IND vs PAK: జైషాతో తప్పకుండా చర్చిస్తా.. పాక్‌ క్రికెట్‌కు ప్రయోజనం: నజామ్ సేథీ

దాయాదుల పోరు (IND vs PAK) చూడటానికి అభిమానులు ఎదురు చూస్తుంటారు. అయితే ఆసియా కప్ సందర్భంగా పాక్‌లో (Pakistan) టీమ్‌ఇండియా (Team India) పర్యటించదని బీసీసీఐ కార్యదర్శి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) భేటీ జరగబోతోంది.

Published : 26 Jan 2023 10:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఆసియా కప్‌ 2023 టోర్నమెంట్‌ నిర్వహణను పాకిస్థాన్‌కు అప్పగించినప్పటి నుంచి.. భారత క్రికెట్‌ నియంత్రణ బోర్డు (బీసీసీఐ), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మధ్య మాటల యుద్ధం మొదలైన విషయం తెలిసిందే. పాక్‌లో ఆసియా కప్‌ నిర్వహిస్తే భారత్‌ పర్యటించదని బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) జై షా ప్రకటించారు. దీనిపై నాటి పీసీబీ ఛైర్మన్‌ రమీజ్‌ రజా కూడా స్పందిస్తూ.. పాక్‌లో టీమ్‌ఇండియా ఆడకపోతే, ప్రపంచకప్‌లో పాక్‌ ఆడేదిలేదని స్పష్టం చేశాడు. భారత్‌ వేదికగానే వన్డే ప్రపంచకప్‌ 2023 మెగా టోర్నీ జరుగుతుంది. తాజాగా పీసీబీ ఛైర్మన్‌గా నజామ్‌ సేథీ వచ్చారు. జైషాతో తప్పకుండా భేటీ అవుతానని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు ఏసీసీ భేటీకి హాజరవుతున్నట్లు, జైషాతో ప్రత్యేకంగా సమావేశమవుతానని సేథీ వెల్లడించాడు. 

‘‘ఆసియా కప్‌ కౌన్సిల్ అధికారులను కలిసే సమయం వచ్చింది. ఫిబ్రవరి 4వ తేదీన బహ్రెయిన్‌ వేదికగా ఏసీసీ మీటింగ్‌ జరగనుంది. ప్రస్తుతం మా బోర్డు వైఖరిని తెలియజేసేందుకు ఇదొక అవకాశం. ఇది పాకిస్థాన్‌ క్రికెట్‌కు సాయపడుతుందని భావిస్తున్నా. భారత్‌లో పాకిస్థాన్‌ పర్యటించాలని బీసీసీఐ కోరుకుంటుంది. కానీ పాక్‌లో ఆడేందుకు మాత్రం అంగీకరించడం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు మాకు కొత్తేమీకాదు. దీనిపై తప్పకుండా మాట్లాడతా’’ అని నజామ్ సేథీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని