Mumbai vs Lucknow : శతక్కొట్టిన రాహుల్.. ముంబయికి షాకిచ్చిన లఖ్‌నవూ..

ముంబయికి ఈ మ్యాచులోనూ కలిసి రాలేదు. ఫలితంగా టీ20 మెగా టోర్నీలో వరుసగా ఆరో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది...

Updated : 16 Apr 2022 19:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : ముంబయికి ఈ మ్యాచులోనూ కలిసి రాలేదు. ఫలితంగా టీ20 మెగా టోర్నీలో వరుసగా ఆరో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. లఖ్‌నవూ జట్టుతో జరిగిన మ్యాచులో 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 181 పరుగులకే పరిమితమైంది. దీంతో లఖ్‌నవూ జట్టు నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ముంబయి బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (37), డెవాల్డ్ బ్రెవీస్‌ (31), తిలక్‌ వర్మ (26), కీరన్‌ పొలార్డ్‌ (25) రాణించారు. కెప్టెన్ రోహిత్ శర్మ (6), ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (13), ఫేబియన్‌ అలెన్‌ (8), జయదేవ్ ఉనద్కత్‌ (14), మురుగన్‌ అశ్విన్‌ (6) పరుగులు చేశారు. బుమ్రా (0), టైమల్ మిల్స్‌ (0) నాటౌట్‌గా నిలిచారు. లఖ్‌నవూ బౌలర్లలో అవేశ్ ఖాన్‌ మూడు వికెట్లు తీయగా.. జేసన్‌ హోల్డర్‌, రవి బిష్ణోయ్‌, మార్కస్‌ స్టొయినిస్‌, దుష్మంత చమీర తలో వికెట్ పడగొట్టారు.


లఖ్‌నవూ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తుండటంతో ముంబయి మరో కీలక వికెట్ కోల్పోయింది. తిలక్‌ వర్మ (26).. జేసన్‌ హోల్డర్‌ వేసిన 15వ ఓవర్లో రెండో బంతికి బౌల్డయ్యాడు. ప్రస్తుతం, సూర్యకుమార్ యాదవ్ (36), కీరన్‌ పొలార్డ్ (2) క్రీజులో ఉన్నారు. ఈ క్రమంలోనే 15 ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబయి నాలుగు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. ముంబయి విజయానికి ఇంకా 30 బంతుల్లో 75 పరుగులు కావాల్సి ఉంది.


ముంబయి ఛేదించాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోతోంది. లఖ్‌నవూ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి ప్రస్తుతం పది ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. క్రీజ్‌లో సూర్యకుమార్‌ యాదవ్ (18*), తిలక్ వర్మ (8*) ఉన్నారు.  స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లను కోల్పోయిన ముంబయి ఇన్నింగ్స్‌ను వీరిద్దరు నిలబెట్టారు. ఇంకా విజయానికి 60 బంతుల్లో 114 పరుగులు కావాలి.


ఛేదనకు దిగిన ముంబయి జట్టుకి ఆరంభంలోనే షాక్‌ తగిలింది. అవేశ్ ఖాన్‌ వేసిన మూడో ఓవర్లో నాలుగో బంతికి కెప్టెన్‌ రోహిత్ శర్మ (6).. కీపర్‌కి చిక్కి క్రీజు వీడాడు. రవి బిష్ణోయ్ వేసిన నాలుగో ఓవర్లో ఓ ఫోర్ బాదిన డెవాల్డ్ బ్రెవీస్‌.. చమీర వేసిన తర్వాతి ఓవర్లో ఓ సిక్స్‌, రెండు ఫోర్లు కొట్టాడు. ఆరో ఓవర్లోనూ బ్రెవీస్ (31) దూకుడు కొనసాస్తూ.. మరో రెండు ఫోర్లు బాదాడు. ఐదో బంతికి దీపక్‌ హుడాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దీంతో పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి ముంబయి రెండు వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (13), సూర్య కుమార్ యాదవ్ (0) క్రీజులో ఉన్నారు.


లఖ్‌నవూ జట్టు నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ముంబయి బ్యాటర్లు బరిలోకి దిగారు. జేసన్‌ హోల్డర్ వేసిన తొలి ఓవర్లో ఓ ఫోర్ బాదిన ఓపెనర్ ఇషాన్‌ కిషన్‌ (9).. దుష్మంత చమీర వేసిన రెండో ఓవర్లోనూ మరో ఫోర్ కొట్టాడు. దీంతో రెండు ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబయి వికెట్‌ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్‌ శర్మ (2) క్రీజులో ఉన్నాడు.


ముంబయితో జరుగుతున్న మ్యాచులో లఖ్‌నవూ బ్యాటింగ్ ముగిసింది. కెప్టెన్‌ కేఎల్ రాహుల్ (103* : 60 బంతుల్లో 9×4, 5×6) శతకంతో చెలరేగడంతో.. లఖ్‌నవూ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. ముంబయి ముందు 200 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. మనీశ్ పాండే (38), క్వింటన్‌ డి కాక్‌ (24) ఫర్వాలేదనిపించారు. మార్కస్ స్టోయినిస్‌ (10), దీపక్‌ హుడా (15) పరుగులు చేశారు. కృనాల్ పాండ్య (1) నాటౌట్‌గా నిలిచాడు. ముంబయి బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్‌ రెండు వికెట్లు తీయగా.. మురుగన్‌ అశ్విన్‌, ఫేబియన్ అలెన్‌ చెరో వికెట్ పడగొట్టారు.


లఖ్‌నవూ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (78) నిలకడగా ఆడుతూ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. బుమ్రా వేసిన 12వ ఓవర్లో రెండు పరుగులు తీసిన అతడు ఈ మార్క్‌ను చేరుకున్నాడు. టైమల్‌ మిల్స్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో మనీశ్ పాండే, రాహుల్ చెరో రెండు ఫోర్లు బాదారు. అదే ఊపులో మురుగన్‌ అశ్విన్‌ వేసిన 14వ ఓవర్లో భారీ షాట్‌ ఆడే క్రమంలో మనీశ్ (38) బౌల్డయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్కస్‌ స్టోయినిస్‌ (8) ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్‌గా మలిచాడు. ఫేబియన్‌ అలెన్ వేసిన 15వ ఓవర్లో రాహుల్ రెండు సిక్సులు, ఓ ఫోర్‌ బాదాడు. దీంతో 15 ఓవర్లు పూర్తయ్యే సరికి లఖ్‌నవూ 150/2 స్కోరుతో నిలిచింది. 


లఖ్‌నవూ ఆటగాళ్లు వికెట్లు కాపాడుకుంటూ జాగ్రత్తగా ఆడుతున్నారు. ఏడో ఓవర్లో మురుగన్ అశ్విన్ నాలుగే పరుగులు ఇచ్చాడు. ఫేబియన్‌ అలెన్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో మనీశ్‌ పాండే (22) రెండు ఫోర్లు బాదాడు. తొమ్మిదో ఓవర్లో కెప్టెన్ ఓ సిక్స్‌ కొట్టిన కెప్టెన్‌ కేఎల్ రాహుల్ (47).. జయదేవ్‌ ఉనద్కత్ వేసిన తర్వాతి ఓవర్లోనూ మరో సిక్స్ బాది అర్ధ శతకానికి చేరువయ్యాడు. దీంతో పది ఓవర్లు పూర్తయ్యే సరికి లఖ్‌నవూ ఒక వికెట్ కోల్పోయి 94 పరుగులు చేసింది.


తన వందో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌ అదరగొట్టేస్తున్నాడు. ముంబయి బౌలర్‌ మిల్స్ వేసిన ఐదో ఓవర్‌లో వరుసగా ఫోర్‌, సిక్స్‌ కొట్టాడు. ఈ క్రమంలో టీ20 లీగ్‌లో 99 మ్యాచ్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ (3405) అవతరించాడు. రాహుల్ కంటే క్రిస్‌ గేల్ (3578) ముందున్నాడు. మరోవైపు రాహుల్‌తోపాటు దూకుడుగా ఆడిన డికాక్‌ను (24) ఫాబియన్‌ అలెన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ప్రస్తుతం లఖ్‌నవూ పవర్‌ ప్లే (6 ఓవర్లు) ముగిసేసరికి వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. క్రీజ్‌లో రాహుల్ (27*)తోపాటు మనీశ్‌ పాండే (5*) ఉన్నాడు.


లఖ్‌నవూ బ్యాటింగ్‌ ప్రారంభించింది. ఆశ్చర్యకరంగా తొలి ఓవర్‌ను తిలక్ వర్మతో ముంబయి కెప్టెన్‌ రోహిత్ వేయించాడు. ఈ ఓవర్‌లో ఏడు పరుగులు వచ్చాయి. అనంతరం రెండో ఓవర్‌ను జయ్‌దేవ్ ఉనద్కత్ వేశాడు. డికాక్‌ రెండు ఫోర్లు బాదాడు. దీంతో తొమ్మిది రన్స్ వచ్చాయి. ప్రస్తుతం 2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. క్రీజ్‌లో డికాక్ (9*), కేఎల్ రాహుల్ (7*) ఉన్నారు.


ఇప్పటికే ఐదు వరుస ఓటములతో పూర్తిగా వెనుకపడిపోయిన ముంబయి మరికాసేపట్లో కొత్త జట్టు లఖ్‌నవూతో తలపడనుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. కాగా, ఆ జట్టు ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే ఇకపై ప్రతి మ్యాచ్‌లో గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు లఖ్‌నవూ ఐదు మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 2 ఓటములతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. దీంతో ఈ మ్యాచ్‌లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని చూస్తోంది. ముంబయి ఈ మ్యాచ్‌ నుంచైనా విజయాల బాట పట్టాలని పట్టుదలగా ఉంది. టీ20 లీగ్‌లో కేఎల్ రాహుల్‌కిది వందో మ్యాచ్‌.

జట్ల వివరాలు: 

లఖ్‌నవూ : కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), డికాక్, మనీశ్‌ పాండే, దీపక్‌ హుడా, మార్కస్ స్టొయినిస్‌, ఆయుష్ బదోని, జాసన్ హోల్డర్, కృనాల్ పాండ్య, దుష్మంత చమీర, అవేశ్‌ ఖాన్, రవి బిష్ణోయ్

ముంబయి : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్‌ కిషన్‌, డేవిడ్ బ్రెవిస్, తిలక్ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్, కీరన్ పొలార్డ్, ఫాబియన్‌ అలెన్, జయ్‌దేవ్ ఉనద్కత్, మురుగన్ అశ్విన్, బుమ్రా, మిల్స్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని