Cricket News: 72 గంటలు క్రీజులోనే.. రికార్డు సృష్టించిన ముంబయి టీనేజ్‌ క్రికెటర్‌!

ముంబయికి చెందిన టీనేజ్‌ క్రికెటర్‌ సిద్ధార్థ్‌ మోహితె వినూత్న ప్రయత్నం చేశాడు. ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కించుకోవాలనే ఉద్దేశంతో.. ఏకంగా 72 గంటల 5 నిమిషాల పాటు...

Published : 01 Mar 2022 21:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ముంబయికి చెందిన టీనేజ్‌ క్రికెటర్‌ సిద్ధార్థ్‌ మోహితె వినూత్న ప్రయత్నం చేశాడు. ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కించుకోవాలనే ఉద్దేశంతో.. ఏకంగా 72 గంటల 5 నిమిషాల పాటు క్రీజులోనే ఉన్నాడు. దీంతో 2015లో 50 గంటల పాటు క్రీజులోనే గడిపి విరాగ్ మానే నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. అతడు బ్యాటింగ్‌ చేసిన వీడియోను రికార్డు చేసి గుర్తింపు కోసం గిన్నిస్‌ బుక్‌ అధికారులకు పంపించారు. ఈ రికార్డు సాధించడంలో పలువురు బౌలర్లు అతడికి మద్దతుగా నిలిచారు. నిబంధనల ప్రకారం ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి బ్రేక్‌ కూడా తీసుకోవచ్చు.

‘నేను సాధించిన రికార్డు పట్ల చాలా గర్వంగా ఉంది. నాలో ఉన్న ప్రత్యేకతను నిరూపించుకునేందుకే ఈ ప్రయత్నం చేశాను. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లు క్రికెట్‌ ఆడలేకపోయాను. ఏదైనా విభిన్నంగా చేయాలనే ప్రయత్నంలో ఉండగా.. ఈ ఆలోచన వచ్చింది. శిక్షణ తీసుకునేందుకు చాలా అకాడమీలకు తిరిగాను. ఎంతో మంది కోచ్‌లను కలిశాను. నా ఆలోచన గురించి వివరించాను. అది సాధ్యమయ్యేది కాదని.. ఎవరూ ముందుకు రాలేదు’ అని సిద్ధార్థ్‌ మోహితె చెప్పుకొచ్చాడు. 

* కోచ్‌ జ్వాలా సింగ్‌ ప్రోత్సాహంతోనే..

‘అలా కోచ్‌ కోసం వెతుకుతున్న సమయంలోనే యశస్వీ జైశ్వాల్‌కి శిక్షణ ఇచ్చిన జ్వాలా సింగ్‌ సర్‌ గురించి తెలిసింది. నా ఆలోచన గురించి విని.. ‘ఎందుకు సాధ్యం కాదో చూద్దాం’ అని శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు’ అని సిద్ధార్థ్‌ పేర్కొన్నాడు. ‘కరోనా కంటే ముందు సిద్ధార్థ్‌ ఎంసీసీ ప్రొ-40 లీగ్‌లో ఆడేవాడు. కరోనా కారణంగా దానికి బ్రేక్‌ వచ్చింది. ఆ సమయంలో సిద్ధార్థ్‌ శిక్షణ కోసం వాళ్ల అమ్మ నన్ను సంప్రదించారు. అయితే కారణంగా అన్ని మూతబడిపోయాయి. యువ క్రికెటర్లు చాలా కోల్పోయారు. కాబట్టి, ఏదైనా భిన్నంగా చేయాలనుకునే సిద్ధార్థ్‌కి శిక్షణ ఇచ్చేందుకు అంగీకరించాను’ అని కోచ్ జ్వాలా సింగ్ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని