WPL: తొలి మ్యాచ్‌లోనే ముంబయికి అదిరిపోయే విజయం

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ తొలి మ్యాచ్‌లో ముంబయి శుభారంభం చేసింది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 143 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది.

Updated : 05 Mar 2023 00:04 IST

ముంబయి: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL)లో ముంబయి (MI) శుభారంభం చేసింది. గుజరాత్‌ (GG)పై 143 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. డబ్ల్యూపీఎల్‌లో సరికొత్త చరిత్రకు తొలి అడుగు వేసింది. తొలుత టాస్‌ ఓడి బ్యాంటింగ్‌కు దిగిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. కెప్టెన్‌ హర్మత్‌ ప్రీత్‌ కౌర్‌ (65; 14×4), అమేలియా కేర్‌ (45 నాటౌట్‌, 6×4, 1×6) హెయిలే మ్యాథ్యూ (47; 3×4,4×6) వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడటంతో మంబయి జట్టు భారీ స్కోరు చేయగలిగింది.

బ్యాటింగ్‌ ప్రారంభించిన ముంబయి జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ యాస్తికా భాటియా (1) తక్కువ పరుగులకే ఔటయ్యింది. తనూజా కాన్వార్‌ బౌలింగ్‌లో వారేహమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. అనంతరం క్రీజులోకి వచ్చిన బ్రంట్‌తో కలిసి మరో ఓపెనర్‌ మ్యాథ్యూ ఇన్నింగ్స్‌ నిర్మించింది. అయితే జట్టు స్కోరు 69 పరుగుల వద్ద బ్రంట్‌, 77 పరుగుల వద్ద మ్యాథ్యూ వెనువెంటనే పెవిలియన్‌ బాటపట్టారు. ఆ తర్వాత హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, అమీలా కేర్‌ ఆచితూచి ఆడుతూ.. వీలుదొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే, జట్టు స్కోరు 166 పరుగుల వద్ద హర్మన్‌ పెవిలియన్‌ బాట పట్టింది. స్నేహ్‌రానా బౌలింగ్‌లో హేమలతకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత వస్త్రాకర్‌, (15), వాంగ్‌ (6 నాటౌట్‌) కూడా అమీలియాకు మంచి సహకారం అందించారు.

అనంతరం 208 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్‌ పేలవ ప్రదర్శన చేసింది. వరుస వికెట్లు కోల్పోతూ 15.1 ఓవర్లకే చాప చుట్టేసింది.  64 పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌటయ్యింది. గుజరాత్‌ బ్యాటర్లలో హేమలత (29 నాటౌట్‌) మినహా మిగతావారెవ్వరూ రెండు అంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. బెత్‌ మూనే, డియోల్‌, గార్డెనర్‌, కాన్వార్‌ పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగారు. ముంబయి బౌలర్లలో సైకా ఇషాక్‌ 4 వికెట్లు తీయగా.. బ్రంట్‌, అమీలియా కేర్‌ చెరో రెండు వికెట్లు, వోంగ్‌ ఒక వికెట్‌ పడగొట్టింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు