LSG vs MI: మధ్వాల్‌ మెరిసె.. ముంబయి మురిసె..

ఎనిమిది ఓవర్లలో 68/2. ఎలిమినేటర్‌లో 183 పరుగుల ఛేదనలో లఖ్‌నవూ పరిస్థితిది. ఆసక్తికర ముగింపు ఖాయమనే అనుకున్నారంతా! స్టాయినిస్‌ జోరుమీదుండగా.. విధ్వంసక వీరుడు పూరన్‌ రావాల్సివుంది.

Updated : 25 May 2023 07:21 IST

క్వాలిఫయర్‌-2కు రోహిత్‌సేన
ఎలిమినేటర్‌లో లఖ్‌నవూ పరాజయం
రాణించిన గ్రీన్‌

ఎనిమిది ఓవర్లలో 68/2. ఎలిమినేటర్‌లో 183 పరుగుల ఛేదనలో లఖ్‌నవూ పరిస్థితిది. ఆసక్తికర ముగింపు ఖాయమనే అనుకున్నారంతా! స్టాయినిస్‌ జోరుమీదుండగా.. విధ్వంసక వీరుడు పూరన్‌ రావాల్సివుంది. ముంబయిలో కాస్త కంగారు మొదలయ్యే ఉంటుంది. కానీ చెపాక్‌లో అనూహ్యం. నిమిషాల్లో మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. వికెట్లు టపా టపా పడ్డాయి. పేకమేడను తలపిస్తూ కుప్పకూలిన లఖ్‌నవూ 32 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు చేజార్చుకుని ఓటమిని కొనితెచ్చుకుంది. ఆఖర్లో ఉత్కంఠ ఉంటుందని అంతా భావిస్తే.. మ్యాచ్‌ కాస్త ఏకపక్షమైపోయింది. సంచలన పేస్‌ బౌలింగ్‌తో ఆకాశ్‌ మధ్వాల్‌ (5/5) లఖ్‌నవూ పతనాన్ని శాసించాడు. రనౌట్లూ ఆ జట్టును దెబ్బతీశాయి. ఘనవిజయం సాధించిన ముంబయి.. ఫైనల్లో చోటు కోసం శుక్రవారం క్వాలిఫయర్‌-2లో గుజరాత్‌ టైటాన్స్‌ను ఢీకొంటుంది.

చెన్నై

ముంబయి ఇండియన్స్‌ అదరగొట్టింది. ఆకాశ్‌ మధ్వాల్‌ విజృంభించడంతో బుధవారం జరిగిన ఎలిమినేటర్‌లో 81 పరుగుల తేడాతో లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌ను చిత్తు చేసి క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించింది. గ్రీన్‌ (41; 23 బంతుల్లో 6×4, 1×6), సూర్యకుమార్‌ (33; 20 బంతుల్లో 2×4, 2×6) మెరవడంతో మొదట ముంబయి 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఛేదనలో ఆకాశ్‌ మధ్వాల్‌ ధాటికి లఖ్‌నవూ విలవిల్లాడింది. 16.3 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. మధ్వాల్‌ పదునైన పేస్‌తో ఆ జట్టు వెన్నువిరిచాడు. లఖ్‌నవూ జట్టులో స్టాయినిస్‌ (40; 27 బంతుల్లో 5×4, 1×6) టాప్‌ స్కోరర్‌. అతడు కాకుండా మేయర్స్‌ (18), దీపక్‌ హుడా (15) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.

లఖ్‌నవూ టపటపా..: ఛేదనలో లఖ్‌నవూకు మంచి ఆరంభమేమీ దక్కలేదు. 4 ఓవర్లలో 28 పరుగులకే ఓపెనర్లిద్దరినీ కోల్పోయింది. ప్రేరక్‌ మన్కడ్‌ (3)ను మధ్వాల్‌, మేయర్స్‌ను జోర్డాన్‌ ఔట్‌ చేశారు. అయితే కృనాల్‌ పాండ్య (8)తో కలిసి స్టాయినిస్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అయిదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్న స్టాయినిస్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. షోకీన్‌ బౌలింగ్‌లో వరుసగా 4, 4, 6 దంచేశాడు. 8 ఓవర్లలో 68/2తో గాడినపడ్డ లఖ్‌నవూ బలంగానే పోటీలో నిలిచింది. లక్ష్యంపై కన్నేసింది. కానీ 5 పరుగుల వ్యవధిలో మూడు కీలక వికెట్లు చేజార్చుకుని చిక్కుల్లో పడింది. చాలా వేగంగా మ్యాచ్‌ ఆ జట్టు  చేతుల్లో నుంచి జారిపోయింది. చూస్తుండగానే మ్యాచ్‌ స్వభావమే మారిపోయింది. చావ్లా బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయిన కృనాల్‌ క్యాచ్‌ ఔట్‌ కావడంతో 46 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది.

తర్వాతి ఓవర్లో మధ్వాల్‌ వరుస బంతుల్లో బదోని, ప్రమాదకర పూరన్‌ను ఔట్‌ చేయడం ద్వారా లఖ్‌నవూకు పెద్ద షాకిచ్చాడు. సూపర్‌ఫామ్‌లో ఉన్న పూరన్‌ నిష్క్రమించడం లఖ్‌నవూ ఆశలకు పెద్ద దెబ్బ. అయితే ధాటిగా బ్యాటింగ్‌ చేస్తున్న స్టాయినిస్‌ అప్పటికి క్రీజులో ఉండడంతో ఆ జట్టు పూర్తిగా ఆశలేమీ కోల్పోలేదు. కానీ హుడాతో సమన్వయ లోపంతో అతడు రనౌట్‌ కావడం, తర్వాతి ఓవర్లో గౌతమ్‌ (2) కూడా రనౌటై నిష్క్రమించడంతో లఖ్‌నవూ అవకాశాలకు తెరపడ్డట్లయింది. 13వ ఓవర్లో గౌతమ్‌ ఏడో వికెట్‌గా నిష్క్రమించేటప్పటికి స్కోరు 92 మాత్రమే. లఖ్‌నవూ చివరి ఆరు ఓవర్లలో 85 పరుగులు చేయాల్సిన స్థితిలో ముంబయి మ్యాచ్‌పై పూర్తిగా పట్టుబిగించింది. ఆ తర్వాత సూపర్‌జెయింట్స్‌ ఓటమి లాంఛనమే..

చెలరేగిన గ్రీన్‌: 182.. తక్కువ స్కోరేమీ కాకపోయినా, అంతకుముందు బ్యాటింగ్‌కు అంత కష్టంగా ఏమీ లేని పిచ్‌పై ముంబయిని లఖ్‌నవూ కాస్త కట్టడి చేసినట్లే. ఎందుకంటే 10 ఓవర్లకు 98/2తో ముంబయి చాలా బలమైన స్థితిలో నిలిచింది. నవీనుల్‌ హక్‌ (4/38) కీలక సమయంలో కీలక వికెట్లు పడగొట్టి ముంబయి మరీ ఎక్కువ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. యశ్‌ ఠాకూర్‌ (3/34), మోసిన్‌ ఖాన్‌ (1/24) కూడా మెరుగ్గానే బౌలింగ్‌ చేశారు. అయితే ఏ ఒక్కరూ భారీ ఇన్నింగ్స్‌ ఆడకపోయినా తలో చేయి వేయడంతో ముంబయి మెరుగైన స్కోరు సాధించగలిగింది. టాస్‌ గెలిచి ముంబయి బ్యాటింగ్‌ ఎంచుకోగా.. కెప్టెన్‌ రోహిత్‌ (11), ఇషాన్‌ కిషన్‌ (15) ఇన్నింగ్స్‌ను దాటిగానే ఆరంభించారు. కానీ త్వరగా వెనుదిరిగారు. నాలుగో ఓవర్లో రోహిత్‌ను నవీనుల్‌ ఔట్‌ చేసేటప్పటికి స్కోరు 30. తర్వాతి ఓవర్లోనే ఇషాన్‌ను యశ్‌ ఠాకూర్‌ వెనక్కి పంపాడు. అయినా లఖ్‌నవూకు ఉపశమనం లేకుండా పోయింది. తొలి బంతి నుంచే దంచుడు మొదలెట్టిన గ్రీన్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. బలమైన షాట్లతో చెలరేగిపోయాడు. కృనాల్‌ పాండ్య వేసిన ఓ ఓవర్లో మూడు ఫోర్లు బాదిన అతడు.. మోసిన్‌ ఖాన్‌ బౌలింగ్‌లో స్క్వేర్‌ లెగ్‌లో సిక్స్‌ దంచేశాడు. మరోవైపు సూర్యకుమార్‌ కూడా బ్యాట్‌కు పనిచెప్పాడు. యశ్‌ ఠాకూర్‌, మోసిన్‌ బౌలింగ్‌లో సిక్స్‌లు దంచి మంచి జోరు మీద కనిపించాడు.

ఇన్నింగ్స్‌ సగం పూర్తయ్యేసరికి పటిష్ఠ స్థితిలో నిలిచిన ముంబయి భారీ స్కోరుకు బాటలు వేసుకుంది. 200పై స్కోరు చేసేలా కనిపించింది. కానీ ఇన్నింగ్స్‌ సాఫీగా సాగిపోతున్న దశలో ఒకే ఓవర్లో ప్రమాదకర సూర్య, గ్రీన్‌లను ఔట్‌ చేయడం ద్వారా ముంబయికి నవీనుల్‌ షాకిచ్చాడు. తిలక్‌ వర్మ (26; 22 బంతుల్లో 2×6), టిమ్‌ డేవిడ్‌ (13; 13 బంతుల్లో 1×4) నిలిచినా వేగంగా పరుగులు రాలేదు. 12 నుంచి 16 ఓవర్ల మధ్య ముంబయికి 36 పరుగులే వచ్చాయి. అయితే ఆ జట్టు చివరి నాలుగు ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 42 పరుగులు చేసింది. నేహాల్‌ వధేరా (23; 12 బంతుల్లో 2×4, 2×6) ఆఖరి ఓవర్లో (యశ్‌ ఠాకూర్‌) రెండు ఫోర్లు, ఓ సిక్స్‌ కొట్టడం ద్వారా ఇన్నింగ్స్‌కు మెరుపు ముగింపునిచ్చాడు. ఆఖరి పది ఓవర్లలో ముంబయికి 84 పరుగులు మాత్రమే వచ్చాయి.


ఆ రనౌట్‌..

లక్ష్యం దిశగా సాఫీగా సాగుతున్న లఖ్‌నవూను రనౌట్లు కొంపముంచాయి. ధాటిగా బ్యాటింగ్‌ చేస్తున్న స్టాయినిస్‌ 12వ ఓవర్లో రెండో పరుగు తీసే క్రమంలో దీపక్‌ హుడాతో సమన్వయ లోపంతో రనౌటయ్యాడు. హుడాను ఢీకొన్న స్టాయినిస్‌ పరుగు పూర్తి చేయలేకపోయాడు. స్టాయినిస్‌ ఔట్‌ కావడంతో 89/6తో నిలిచిన లఖ్‌నవూకు కోలుకునే అవకాశం లేకపోయింది. గౌతమ్‌, హుడా కూడా రనౌట్‌అయ్యారు.

7 మ్యాచ్‌లే కానీ..

మధ్వాల్‌.. నిరుడు సూర్యకుమార్‌ యాదవ్‌ గాయపడటంతో జట్టులోకి వచ్చిన ఈ ఉత్తరాఖండ్‌ ఇంజినీర్‌ ఈ ఏడాదే ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతడు ఆడింది ఏడు మ్యాచ్‌లే. కానీ ముంబయి క్వాలిఫయర్స్‌-2 వరకు రావడంలో మధ్వాల్‌ది కీలకపాత్ర. లీగ్‌ దశలో సన్‌రైజర్స్‌తో చివరి మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టిన అతడు.. 5 వికెట్లతో ఎలిమినేటర్‌లో లఖ్‌నవూ పనిపట్టాడు. 24 ఏళ్ల వరకు టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌కు పరిమితమైన అతడు ప్రస్తుతం ముంబయి ఇండియన్స్‌లో కీలక బౌలర్‌గా మారాడు. ఈ ఐపీఎల్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన అతడు 13 వికెట్లు పడగొట్టాడు.


ముంబయి ఇన్నింగ్స్‌: ఇషాన్‌ కిషన్‌ (సి) పూరన్‌ (బి) యశ్‌ 15; రోహిత్‌ (సి) బదోని (బి) నవీనుల్‌ 11; గ్రీన్‌ (బి) నవీనుల్‌ 41; సూర్యకుమార్‌ (సి) గౌతమ్‌ (బి) నవీనుల్‌ 33; తిలక్‌ (సి) హుడా (బి) నవీనుల్‌ 26; టిమ్‌ డేవిడ్‌ (సి) హుడా (బి) యశ్‌ 13; నేహాల్‌ (సి) బిష్ణోయ్‌ (బి) యశ్‌ 23; జోర్డాన్‌ (సి) హుడా (బి) మోసిన్‌ 4; షోకీన్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 16 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 182; వికెట్ల పతనం: 1-30, 2-38, 3-104, 4-105, 5-148, 6-159, 7-168, 8-182; బౌలింగ్‌: కృనాల్‌ 4-0-38-0; గౌతమ్‌ 1-0-8-0; నవీనుల్‌ 4-0-38-4; యశ్‌ 4-0-34-3; మోసిన్‌ 3-0-24-1; రవి బిష్ణోయ్‌ 4-0-30-0

లఖ్‌నవూ ఇన్నింగ్స్‌: మేయర్స్‌ (సి) గ్రీన్‌ (బి) జోర్డాన్‌ 18; ప్రేరక్‌ (సి) షోకీన్‌ (బి) మధ్వాల్‌ 3; కృనాల్‌ (సి) డేవిడ్‌ (బి) చావ్లా 8; స్టాయినిస్‌ రనౌట్‌ 40; బదోని (బి) మధ్వాల్‌ 1; పూరన్‌ (సి) ఇషాన్‌ కిషన్‌ (బి) మధ్వాల్‌ 0; దీపక్‌ హుడా రనౌట్‌ 15; గౌతమ్‌ రనౌట్‌ 2; బిష్ణోయ్‌ (సి) జోర్డాన్‌ (బి) మధ్వాల్‌ 3; నవీనుల్‌ నాటౌట్‌ 1; మోసిన్‌ ఖాన్‌ (బి) మధ్వాల్‌ 0; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం (16.3 ఓవర్లలో ఆలౌట్‌) 101; వికెట్ల పతనం: 1-12; 2-23; 3-69; 4-74; 5-74; 6-89; 7-92; 8-100; 9-100;; బౌలింగ్‌: బెరెన్‌డార్ఫ్‌ 3-0-21-0; మధ్వాల్‌ 3.3-0-5-5; జోర్డాన్‌ 2-1-7-1; గ్రీన్‌ 3-0-15-0; షోకీన్‌ 1-0-18-0; చావ్లా 4-0-28-1


5/5

ఐపీఎల్‌ మ్యాచ్‌లో అతి తక్కువ పరుగులిచ్చి అయిదు వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కుంబ్లే పేరిట ఉన్న రికార్డును మధ్వాల్‌ సమం చేశాడు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని