Anand Mahindra : ఈ బల్లెం వీరుల అనుబంధానికి బంగారు పతకం ఇవ్వాలి..

కామన్వెల్త్ క్రీడల్లో జావెలిన్‌ త్రోలో పాకిస్థాన్‌కు స్వర్ణం అందించాడు అర్షద్‌ నదీమ్. పైనల్లో ఏకంగా జావెలిన్‌ను 90.18 మీటర్లు విసిరి స్వర్ణం కొల్లగొట్టాడు. నదీమ్‌ ప్రదర్శనతో పాక్‌ 56 ఏళ్ల తర్వాత కామన్వెల్త్‌ క్రీడల ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో పతకం గెలవగా.. జావెలిన్ త్రోలో పాక్‌కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం.

Updated : 09 Aug 2022 13:40 IST

దిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో జావెలిన్‌ త్రోలో పాకిస్థాన్‌కు స్వర్ణం అందించాడు అర్షద్‌ నదీమ్. ఫైనల్లో ఏకంగా జావెలిన్‌ను 90.18 మీటర్లు విసిరి స్వర్ణం కొల్లగొట్టాడు. నదీమ్‌ ప్రదర్శనతో పాక్‌ 56 ఏళ్ల తర్వాత కామన్వెల్త్‌ గేమ్స్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో పతకం గెలవగా.. జావెలిన్ త్రోలో పాక్‌కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. దీనిపై భారత స్టార్‌ ఆటగాడు నీరజ్ చోప్రా స్పందిస్తూ.. ‘అర్షద్ భాయ్ స్వర్ణం సాధించినందుకు అభినందనలు. 90 మీటర్ల త్రో దాటి కొత్త రికార్డు నమోదుచేశావు. భవిష్యత్‌లో మరిన్ని పోటీల్లో గెలవాలి. ఆల్ ది బెస్ట్’ అని అభినందించారు. 

దాయాది దేశానికి చెందిన వ్యక్తి, తనకు పోటీదారుగా ఉన్న అర్షద్‌ను నీరజ్ అభినందించడం ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రాను ముచ్చటగొల్పింది. వారి అనుబంధం ఆయన్ను ఆకర్షించింది. నీరజ్‌ చేసిన ట్వీట్‌పై మహీంద్రా స్పందిస్తూ.. ‘ప్రపంచం ఇలా ఉండాలి.  పోటీతత్వం, శత్రుత్వం మధ్య తేడాని స్పష్టంగా ప్రదర్శించినందుకు వారికి బంగారు పతకం ఇవ్వాలి’ అని మెచ్చుకున్నారు. ప్రస్తుత ఫీట్‌తో నదీమ్‌.. భారత అథ్లెట్‌, ప్రపంచ నంబర్‌వన్‌ నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్ త్రో(87.58 మీటర్ల)ను అధిగమించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ త్రో 88.13 మీటర్లను కూడా దాటేశాడు. 

ఇదిలా ఉంటే.. ఈ మధ్య ముగిసిన ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో నదీమ్‌ ఐదో స్థానంలో నిలువగా‌.. నీరజ్‌ చోప్రా 88.13 మీటర్ల దూరం విసిరి రజత పతకాన్ని గెలుచుకున్నాడు. అయితే, అతడు కామన్‌వెల్త్‌ బరిలోకి దిగి ఉంటే కచ్చితంగా 90 మీటర్ల దూరం విసిరేవాడని అంతా భావించారు. చివరి నిమిషంలో అతడు గాయం కారణంగా దూరమయిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని