FIFA World Cup 2022: నాకౌట్‌ పోరులో అమెరికాకు షాక్‌.. క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన నెదర్లాండ్స్‌

ఫుట్‌బాల్‌ను అత్యంత ఇష్టపడే అమెరికాకు షాక్‌. ఖతార్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ నుంచి అమెరికా జట్టు ఇంటిముఖం పట్టింది. హోరాహోరీగా సాగిన రౌండ్‌ 16లో నెదర్లాండ్స్‌ జట్టు అమెరికాను ఓడించింది.

Updated : 04 Dec 2022 00:13 IST

(Photo: FIFA Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫుట్‌బాల్‌ను అత్యంత ఇష్టపడే అమెరికాకు షాక్‌. ఖతార్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ నుంచి అమెరికా జట్టు ఇంటిముఖం పట్టింది. గ్రూప్‌ దశ దాటి రౌండ్‌ 16కు చేరుకున్న అమెరికా, నెదర్లాండ్స్‌ జట్ల మధ్య జరిగిన నాకౌట్‌ పోరులో డచ్‌ జట్టుదే ఆధిపత్యం. పలు అవకాశాలు వచ్చినప్పటికీ అమెరికా ఆటగాళ్లు గోల్స్‌ చేయడంలో విఫలమయ్యారు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో నెదర్లాండ్‌ జట్టు 3-1 తేడాతో అమెరికాను మట్టికరిపించింది. దీంతో డచ్‌ జట్టు క్వార్టర్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.

ఆట ప్రారంభమైన 9.30 నిమిషాల వద్ద  నెదర్లాండ్స్‌ ఆటగాడు డెంజెల్‌ డమ్‌ఫ్రైస్‌ ఇచ్చిన పాస్‌ను చక్కగా ఉపయోగించుకున్న మెంఫిస్‌ డిపే ఆ జట్టుకు తొలి  గోల్‌ అందించాడు. దీంతో డచ్‌ జట్టు 1-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి అర్ధభాగం అదనపు సమయంలో డేలీ బ్లైండ్ సూపర్‌ గోల్‌ కొట్టి నెదర్లాండ్స్‌ను 2-0తో మరింత ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఇక రెండో అర్ధభాగంలో 76 నిమిషాల వద్ద హజీ వ్రైట్‌ గోల్‌ కొట్టడంతో అమెరికా జట్టులో ఆశలు చిగురించాయి. అయితే 81 నిమిషాల వద్ద డచ్‌ ఆటగాడు డంజెల్‌ డమ్‌ఫ్రైస్‌ గోల్‌ కొట్టడంతో 3-1 తేడాతో నెదర్లాండ్స్‌ జట్టు మరింత ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. గోల్స్‌ చేయడానికి అమెరికాకు పలు అవకాశాలు వచ్చినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఇక రెండో అర్ధభాగం చివరి వరకు పోరాడినప్పటికీ యూఎస్‌ జట్టు మరో గోల్‌ చేయలేక చతికిలపడింది. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని