Neeraj Chopra: జావెలిన్‌ త్రో చేస్తూ జారిపడిన నీరజ్‌ చోప్రా.. వీడియో వైరల్‌

ఒలింపిక్‌ ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రా జావెలిన్‌ త్రో చేస్తూ కిందపడ్డాడు. కోర్టానె గేమ్స్‌లో శనివారం స్వర్ణం సాధించిన అతడు మూడో రౌండ్‌లో ఈటెను విసిరే క్రమంలో జారిపడ్డాడు...

Published : 20 Jun 2022 02:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒలింపిక్‌ ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రా జావెలిన్‌ త్రో చేస్తూ కిందపడ్డాడు. కోర్టానె గేమ్స్‌లో శనివారం స్వర్ణం సాధించిన అతడు మూడో రౌండ్‌లో ఈటెను విసిరే క్రమంలో జారిపడ్డాడు. ఫిన్‌లాండ్‌లో జరిగిన ఈ పోటీల సందర్భంగా శనివారం అక్కడ వర్షం కురవడంతో అథ్లెట్లు పరుగెత్తే ట్రాక్‌ తడిగా మారింది. దీంతో పలువురు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలోనే నీరజ్‌ కూడా తొలి ప్రయత్నంలో 86.69 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరాడు. అయితే, రెండో రౌండ్‌లో ఫౌల్‌ అయిన అతడు మూడో రౌండ్‌లో మరింత దూరం విసురుదామని ప్రయత్నించి జారిపడ్డాడు. తర్వాత అతడు మిగతా రౌండ్ల నుంచి తప్పుకొన్నాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

కాగా, ఈ టోర్నీలో విజేతగా నిలిచిన నీరజ్‌.. నాలుగు రోజుల వ్యవధిలో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా)ను ఓడించాడు. 24 ఏళ్ల నీరజ్‌ తన తొలి ప్రయత్నంలోనే 86.69 మీటర్ల దూరం ఈటెను విసిరాడు. ఇది ఈ ఈవెంట్‌లో అత్యుత్తమ త్రోగా నిలవడం విశేషం. ఇక వాల్కట్‌ (86.64మీ) రజతం సాధించగా.. పీటర్స్‌ (84.75) కాంస్యం గెలుచుకున్నాడు. అంతకుముందు మంగళవారం త్రోతో పావో నుర్మి క్రీడల్లో నీరజ్‌ 89.30 మీటర్ల దూరం జావెలిన్‌ త్రో చేసి రజతం సాధించాడు. అక్కడ పీటర్స్‌ 86.60మీ దూరంతో కాంస్యం సాధించాడు. మరోవైపు నుర్మి క్రీడల్లో స్వర్ణం సాధించిన హెలాండర్‌ ఈ ఈవెంట్లో పోటీపడలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని