొనసాగుతున్న వాటికి షాకిచ్చింది. ఈ విజయాలు ముంబయికి ఎలాగూ కలిసిరాకపోయినా ఆ ఫలితాలు ఇతర జట్లపై ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో నేడు చెన్నైతో జరిగే మ్యాచ్‌లోనూ ముంబయి గెలిస్తే ధోనీసేన అవకాశాలను పూర్తిగా దెబ్బతీసినట్లే. దీంతో చెన్నై కూడా ప్లేఆఫ్స్‌కు చేరకుండా ఇంటిముఖం పట్టే వీలుంది.

బుమ్రా ఒక్కడు మెరిస్తే..

ఈ సీజన్‌లో ముంబయి ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌, రోహిత్‌ శర్మ ఏమాత్రం ఆకట్టుకోలేదనే సంగతి తెలిసిందే. ఇషాన్‌ మూడు అర్ధ శతకాలు సాధించినా అవి జట్టు విజయాలకు ఏమాత్రం ఉపయోగపడలేదు. వీరిద్దరి తర్వాత నమ్మకం ఉన్న ఆటగాడు సూర్యకుమార్‌. అతడు ఈ సీజన్‌లో బ్యాటింగ్‌ పరంగా ఫర్వాలేదనిపించినా గాయం కారణంగా ఇటీవలే మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇక ఆ జట్టులో నిలకడగా పరుగులు చేస్తున్న ఆటగాడు తిలక్‌ వర్మ ఒక్కడే. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా తనవంతు పరుగులు చేస్తున్నాడు. మరోవైపు పోలార్డ్‌, డానియల్‌ సామ్స్‌, టిమ్‌ డేవిడ్‌ వంటి ఆటగాళ్లు అంతంతమాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై సరిగ్గా ఆడితే.. ముంబయిపై విజయం సాధించడం పెద్ద కష్టమేం కాదు. కాకపోతే, బౌలింగ్‌లో బుమ్రాను సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉంది. ఎందుకంటే గత మ్యాచ్‌లోనే అతడు 5 వికెట్లతో చెలరేగి ఫామ్‌లోకి వచ్చాడు. అతడు మరోసారి రాణిస్తే చెన్నైకి కష్టాలు తప్పకపోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని