T20 World Cup: భారత్ ఆ నిర్ణయం తీసుకోవడం అతిపెద్ద పొరపాటు: నాసర్ హుస్సేన్

టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ మీద టీమ్‌ఇండియా ఓడిపోయింది. పాక్‌ మీద కెప్టెన్‌ కోహ్లీ మినహా.. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్‌తో...

Published : 08 Nov 2021 19:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ మీద టీమ్‌ఇండియా ఓడిపోయింది. పాక్‌ మీద కెప్టెన్‌ కోహ్లీ మినహా.. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్‌తో సహా అందరూ విఫలమయ్యారు. బౌలింగ్‌ పరంగానూ రాణించలేదు. న్యూజిలాండ్‌తోనైనా కీలక ఆటగాళ్లు ఫామ్‌లోకి వచ్చి టీమ్‌ఇండియా గెలవాలని యావత్‌ భారతం ఆకాంక్షించింది. అయితే ఎలాంటి పోరాటం చేయకుండానే ప్రత్యర్థికి తలవంచింది. తొలి మ్యాచ్‌లో విఫలమైన ఓపెనింగ్ జోడీని టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ మార్చింది. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్‌తో ఇషాన్‌ కిషన్‌ను పంపింది. రోహిత్‌ను వన్‌డౌన్‌ బ్యాటర్‌గా వచ్చాడు. అయితే ఫలితంలో ఎలాంటి మార్పూ రాలేదు. ఇదే కొంప ముంచిందేమోనని అభిమానుల అనుమానం. కివీస్‌ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి సెమీస్‌కు చేరుకుంది. ఇలాంటి అభిప్రాయాన్నే ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు నాసర్‌ హుస్సేన్ వ్యక్తం చేశాడు. ఓపెనింగ్‌ మార్చడమే భారత్‌ చేసిన అతిపెద్ద పొరపాటని పేర్కొన్నాడు. రాహుల్-రోహిత్ జోడీని విడదీయకుండా ఉండాల్సిందని చెప్పాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ స్థానంలో ఇషాన్‌ను తీసుకొచ్చి ఓపెనింగ్‌కు పంపడం సరికాదని వివరించాడు. 

‘‘టీమ్‌ఇండియాలో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. అయితే ఇక్కడ కొన్ని సార్లు సెలక్షన్‌ సమస్యగా మారింది. హార్దిక్‌ పాండ్య కేవలం బ్యాటర్‌గా మాత్రమే ఆడుతున్నాడు. జట్టు సమతూకానికి ప్రత్యామ్నాయం కోసం వేరే ఎంపికకు వెళ్లాల్సింది. అలానే ఓపెనర్లు రోహిత్-రాహుల్‌ను విడగొట్టకుండా ఉంటే బాగుండేది. ఐసీసీ నిర్వహించే పెద్ద టోర్నీల్లో టీమ్‌ఇండియా బ్రాండ్‌ క్రికెట్‌ను నిర్భయంగా ఆడటం లేదు. నేను భారత్‌ను ఫేవరేట్‌ జట్టుగా పేర్కొన్నా. ఎందుకంటే వాళ్లు ఇక్కడే ఐపీఎల్ ఆడారు. స్టార్‌ ప్లేయర్లు ఉన్నారు. భారత్‌ టాప్‌ఆర్డర్‌ చాలా బలంగా ఉంటుంది. అయితే ఒక్కోసారి మిడిలార్డర్‌లో ఆదుకునే ఆటగాడు కరవుతున్నాడు. ఉదాహరణకు తొలి మ్యాచ్‌ పాకిస్థాన్‌తో ఓపెనర్లు ఇద్దరూ స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత కోహ్లీ రాణించినా.. మిగతా వారు చేయూతనివ్వలేదు. అందుకే ఎప్పుడూ ప్లాన్‌బీ ఉండాలని చెబుతుంటా. ఎవరు ఎప్పుడు దిగాలో దానిపై ప్రణాళికలు వేసుకుంటూ ఉండాలి. అయితే టీమ్‌ఇండియా వద్ద అదే లేదు’’ అని నాసర్ హుస్సేన్ విశ్లేషించాడు.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని