
సవాళ్లకు సిద్ధంగా ఉన్నా: నట్టూ
ఇంటర్నెట్‌డెస్క్: అతి కొద్ది రోజుల్లోనే నెట్‌బౌలర్ నుంచి టీమిండియా కీలక పేసర్‌గా నటరాజన్ ఎదిగిపోయాడు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అన్ని ఫార్మాట్లలో భారత జట్టుకు ఎంపికయ్యాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో యార్కర్లతో కంగారూలను బోల్తాకొట్టించిన అతడు ఇప్పుడు టెస్టుల్లో అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు. ఉమేశ్ యాదవ్ గాయంతో సుదీర్ఘ ఫార్మాట్ జట్టులో ఎంపికైన నట్టూ.. టీమిండియా టెస్టు జెర్సీ ధరించి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ‘‘భారత టెస్టు జెర్సీ ధరించనుండటం ఎంతో గర్వకారణం. కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉన్నాను’’ అని దానికి వ్యాఖ్య జత చేశాడు.
అయితే ఆసీస్‌తో జరగనున్న మూడో టెస్టులో నటరాజన్‌కు చోటు దక్కదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అంతగా అనుభవం లేని నట్టూ టెస్టు ఫార్మాట్‌లో అరంగేట్రం కోసం మరికొన్ని రోజులు ఎదురూచూడాల్సి వస్తుందని అంటున్నారు. ఇప్పటికే గాయాలతో అనుభవజ్ఞులు షమి, ఉమేశ్ యాదవ్ జట్టుకు దూరమవ్వడంతో యువపేసర్లకు బుమ్రా మార్గనిర్దేశం చేస్తూ పేస్ బాధ్యతల్ని మోస్తున్నాడు. మరి, వైవిధ్యంతో బౌలింగ్ చేయగలిగే నట్టూకు కూడా అవకాశం ఇవ్వాలని యాజమాన్యం ఆలోచిస్తే.. కంగారూల గడ్డపైనే మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన ఆటగాడిగా నటరాజన్ నిలుస్తాడు. సిడ్నీ వేదికగా జనవరి 7న భారత్×ఆసీస్ మూడో టెస్టు ప్రారంభం కానుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు చెరో విజయం సాధించాయి.
ఇదీ చదవండి
షాక్: టెస్టు సిరీస్‌కు రాహుల్ దూరం
గబ్బాపై అభ్యంతరమా.. అదేం లేదే!