బెయిర్‌స్టో విషయంలో పునరాలోచించాలి

మరికొద్ది రోజుల్లో టీమ్‌ఇండియాతో జరగబోయే తొలి రెండు టెస్టులకు జానీ బెయిర్‌స్టో లాంటి కీలక ఆటగాడికి విశ్రాంతినివ్వడం సరికాదని ఇంగ్లాండ్‌ మాజీ సారథి నాసర్‌ హుసేన్‌ పేర్కొన్నాడు...

Published : 25 Jan 2021 01:05 IST

లండన్‌: మరికొద్ది రోజుల్లో టీమ్‌ఇండియాతో జరగబోయే తొలి రెండు టెస్టులకు జానీ బెయిర్‌స్టో లాంటి కీలక ఆటగాడికి విశ్రాంతినివ్వడం సరికాదని ఇంగ్లాండ్‌ మాజీ సారథి నాసిర్‌ హుస్సేన్‌ పేర్కొన్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో బెయిర్‌స్టో 47, 35*పరుగులు చేశాడని, అలాంటి ఆటగాడిని భారత్‌తో రెండు టెస్టులకు దూరం చేయడంపై పునరాలోచించాలని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్‌ జట్టులో ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ మాత్రమే స్పిన్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటారని, అందులో బెయిర్‌స్టో ఒకడని హుస్సేన్‌ వివరించాడు. అతడిని పక్కన పెట్టడం విచారించాల్సిన విషయమని తెలిపాడు.

‘కరోనా వైరస్‌ పరిస్థితుల్లో ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు వరుసగా క్రికెట్‌ ఆడుతున్నారు. ఐపీఎల్‌ తర్వాత దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఇప్పుడు భారత్‌.. ఆపై మళ్లీ ఐపీఎల్‌ ఇలా విశ్రాంతి లేకుండా పోయింది. ఇది కచ్చితంగా వారికి మంచిది కాదు. దీని గురించి సెలెక్టర్లు పునరాలోచించాలి. ఈ విషయంలో నేనెవరినీ తప్పుబట్టడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడం వారికి కూడా అంత తేలిక కాదు. కానీ, టీమ్‌ఇండియాతో ఆడేటప్పుడు మేటి ఆటగాళ్లను ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది’ అని హుస్సేన్‌ పేర్కొన్నాడు. 

‘ఒకవేళ ఇదే లంక పర్యటన తర్వాత ఇంగ్లాండ్‌ జట్టు నేరుగా ఆస్ట్రేలియాతో యాషెస్‌ సిరీస్‌లో తలపడితే ఇలాగే చేసేవారా?మనం ఉత్తమ జట్టును పంపించకపోమా?అలాంటప్పుడు టీమ్‌ఇండియాతో తొలి మ్యాచ్‌కు ఎందుకు మంచి జట్టును పంపించలేము?ఇదంతా సమన్వయం చేసుకొని ముందుకు సాగాల్సిన పని’ అని మాజీ సారథి అభిప్రాయపడ్డాడు. కాగా, ఆటగాళ్లకు పనిభారం ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు అందరికీ సమాన రీతిలో విశ్రాంతినిస్తుంది. ఈ నేపథ్యంలోనే బెయిర్‌స్టోను భారత్‌తో జరిగే తొలి రెండు టెస్టులకు దూరం పెట్టారు. ఇది సరికాదని హుస్సేన్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. 

ఇవీ చదవండి..
మేం గెలవడానికి కారణం టిమ్‌పైనే.. 
‘301’ క్యాప్‌.. వెలకట్టలేని సంపద

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని