Harbhajan Singh: పెద్ద మ్యాచుల్లో టీమ్‌ ఇండియా ఒత్తిడికి గురవుతోంది: హర్భజన్‌

భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో ఒత్తిడికి గురైందని టర్బోనేటర్‌ హర్భజన్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లు ఒత్తిడిని జయించేలా తగినంత స్వేచ్ఛను ఇవ్వాలని పేర్కొన్నాడు. 

Published : 09 Jun 2023 15:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ ఇండియాలో ఐసీసీ టోర్నీలను సాధించడానికి అవసరమైన ధైర్యం లోపించిందని టర్బోనేటర్‌ హర్భజన్‌ సింగ్‌ (Harbhajan Singh) అభిప్రాయపడ్డాడు. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌(WTC Final)కు నలుగురు పేసర్లతో బరిలోకి దిగడం కొంచెం ఎక్కువ అనిపించిందని పేర్కొన్నాడు. ‘‘నైపుణ్యం లేకపోవడం అనే ప్రశ్నే లేదు. మీరు ఎన్ని కీలక మ్యాచ్‌లు ఆడితే.. అంత మెరుగుపడతారు. ఈ పెద్ద మ్యాచ్‌ల్లో మరింత స్వేచ్ఛగా ఆడాలని నేను భావిస్తున్నాను. మన జట్టు ఒకింత ఒత్తిడికి గురైందని నేను అనుకొంటున్నాను. ఫలితం కోసం ఆలోచించకుండా మన ఆటగాళ్లు మరింత స్వేచ్ఛగా ఆడాలి. ఆటగాళ్లను తమదైన శైలిలో ఆడేందుకు వీలైనంత స్వేచ్ఛను ఇస్తే రాణిస్తారు. మీరు వారిపై ఒత్తిడి పెంచితే.. సరిగ్గా ఆడలేరు. రాణించకపోయినా ఫర్వాలేదు.. అత్యుత్తమ ప్రయత్నం చేయాలనే ఆత్మవిశ్వాసాన్ని ఆటగాళ్లలో కల్పిస్తే ఫలితం ఉంటుంది. గతంలో మనం చాలా టోర్నీలను ఈ విధంగానే గెలిచాము’’ అని భజ్జీ విశ్లేషించాడు.

ప్రస్తుతం హర్భజన్‌ డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో వాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. 2013 తర్వాత నుంచి ఐసీసీ ట్రోఫీ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో విజయం అందుకోలేకపోతున్న భారత్‌ ఈ మ్యాచ్‌లో మొదట్నుంచే ఆత్మరక్షణలో పడిపోయింది. అత్యంత నాణ్యమైన పేసర్ల ధాటికి భారత్‌ టాప్‌ ఆర్డర్‌ కూలిపోవడంతో మ్యాచ్‌పై ఆసీస్‌కు బలమైన పట్టు లభించింది. ఆస్ట్రేలియాకు 469 పరుగుల భారీ స్కోరు సమర్పించుకున్న భారత్‌.. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించి రెండో రోజు ఆట ఆఖరుకు 151/5తో నిలిచింది. టాప్‌ఆర్డర్‌ ఘోర వైఫల్యంతో ఒక దశలో 71/4తో పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును జడేజా (48; 51 బంతుల్లో 7×4, 1×6), రహానె (29 బ్యాటింగ్‌; 71 బంతుల్లో 4×4) ఆదుకున్నారు. నిన్నటి ఆట చివరికి రహానెకు తోడుగా ఆంధ్రా కుర్రాడు, వికెట్‌ కీపర్‌ శ్రీకర్‌ భారత్‌ (5) క్రీజులో ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని