LSG vs MI: నవీనుల్‌ హక్‌.. రోహిత్ ఔట్‌ విషయంలోనూ అదే తీరు!

ముంబయి ఇండియన్స్‌ (MI) అదరగొట్టే విజయం సాధించింది. లఖ్‌నవూను 81 పరుగుల తేడాతో (LSG vs MI) చిత్తు చేసింది. దీంతో శుక్రవారం గుజరాత్‌ టైటాన్స్‌తో రెండో క్వాలిఫయర్‌లో తలపడేందుకు సిద్ధమైంది. 

Published : 25 May 2023 08:01 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌లో (IPL 2023) ముంబయి ఇండియన్స్‌ రెండో క్వాలిఫయర్‌కు చేరింది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ను 81 పరుగుల తేడాతో ముంబయి చిత్తు చేసింది. ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. పది బంతుల్లో కేవలం  11 పరుగులే చేసి  నవీనుల్‌ హక్‌ బౌలింగ్‌లో ఆయుష్‌ బదోనికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో నవీనుల్‌ హక్ చేసుకున్న వికెట్‌ సంబరాలు సోషల్ మీడియాలో మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. చెవులను మూసుకొని తన జెర్సీని చూపిస్తూ సంబరపడ్డాడు. కామెరూన్‌ గ్రీన్‌ను ఔట్ చేసిన సమయంలోనూ ఇలానే ప్రవర్తించాడు. దీంతో ముంబయి ఇండియన్స్‌ జట్టు అభిమానులు నెట్టింట విమర్శలు గుప్పించారు. ఇలాంటి యాటిట్యూడ్ మార్చుకోకపోతే ఐపీఎల్‌ నుంచి నిషేధానికి గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు. లఖ్‌నవూ ఫ్యాన్స్‌ మాత్రం నవీనుల్‌ హక్‌కు మద్దతుగా పోస్టులు పెట్టారు. 

గతంలో విరాట్ కోహ్లీతో వాగ్వాదం చేసిన తర్వాత నవీనుల్ విపరీతంగా ట్రోల్‌ అవుతున్నాడు. ‘స్వీట్ మ్యాంగోస్‌’ అంటూ ఆర్‌సీబీ మ్యాచ్‌ల సందర్భంగా విరాట్‌ను ఉద్దేశిస్తున్నట్లుగా పెట్టిన ట్వీట్లు వైరల్‌ మారాయి. ముంబయితో జరిగిన మ్యాచ్‌లోనూ నవీనుల్‌ హక్‌ మంచి ప్రదర్శనే ఇచ్చాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 38 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. 

అక్కడ నుంచి కింద  పడిపోయాం: కృనాల్

ముంబయి చేతిలో ఓటమికిగల కారణాలను లఖ్‌నవూ కెప్టెన్ కృనాల్ పాండ్య వెల్లడించాడు. ‘‘చాలా మంచి స్థితి నుంచి ఒక్కసారిగా కిందకి పడిపోయాం. నేను కూడా అలాంటి షాట్‌ ఆడాల్సింది కాదు. ఇంకాస్త మెరుగైన క్రికెట్ ఆడితే విజయం సాధించేవాళ్లం. బ్యాట్‌ మీదకు బంతి చక్కగా వచ్చింది. అయినా, సరిగా ఆడలేపోకపోయాం. స్ట్రాటజిక్‌ టైమౌట్‌ తర్వాత నుంచి నాణ్యమైన క్రికెట్ ఆడలేదు. క్వింటన్ డికాక్‌ సూపర్ బ్యాటర్. కానీ, మేయర్స్‌కు ఇక్కడ మంచి రికార్డు ఉంది. అందుకే అతడిని తీసుకున్నాం. ముంబయి బ్యాటర్లు తమ ఫాస్ట్‌ బౌలింగ్‌ దీటుగా ఎదుర్కొన్నారు.. అందుకే స్పిన్‌ను త్వరగా ప్రారంభించాల్సి వచ్చింది’’ అని తెలిపాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని