muttaih muralitharan: ఇది సమయస్ఫూర్తా?.. మన్కడింగ్‌పై మురళీధరన్‌ ఫైర్‌

దీప్తి శర్మ చేసిన రనౌట్‌ (మన్కడింట్‌) పై శ్రీలంక మాజీ స్పిన్నర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Updated : 28 Sep 2022 10:24 IST

దిల్లీ: ఇంగ్లాండ్‌తో భారత మహిళల జట్టు చివరి వన్డే సందర్భంగా దీప్తి శర్మ చేసిన రనౌట్‌ (మన్కడింగ్‌) వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై శ్రీలంక మాజీ స్పిన్నర్‌ మురళీధరన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. దీప్తికి మద్దతు తెలుపుతూ రవిచంద్రన్‌ అశ్విన్‌ చేసిన ట్వీట్‌కు కౌంటర్‌ ఇస్తూ ఈ సీనియర్‌ ఆటగాడు స్పందించాడు. 

‘‘ఇది సమయస్ఫూర్తా?.. సమయస్ఫూర్తి లేనిదే క్రికెటర్లు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేరు. దీప్తి శర్మ మన్కడింగ్‌కు ముందు నాన్‌ స్ట్రైకర్‌ను హెచ్చరించి ఉంటే నేనే తనను అభినందించి ఉండేవాడిని. అప్పుడు నాది నిజమైన క్రీడాస్ఫూర్తి అవుతుంది. నిబంధనల ప్రకారం దీప్తి చేసింది సరైందే కావచ్చు. కానీ అది క్రీడాస్పూర్తి కాదు. వైట్‌ బాల్‌ ఆట తీవ్ర ఒత్తిడితో కూడుకుని ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో క్రీజు నుంచి చార్లీ డీన్‌ ముందుగానే కదిలి ఉంటుంది. ఒకవేళ ఇదే పొరపాటును ఆమె మళ్లీ మళ్లీ చేసివుంటే ఈ రనౌట్‌ న్యాయమైందే. లేదంటే నా దృష్టిలో ఇది సరైంది కాదు’’ అని తెలిపాడు.

మరోవైపు టీమ్‌ఇండియా మాజీ వికెట్‌ కీపర్‌ సయ్యద్‌ కిర్మానీ మన్కడింగ్‌ ద్వారా రనౌట్‌ చేయడాన్ని తప్పుపట్టాడు. సమయస్ఫూర్తి ప్రదర్శించిన దీప్తికి బ్రేవరీ అవార్డు ఇవ్వాలంటూ అశ్విన్‌ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డాడు. ‘‘సారీ అశ్విన్‌.. గతంలో ఇటువంటి తెలివైన పనిలో నువ్వు భాగం అయ్యావని తెలుసు. ఇప్పటికైనా ఆటకు హుందాతనాన్ని తీసుకొద్దాం’’ అంటూ పిలుపునిచ్చాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని