Published : 27 Jun 2021 01:14 IST

WTC Final: ఫొటోల కోసం పోలీసులు ఆపారు: వాగ్నర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో గెలవడంతో న్యూజిలాండ్‌ క్రికెటర్ల సంతోషం అంతా ఇంతా కాదు. టీమ్‌ఇండియాను 8 వికెట్లతో ఓడించిన ఆ జట్టు మ్యాచ్‌ అనంతరం డ్రెస్సింగ్‌ రూమ్‌లో  సంబరాలు చేసుకుంది. అయితే, శుక్రవారం స్వదేశానికి చేరుకున్న ఆ జట్టుకు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తాయి. కానీ వారితో కలిసి సంబరాలు చేసుకునే పరిస్థితులు లేకపోవడంతో ఆ జట్టు పేసర్‌ నీల్‌వాగ్నర్‌ విచారం వ్యక్తం చేశాడు. కరోనా నిబంధనల కారణంగా దూరం నుంచే అభిమానులకు అభివాదం చేయాల్సి వచ్చిందని కివీస్‌ పేసర్‌ వివరించాడు.

‘ఈ విజయం గురించి స్పందించడానికి మాటలు రావడం లేదు. ఇది ఇంకా నమ్మశక్యంగా లేదు. ప్రస్తుత కొవిడ్‌-19 నిబంధనల్లో భాగంగా సామాజిక దూరం పాటించాలి. అందువల్ల అభిమానులతో కరచాలనం కూడా చేయలేకపోతున్నాం. టెస్టు ఛాంపియన్‌గా మాకు ఐసీసీ గదను బహూకరించడంతో అభిమానులు దానితో ఫొటోలు తీసుకోవాలని ఆసక్తి చూపారు. కానీ అది కూడా సాధ్యంకాని పరిస్థితి నెలకొంది. అయితే, అభిమానులు దూరం నుంచే చేతులు ఊపి అభినందించడం మా ఆటగాళ్లకు ఎంతో సంతోషం కలిగించింది’ అని వాగ్నర్‌ చెప్పుకొచ్చాడు.

‘మరోవైపు విమానాశ్రయంలోనూ కస్టమ్స్‌ అధికారులు మమ్మల్ని అభినందించారు. ఇలా ఎప్పుడూ జరగలేదు. ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉందని చెప్పారు. మా పాస్‌పోర్టులు లాక్కొని మరీ ఐసీసీ గద ఎక్కడుందని అడిగారు. దానితో ఫొటోలు దిగేందుకే అలా చేశారు. పోలీస్‌ అధికారులు కూడా ఫొటోలు తీసుకోవాలనుకోవడం, వాళ్ల ముఖాల్లో చిరునవ్వులు చూడటం అద్భుతంగా ఉంది. ఇక విమానంలో రాత్రంతా మేము తలా కొంచెంసేపు ఆ గదను పట్టుకొని సంబరపడ్డాం. చివరికి రాస్‌టేలర్‌ నా వద్ద నుంచి దాన్ని తీసుకొని వాట్లింగ్‌కు అందజేశాడు. న్యూజిలాండ్‌లో ఐసోలేషన్‌లో ఉండే రెండు వారాలు అది అతడి వద్దే ఉంటుందన్నాడు’ అని కివీస్ పేసర్‌ పేర్కొన్నాడు. కాగా ఇండియాతో ఆడిన ఈ ఫైనల్‌ మ్యాచే వాట్లింగ్‌ కెరీర్‌లో చివరి టెస్టు. దాంతో ఆ గదను అతడి వద్దే కొద్దిరోజులు ఉంచాలని న్యూజిలాండ్‌ జట్టు నిర్ణయించింది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts