ఆర్పీసింగ్‌ తర్వాత నటరాజన్‌

టీమ్‌ఇండియా యువ పేసర్‌ నటరాజన్‌ ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో కొత్త రికార్డు నమోదు చేశాడు. అరంగేట్రం టెస్టులో రెండో అత్యుత్తమ ప్రదర్శన (3/78) చేసిన భారత ఎడమచేతి...

Published : 16 Jan 2021 14:44 IST

బ్రిస్బేన్‌: టీమ్‌ఇండియా యువ పేసర్‌ నటరాజన్‌ ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో కొత్త రికార్డు నమోదు చేశాడు. అరంగేట్ర టెస్టులో రెండో అత్యుత్తమ ప్రదర్శన (3/78) చేసిన భారత ఎడమచేతి వాటం పేసర్‌గా నిలిచాడు. అంతకుముందు ఆర్పీసింగ్‌ 2004-05 సీజన్‌లో పాకిస్థాన్‌ పర్యటన సందర్భంగా ఫైసలాబాద్‌ టెస్టులో (4/89) మెరుగైన ప్రదర్శన చేశాడు. ఇది టీమ్‌ఇండియా తరఫున లెఫ్టార్మ్‌ పేసర్లలో తొలి టెస్టులో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఆ తర్వాత నటరాజన్‌ ప్రస్తుతం జరుగుతున్న గబ్బా టెస్టులో మూడు వికెట్లు తీసి రెండో స్థానంలో నిలిచాడు.

మరోవైపు ఈ తమిళనాడు పేసర్‌ తొలుత ఆస్ట్రేలియా పర్యటనకు నెట్‌బౌలర్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్‌లో ఆకట్టుకోవడంతో టీమ్‌ఇండియా నుంచి పిలుపు వచ్చింది. అయితే, అనుకోకుండానే ఈ పర్యటనలో నటరాజన్‌ మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. దీంతో భారత్‌ తరఫున ఈ రికార్డు సృష్టించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 17వ ఆటగాడిగా నిలిచాడు. నటరాజన్‌కు తొలుత మూడో వన్డేలో అవకాశం రావడంతో రెండు వికెట్లు తీశాడు. ఆ ప్రదర్శనతో టీ20 జట్టులో అడుగుపెట్టాడు. అక్కడ 6 వికెట్లు తీయడంతో భారత్‌ సిరీస్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా ప్రధాన పేసర్లంతా గాయపడడంతో నటరాజన్‌కు ఈ ఫార్మాట్‌లోనూ అవకాశం వచ్చింది. దీంతో నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. 

ఇవీ చదవండి..
పాండ్య సోదరులకు పితృ వియోగం..
రోహిత్‌ను సరదాగా ట్రోల్‌ చేసిన డీకే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని